రామ్ గోపాల్ వర్మ.. ప్రపంచం దారి ఓవైపు అయితే, తనది మరో దారి అని చాటి చెప్పిన దర్శకుడు. తొలి సినిమాతోనే ఇండస్ట్రీకి ఝలక్ ఇచ్చాడు. సినిమాని ఇలా కూడా చేస్తారా? అని తలపండిన దర్శకులు కూడా నోరెళ్లబెట్టేలా చేశాడు. ఆయన ఒక ట్రెండ్ సెట్టర్ మాత్రమే కాదు, రూల్ బ్రేకర్ కూడా. సినిమా ఫార్మూలా అంటూ ఏం లేదని, ఎలా అయినా తీయోచ్చని, ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్ చేయడం, ఎంగేజ్ చేయడం ముఖ్యమని నిరూపించిన దర్శకుడు ఆర్జీవీ.
ఆయన నాగార్జున హీరోగా `శివ` సినిమాతో దర్శకుడిగా తెలుగు తెరకి పరిచయం అయ్యాడు. తొలి సినిమాతోనే సంచలనం సృష్టించాడు. అందరి దృష్టిని ఆకర్షించాడు. క్రైమ్, మాఫియా, గ్యాంగ్‌స్టర్ బేస్డ్ చిత్రాలతో బాగా పాపులర్ అయ్యాడు. `శివ`, `క్షణ క్షణం`, `అంతం`, `గాయం`, `గోవింద గోవింద`, `రంగీలా`, `అనగనగా ఒక రోజు`, `సత్య`, `జంగిల్`, `కంపెనీ`, `భూత్`, `సర్కార్`, `సర్కార్ రాజ్`, `కాంట్రాక్ట్`, `రక్త చరిత్ర` వంటి సినిమాలతో తానేంటో నిరూపించుకున్నాడు.
ఇప్పుడు దర్శకుడిగా సక్సెస్ కాలేకపోతున్నాడు వర్మ. చాలా నాసిరకమైన చిత్రాలు చేస్తున్నాడు. ఏమాత్రం సత్తా చాటలేకపోతున్నాడు. దర్శకుడిగా తనలో జ్యూస్ అయిపోయిందనేలా ఉంది ప్రస్తుతం ఆయన పరిస్థితి. ఇప్పుడు కేవలం వివాదాలు, సెన్సేషన్ కోసమే సినిమాలు చేస్తున్నారు. అలాంటి సబ్జెక్ట్ లే ఎంచుకుంటున్నాడు. ప్రారంభంలో ఉన్న వర్మ ఇప్పుడు కనిపించడం లేదు.
ఇదిలా ఉంటే వర్మది ఎవరి మాట వినని నైజాం. అందరు ఒకలా ఆలోచిస్తే, తాను భిన్నంగా ఆలోచిస్తాడు. చాలా ప్రాక్టికల్‌గా ఉంటాడు. తనకు ఏది అనిపిస్తే అది చేస్తాడు. ఓ రకంగా తన లైఫ్‌ని తనకు నచ్చినట్టు జీవిస్తున్నాడు. ఈ విషయాన్ని తన మొదటి సినిమా నుంచే చాటి చెప్పాడు. ఈ క్రమంలో ఏకంగా ఏఎన్నార్‌కే ఝలక్ ఇచ్చాడట వర్మ. ఎన్నోకష్టాలు పడి అన్నపూర్ణ స్టూడియోస్ కి రీచ్ అయిన వర్మ.. నాగ్‌తో `శివ` తీసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. సినిమా తీశారు. అది విడుదలై సంచలన విజయం సాధించింది.
సినిమా హిట్ అయిన నేపథ్యంలో ఇంతటి విజయాన్ని అందించిన ఆడియెన్స్ కి థ్యాంక్స్ చెబుతూ, ఓ ప్రెస్ నోట్‌ని రిలీజ్ చేయమని వర్మకి ఏఎన్నార్ చెప్పాడు. కానీ అక్కినేనికి షాక్ ఇచ్చాడు ఆర్జీవీ. తాను అలాంటి ప్రెస్ నోట్ ఇవ్వనని, తాను కాదు, ఆడియెన్సే తనకు థ్యాంక్స్ చెప్పాలని అన్నాడట. వర్మ మాటలకు ఏఎన్నార్‌కి ఫ్యూజులు ఔట్ అయినంత పనైందట. నాలాంటి దర్శకుడు దొరకడమే, ఇలాంటి సినిమాని ఎక్స్ పీరియెన్స్ చేయడమే వాళ్ల అదృష్టం అని, ఇలాంటి సినిమాని చూసినందుకు వాళ్లే తనకు థ్యాంక్స్ చెప్పాలని తెలిపాడు. వర్మలోని ఈ పిచ్చిని చూసి ఏఎన్నార్.. లోలోపల తిట్టుకుని సైలైంట్ అయ్యాడట. అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్లు చెప్పినా వినలేదట. తాను ఎవరికీ థ్యాంక్స్ చెప్పనని తెగేసి చెప్పాడట వర్మ. సో అలా తాను ఎలాంటివాడో తొలి సినిమాతోనే చెప్పేశాడు, అదే సమయంలో ఏఎన్నార్ లాంటి లెజెండ్‌కి సైతం తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశం అయ్యిందని టాక్.
రామ్ గోపాల్ వర్మ.. ఇటీవల `వ్యూహం` అనే సినిమాని తెరకెక్కించాడు. ఇది ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. అదే సమయంలో ఫస్ట్ టైమ్ ఆయన వెండితెరపై మెరిశారు. `కల్కి 2898 ఏడీ`లో గెస్ట్ గా కనిపించిన విషయం తెలిసిందే. ప్రభాస్‌తో ఓ నిమిషం పాటు ఆయన సీన్ ఉంటుంది.