ఈ లీక్ వివాదం ఎంత ప్రభావం చూపించినప్పటికీ, భారతీయ ప్రేక్షకులలో పౌరాణిక చిత్రాలకు, ముఖ్యంగా ‘రామాయణ’ వంటి మహాగ్రంథ ఆధారిత కథలకు ఉండే ఆదరణను తక్కువ అంచనా వేయలేం. నితేష్ తివారి దర్శకత్వంలో రాబోతున్న ఈ విజువల్ వండర్‌లో అగ్ర నటీనటులు నటించడం, గ్లోబల్ స్థాయిలో సాంకేతిక ప్రమాణాలు పాటించడం వల్ల సినిమాపై సాధారణ ప్రేక్షకుల్లో ఇప్పటికీ అపారమైన ఉత్సుకత నెలకొంది. లీకైన దృశ్యాల ఆధారంగా పూర్తి సినిమా స్థాయిని అంచనా వేయడం తొందరపాటే అవుతుంది. చిత్ర బృందం గనుక పవర్ ఫుల్ అధికారిక ట్రైలర్, సరైన ప్రమోషనల్ కంటెంట్‌తో వస్తే, ఏర్పడిన ప్రతికూల వాతావరణం క్షణాల్లో తొలగిపోయి, బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి ఓపెనింగ్స్ సాధ్యమవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. రాముడి పాత్రలో బాలీవుడ్ స్టార్ నటుడు రణ్‌బీర్ కపూర్ నటిస్తుండగా, సీతగా తన సహజసిద్ధమైన నటనతో అలరించే సాయి పల్లవి కనిపించనుంది. ఇక లంకేశ్వరుడు రావణాసురుడి భయంకరమైన, పవర్ ఫుల్ పాత్రలో ‘KGF’ ఫేమ్ యష్ నటిస్తుండటం ఈ సినిమాకు అతిపెద్ద ఆకర్షణగా మారింది. వీరితో పాటు హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే, దశరథ మహారాజుగా పాతకాలపు రాముడు అరుణ్ గోవిల్, కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ వంటి దిగ్గజ తారలు ముఖ్య భూమికలు పోషిస్తున్నారు.