
రేణు దేశాయ్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఆమె న్యాయ వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్‌గా మారింది. న్యాయవ్యవస్థ పెద్ద జోక్ అంటూ కామెంట్ చేసింది. డబ్బు ఉంటేనే న్యాయం జరుగుతుందని చెప్పింది. డబ్బు లేకుంటే న్యాయం జరగడం లేదని వెల్లడించింది. ఈ మేరకు ఆమె సుప్రీంకోర్ట్ వంటి న్యాయ వ్యవస్థలపై ఫైర్ అయ్యింది. ఎప్పుడూ కూల్‌గా ఉండే రేణు దేశాయ్ ఇలా ఒక్కసారిగా ఫైర్ కావడం ఆశ్చర్యపరుస్తుంది. ఇంతకి ఏం జరిగిందంటే.
వీధి కుక్కలకు సంబంధించిన సమస్య ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఇది సుప్రీంకోర్ట్ వరకు వెళ్లింది. ఇటీవల దీనిపై సుప్రీంకోర్ట్ తీర్పుని వెల్లడించింది. వీధి కుక్కలను ప్రత్యేక కేంద్రాలకు తరలించాలని తెలిపింది. దీనిపై తాజాగా రేణు దేశాయ్ స్పందించింది. సోమవారం ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ అసహనం వ్యక్తం చేసింది. ఈ తీర్పు హార్ట్ నుంచి వచ్చింది కాదని, వ్యక్తిగత ప్రభావంతో వచ్చిందని చెప్పింది.
సుప్రీంకోర్ట్ జడ్జ్ కుక్కలపై పగతోనే అలాంటి తీర్పు ఇచ్చారు. ఇలా మాట్లాడినందుకు తనని జైల్లో పెట్టినా పర్వాలేదు. తాను ఫేస్ చేస్తానని తెలిపింది. `ఆ తీర్పుకి ఏదైనా తలా తోకా ఉందా? ఆ కుక్క ఆయనకు ఏదైనా చేసి ఉంటుంది. అందుకే వ్యక్తిగతంగా ఆయన ఈ తీర్పుని చెప్పారు, తప్పితే హ్యూమానిటీ నుంచి వచ్చిన తీర్పు కాదిది. ఇప్పుడు న్యాయవ్యవస్థ మొత్తం పెద్ద జోక్ అయిపోయింది. నీ వద్ద డబ్బు ఉంటే నువ్వు సేఫ్, డబ్బు లేకపోతే నువ్వు సేఫ్ కాదు. ఇది మన దేశంలో ఉన్న ప్రస్తుత పరిస్థితి. ప్రతి రోజూ ఐదారు కుక్కలకు గాయాలవుతున్నాయి. వాటిని అంబులెన్స్ లో తీసుకెళ్తున్నాం. వాటి బిల్ నేను పే చేస్తున్నాను. రోజూ ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలా కుక్కలు గాయాలపాలవుతున్నాయి. అలాంటి కుక్కలను తాను సేవ్ చేస్తున్నాను` అని చెప్పింది.
అలాంటి కుక్కలు ఎవరి వద్దకు వెళ్లి కంప్లెయింట్ చేయాలి. ప్రతిదీ కరప్షన్ అయిపోయింది. ప్రతిదానికి డబ్బు తింటున్నారు. డబ్బుని తీసుకెళ్లిపోతారా? కొంచెం సెన్స్ ఉండాలి అంటూ ఫైర్ అయ్యింది రేణు దేశాయ్. అంతటితో ఆగలేదు. కుక్క కరిచి చిన్నారి చనిపోతే, ఆ కుక్కని కొట్టి చంపుతున్నారు. మరి చిన్నారిని రేప్ చేసి చంపేస్తుంటే అతన్ని ఎందుకు చంపడం లేదు. అప్పుడు ఏమైంది మీ మగతనం. ఆ రేప్ చేసిన చిన్న బిడ్డ ప్రాణం, ప్రాణం కాదా? అంటూ ప్రశ్నించింది.
రేణు దేశాయ్ మాట్లాడుతూ, `నేను కుక్కలు, మేకలు గురించి మాట్లాడటం లేదు, మనుషుల గురించే మాట్లాడుతున్నా. రోజూ చాలా మంది చిన్నారులు ఆకలితో చనిపోతున్నారు. వారిది ప్రాణం కాదా. హెల్మెంట్ లేకుండా ఎంతో మంది యువత ప్రాణాలు కోల్పోతున్నారు, వారివి ప్రాణాలు కాదా, కేవలం కుక్క చంపిన చిన్నారిదే ప్రాణమా? విలేజ్‌లో మందు తాగి గొడవలు చేస్తారు. ఆ మందు షాపులను మూసేసే దమ్ము మీకు ఉందా. కానీ కుక్కని చంపడానికి దమ్ము ఉంది. మీకు అంత ప్రేమ ఉంటే ఆ కుక్కలను ఇంటికి తీసుకెళ్లండి అని అంటున్నారు. గుడుల ముందు పేదవాళ్లకి డబ్బులు వేస్తారు. మరి అంత ప్రేమ ఉంటే ఎందుకు వారిని ఇంటికి తీసుకెళ్లడం లేదు. వారికి ఫుడ్‌ని పెట్టడం లేదంటూ ప్రశ్నించింది రేణు దేశాయ్.
