
వీరసింహారెడ్డి చిత్రంపై భారీ హైప్ నడుస్తుంది. సాధారణంగా బాలయ్య లుక్ పై కంప్లైంట్స్ ఉంటాయి. చాలా సినిమాల్లో ఆయన లుక్ పై విమర్శలు వచ్చాయి. వీరసింహారెడ్డిలో దర్శకుడు గోపీచంద్ మలినేని ఆయనకు అద్భుతమైన గెటప్ సెట్ చేశాడు. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్లు ఫస్ట్ లుక్ తోనే మూవీ మీద పాజిటివ్ బజ్ ఏర్పడింది.
ఇక థమన్ సాంగ్స్, ప్రోమోలు దాన్ని పెంచుకుంటూ పోయాయి. ట్రైలర్ విడుదలయ్యాక ఫ్యాన్స్ ష్యూర్ బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయ్యారు. మేకర్స్ సైతం ఆకాశమంత విశ్వాసం ప్రకటిస్తున్నారు. సంక్రాంతికి మేము గట్టిగా కొడుతున్నామంటూ వేదికలపై నిరభ్యంతరంగా చెబుతున్నారు. ఈ పరిణామాలు సగటు సినిమా ప్రేక్షకులతో పాటు బాలయ్య ఫ్యాన్స్ లో మూవీ బాగుంటుందనే నమ్మకం పెంచాయి.
ఈ ఇంపాక్ట్ కలెక్షన్స్ పై చూపించింది. యూఎస్ లో ఎన్నడూ లేని విధంగా బాలయ్య సినిమాకు హైప్ వచ్చింది. ప్రీమియర్ బుకింగ్స్ తోనే వీరసింహారెడ్డి(Veerasimhareddy Movie Review) హాఫ్ మిలియన్ దాటేసింది. మ్యాజిక్ ఫిగర్ మిలియన్ వైపుగా పరుగులు తీస్తుంది. మరి ప్రోమోలలో చూపించినంత విషయం, మేకర్స్ చెప్పినంత మేటర్ సినిమాలో ఉందా? లేదా?..
వీరసింహారెడ్డి కథ రాయలసీమ-ఇస్తాంబుల్ ప్రాంతాల్లో ప్రధానంగా సాగుతుంది. ఫ్యాక్షనిజాన్ని కొత్తగా పారిన్ తీసుకెళ్లారని ప్రేక్షకుల అభిప్రాయం. రాయలసీమ ఎపిసోడ్స్ లో బాలయ్య వీరసింహారెడ్డిగా విజృంభణ చేస్తారు. వీరసింహారెడ్డి ప్రధాన ప్రత్యర్థి ముసలిమడుగు ప్రతాప్ రెడ్డి. అధికార పార్టీ అండదండలతో అరాచకాలు చేస్తూ ఉంటాడు. ప్రజల తరపున వీరసింహారెడ్డి ప్రతాప్ రెడ్డిని అడ్డగిస్తాడు. వీరిద్దరి ఆధిపత్యపోరు నడుమ కథ ఇస్తాంబుల్ కి షిఫ్ట్ అవుతుంది...
ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో టాలీవుడ్ లో పదుల సంఖ్యలో చిత్రాలు తెరకెక్కాయి. సమరసింహారెడ్డి ఈ జోనర్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అంతకు ముందు కూడా ఫ్యాక్షన్ చిత్రాలు ఉన్నప్పటికీ సమరసింహారెడ్డి ఇండస్ట్రీ హిట్ కావడంతో ఆ చిత్రం జనాల మదిలో నిలిచింది. తర్వాత వచ్చిన నరసింహనాయుడు, చెన్నకేశవరెడ్డి, ఇంద్రసేనారెడ్డి మంచి విజయాలు సాధించాయి. ఈ చిత్రాల కథలన్నీ ఒకేలా ఉంటాయి.
భాషా చిత్ర తరహా స్క్రీన్ ప్లే ఈ చిత్రాల్లో చూడొచ్చు. ఒక భయంకరమైన నేపథ్యం ఉన్న హీరో అతి సామాన్యుడిగా ఒక కారణం, లక్ష్యం కోసం ముసుగులో బ్రతుకుతాడు. హీరో అరవీర భయంకరమైన గత చరిత్ర తెలిశాక ఫ్యాన్స్ థ్రిల్ ఫీల్ అవుతారు. వీరసింహారెడ్డి ఫార్మాట్ ఇది కాకపోయినా... సన్నివేశాలు, యాక్షన్, ఎపిసోడ్స్ గత ఫ్యాక్షన్ చిత్రాలను తలపిస్తాయి.
