Sameera Reddy: సినిమా ప్రపంచం పైకి రంగులమయంగా కనిపిస్తుంది. కానీ, ఆ గ్లామర్ వెనుక ఎన్నో అవమానాలు, బాధలు దాగి ఉంటాయి. నటి సమీరా రెడ్డి తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి చెప్పిన నిజాలు షాక్‌కు గురిచేస్తున్నాయి.
సినిమా ప్రపంచం అంటేనే గ్లామర్, లైటింగ్స్, అందం. తెరపై మెరిసే హీరోయిన్లను చూసి 'వీళ్ల లైఫ్ ఎంత బాగుంటుందో' అనుకుంటాం. కానీ, ఆ అందమైన ముఖాల వెనుక ఎంత నొప్పి, అవమానం దాగి ఉంటుందో ఎవరికీ తెలియదు. దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్న నటి సమీరా రెడ్డి, తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న చీకటి రోజుల గురించి ఇటీవల బయటపెట్టారు. ఆమె మాటలు వింటే, ఈ గ్లామర్ ప్రపంచం ఎంత క్రూరంగా ఉంటుందో అర్థమవుతుంది.
26
ప్రతిభ కంటే ఆమె చర్మం రంగే ముఖ్యం..
2002లో 'మైనే దిల్ తుఝ్‌కో దియా' సినిమాతో సమీరా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పుడు ఆమెకు ఎదురైన మొదటి సవాలు తన చర్మం రంగు. సమీరాది చామనఛాయ రంగు (Dusky skin tone). కానీ అప్పటి ఇండస్ట్రీకి పాలలాంటి తెలుపు రంగు కావాలి. ప్రతిరోజూ షూటింగ్‌కు ముందు తన ముఖానికి మూడు నుంచి నాలుగు లేయర్ల తెల్లటి మేకప్ వేసేవారని సమీరా చెప్పారు. కొన్నిసార్లు ఆ మేకప్ వల్ల తన ముఖం బూడిద రంగులోకి మారిపోయేదట. ముఖం రంగుకు సరిపోయేలా శరీరం మొత్తానికి పెయింట్ వేసేవారని ఆమె గుర్తుచేసుకున్నారు. అంటే, ఒక నటి ప్రతిభ కంటే ఆమె చర్మం రంగే అక్కడ ముఖ్యమైపోయింది.
36
బాడీ షేమింగ్ కూడా..
రంగు మాత్రమే కాదు, బాడీ షేమింగ్ కూడా సమీరాను తీవ్రంగా బాధపెట్టింది. 20 ఏళ్ల వయసులో తనను తాను అద్దంలో చూసుకుని ఇష్టపడలేని పరిస్థితి ఉండేదట. 'చాలా లావుగా ఉన్నావు', 'నీ కళ్లు ఆకర్షణీయంగా లేవు' అని అనేవారట. దీంతో ఎప్పుడూ ప్యాడెడ్ బ్రా, హిప్ ప్యాడ్స్ వాడేదాన్ని అని సమీరా చెప్పారు. కళ్ల రంగు మార్చుకోవడానికి కాంటాక్ట్ లెన్స్‌లు కూడా వాడేదాన్నని, తనను తానుగా ఉండటానికి వాళ్లు అస్సలు ఒప్పుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
సమీరాకు ఎదురైన మరో పెద్ద సమస్య తన 'ఎత్తు'. బాలీవుడ్, టాలీవుడ్‌లోని చాలా మంది హీరోల కంటే సమీరా పొడవుగా ఉండేవారు. 'హీరో పొట్టిగా ఉండటంతో, నేను ఎప్పుడూ వంగి నడవాల్సి వచ్చేది. నా ఎత్తు కనిపించకుండా చాలా కష్టపడాల్సి వచ్చేది' అని సమీరా అన్నారు. ఈ మాట వినగానే నెటిజన్లు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను గుర్తుచేసుకుంటున్నారు. సమీరా ఎన్టీఆర్‌తో కలిసి 'అశోక్', 'నరసింహుడు' సినిమాల్లో నటించారు. ఆ సమయంలో ఎన్టీఆర్ కంటే సమీరా పొడవుగా కనిపించేవారు. అందుకే సమీరా 'పొట్టి హీరో' కామెంట్ నేరుగా ఎన్టీఆర్‌ను ఉద్దేశించిందేనని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
56
40 ఏళ్లు వచ్చాక ఏం చేసిందంటే?
అప్పటి అవమానాలు, విమర్శలు సమీరాను కుంగదీయలేదు, పైగా మరింత బలంగా మార్చాయి. 'నాకు 40 ఏళ్లు వచ్చాక నన్ను నేను పూర్తిగా అంగీకరించడం నేర్చుకున్నాను. హీరో పొట్టిగా ఉంటే అది అతని సమస్య, నాది కాదు అనే నిజం నాకు ఆలస్యంగా అర్థమైంది' అని ఆమె ఇప్పుడు నవ్వుతూ చెబుతారు.
66
ప్రతి మహిళకు స్ఫూర్తిదాయకం...
ప్రస్తుతం సమీరా రెడ్డి సోషల్ మీడియాలో 'బాడీ పాజిటివిటీ' గురించి అవగాహన కల్పిస్తున్నారు. తన తెల్ల జుట్టు, ముడతలు పడిన చర్మం, సహజమైన రంగును గర్వంగా చూపిస్తూ, 'నేను ఎలా ఉన్నానో అలాగే అందంగా ఉన్నాను' అని చాటిచెబుతున్నారు. సమీరా ప్రయాణం ప్రతి మహిళకు స్ఫూర్తిదాయకం.