ఈ క్రమంలో జర్నలిస్ట్ పై కూడా రేణు దేశాయ్ ఫైర్ అయ్యింది. ఏసీలో కూర్చొని ఇలా ఎన్నైనా మాట్లాడతారని అన్న జర్నలిస్ట్ పై రేణు దేశాయ్ మండిపడింది. ఆవేశానికి గురయ్యింది. నేను చెప్పేది మీరు విన్నారా లేదా? మీకు చెవులు ఉన్నాయా? ఏసిలో కూర్చొని మాట్లాడుతున్నా అంటున్నారు, రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే, ఆ బైక్ కంపెనీని మీరు ప్రశ్నిస్తారా? ఆ కంపెనీని మూయించేస్తారా?. నోరు ఉంది కదా అని సెన్స్ లేకుండా ఏదొక మాట్లాడుతున్నారు. మనుషుల కోసం మీరు ఏం చేశారో చెప్పండి. మీరు ఎంత మందికి హెల్ప్ చేశారో చెప్పిండి. నేను ఎందరో అనాధలకు చదువు చెప్పించాను. వృద్ధాశ్రయాలకు డొనేషన్స్ చేశాను. మీరు ఎప్పుడైనా అన్నదానం చేశారా?. చేసేది ఏం లేదు కానీ.. ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. నేను కాదు.. మీరు ఇంట్లో కూర్చొని ఏమీ చేయడం లేదు. మీరు నిజంగా మనుషుల కోసం ఆలోచిస్తే, ఆకలితో చచ్చిపోతున్న చిన్న పిల్లలను చూసి ఉండగలరా?. ఈ ప్రపంచంలో చిన్న పిల్లల ఆకలి తీర్చేంత డబ్బు లేదా? అన్నం లేదా?. నేను ఈరోజు కాదు, నా చిన్నప్పటి నుంచే సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. నేను ఎప్పుడూ ఇంత గట్టిగా ప్రెస్ మీట్స్ లో మాట్లాడలేదు` అని తెలిపింది రేణు దేశాయ్. ఒక్కసారిగా తన ఉగ్రరూపం చూపించింది.
అనంతరం దీనిపై రేణు దేశాయ్ వివరణ ఇచ్చింది. మీడియాపై ఫైర్ కావడంతో రేణుని అంతా ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై స్పందించింది. `నేను రాజకీయాల్లో జాయిన్ అవ్వడం లేదు. ప్లీజ్ రూమర్స్ ప్రచారం చేయకండి. నాకు రాజకీయాలు అంటే అస్సలు ఇష్టం లేదు. ఏ పార్టీలోనూ చేరడం లేదు. సామాజిక సేవా కార్యక్రమాలు, నా ఎన్జీవోతో నేను హ్యాపీగా ఉన్నాను. మీడియా ప్రతినిధులపై కేకలు వేయలేదు. తప్పుడు థంబ్ నెయిల్స్ పెడుతున్నారు. ఓ 55 ఏళ్ల వ్యక్తి ప్రెస్ మీట్ దగ్గరకి వచ్చి, ఉద్దేశపూర్వకంగా నాపై గట్టిగా కేకలు వేశాడు. నన్ను కొట్టడానికి స్టేజ్ మీదకు రావడానికి ప్రయత్నించాడు. సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ని అడ్డుకుంది. అందుకే నేను అతడితో మాత్రమే కోపంగా మాట్లాడాను. ప్రెస్ మీద కోపంతో అరవలేదు. నాకు మీడియా అంటే చాలా గౌరవం ఉంది. నేనెప్పుడూ అలా చేయను. రూమర్స్ స్ప్రెడ్ చేయకండి. నా వ్యక్తిగత జీవితంతో పెడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఎంత వరకు సమంజసం? పవన్ కళ్యాణ్ నిన్ను ఎందుకు వదిలేశాడో ఇప్పుడు అర్థమైందని, నాకు తిక్క ఉందని రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. దయచేసి అలా మాట్లాడకండి. నేను డబ్బుల కోసం పోరాడుతున్నానా? నేను కుక్కల కోసం కూడా కాదు, హ్యూమన్ లైఫ్ కోసం పోరాడుతున్నాను. అంత నీచంగా కామెంట్స్ పెడతారా` అని రేణు దేశాయ్ మరో వీడియో విడుదల చేస్తూ తన ఆవేదన వ్యక్తం చేసింది. మొత్తంగా ఇప్పుడు రేణు దేశాయ్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.