తమిళ బిగ్ బాస్ కార్యక్రమానికి గత మూడు సీజన్లుగా నటుడు విజయ్ సేతుపతి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఆయన గొంతు సంబంధిత సమస్యతో బాధపడుతున్న కారణంగా ఈ వీకెండ్ ఎపిసోడ్లకు దూరంగా ఉన్నారు విజయ్. దాంతో ఆయన స్థానంలో రమ్యకృష్ణ హోస్టింగ్ బాధ్యతలు చేపట్టారు. విజయ్ కి గొంతు సమస్య ఉందని ఆమె స్వయంగా వెల్లడించారు. తనదైన మాటతీరు, గంభీరమైన వ్యక్తిత్వంతో రమ్యకృష్ణ వేదికపై కనిపించడం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. కంటెస్టెంట్లతో మాట్లాడే విధానం, వారి ఆటతీరుపై స్పందించే తీరు షోకు కొత్త ఆసక్తిని తీసుకొచ్చాయి. అయితే ఆమె హోస్టింగ్ బాధ్యతలు ఎన్ని వారాల పాటు కొనసాగుతాయనే దానిపై నిర్వాహకుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
ఒక్క ఎపిసోడ్ కి రెమ్యునరేషన్ ఎంత?
ప్రస్తుతం రమ్యకృష్ణ పారితోషికానికి సంబంధించిన చర్చ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. పలు మీడియా కథనాల ప్రకారం, బిగ్ బాస్ తమిళ్ 10లో హోస్ట్‌గా వ్యవహరించేందుకు ఆమె ఒక్క ఎపిసోడ్‌కు సుమారు రూ.15 లక్షలు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీకెండ్ ఎపిసోడ్లు సాధారణంగా రెండు రోజుల పాటు ప్రసారమవుతుండటంతో, రెండు రోజుల పారితోషికం కలిపి రూ.30 లక్షల వరకు ఉంటుందని అంచనా. అయితే ఈ మొత్తాన్ని రమ్యకృష్ణ కానీ, బిగ్ బాస్ నిర్వాహకులు కానీ అధికారికంగా ధృవీకరించలేదు.