ఫ్యాక్షన్ చిత్రాల్లో కొత్త కథలేవీ ఉండవు అని చెప్పడానికి ఈ ఇతివృత్తం చెప్పాల్సి వచ్చింది. వీరసింహారెడ్డి మూవీ ఇస్తాంబుల్ లో మొదలై రాయలసీమకు వెళ్లి సెకండ్ హాఫ్ లో తిరిగి ఇస్తాంబుల్ కి వస్తుంది. రాయలసీమకు ఇస్తాంబుల్ కి ఉన్న లింక్ ఏంటి? హీరో-విలన్ ఆధిపత్య పోరు వేరు వేరు ప్రాంతాలకు ఎందుకు షిఫ్ట్ అయ్యిందనేది సస్పెన్సు.
మాస్ హీరోల సినిమాల నుండి కొత్త కథలు ఆశించడం జనాలు ఎప్పుడో మానేశారు. మేకింగ్, టేకింగ్, హీరో మేనరిజం, మాస్ ఎలివేషన్స్, గూస్ బంప్స్ లేపే డైలాగ్స్ ఉండి మూవీ ఎంటర్టైనింగా సాగితే హిట్టే. ఆ కోణంలో వీరసింహారెడ్డి మెప్పిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో బాలయ్య ఫైట్ సీన్స్, డైలాగ్స్, శృతి గ్లామర్ హైలెట్. సుగుణ సుందరి సాంగ్ బాగుంది అంటున్నారు. ఇంటర్వెల్ ట్విస్ట్ సైతం ఆకట్టుకుందని మెజారిటీ ఆడియన్స్ అభిప్రాయం.
సెకండ్ హ్లాఫ్ లో యంగ్ వీరసింహారెడ్డి(Veerasimhareddy) ఫ్లాష్ బ్యాక్ ప్రధాన బలం. జై బాలయ్య, మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి సాంగ్స్ ఫ్యాన్స్ కి ఊపిస్తాయి. థమన్ సాంగ్స్, బీజీఎమ్ ఎప్పటిలాగే సినిమాకు ప్లస్ అయ్యాయి. దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ నెగిటివ్ రోల్స్ లో అద్భుతంగా నటించారని అంటున్నారు. శ్రుతికి చెప్పుకోదగ్గ స్క్రీన్ స్పేస్ లేదని సమాచారం.
ఇక వీరసింహారెడ్డిలో ప్రధానంగా చెప్పుకోవాలిన్స అంశం పొలిటికల్ డైలాగ్స్. ఏపీ గవర్నమెంట్ ని బాలయ్య టార్గెట్ చేస్తాడు అనేది అందరికీ తెలిసిన నిజం. ఆయన గత సినిమాల్లో కూడా ఇది చూశాము. వీరసింహారెడ్డి మూవీలో మరింత ఘాటుగా, నేరుగా వైఎస్ జగన్ గవర్నమెంట్ ని బాలకృష్ణ (Balakrishna)టార్గెట్ చేశారు. దీనికి సంబంధించిన థియేటర్ రికార్డ్స్ బయటకు వచ్చాయి. వీరసింహారెడ్డిలో బాలకృష్ణ పొలిటికల్ అజెండా గట్టిగా నెత్తిన పెట్టుకున్నారు.
మొత్తంగా వీరసింహారెడ్డి మాస్ ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు. బాలకృష్ణ గత ఫ్యాక్షన్ చిత్రాల మాదిరే సినిమా ఉంటుంది. ఎన్నిసార్లు బాలకృష్ణ ఆ తరహా పాత్రలు చేసినా ప్రేక్షకులు అంగీకరిస్తారు. ఆయన ఇమేజ్ కి సెట్ అయ్యేవి కూడా అవే. ప్రీమియర్ టాక్ ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఫ్యాన్స్, మాస్ ఆడియన్స్ ని మూవీ నిరాశ పరచదు.