రామ్ చరణ్ హీరోగా నటించిన శంకర్ తెరకెక్కించిన సినిమా ‘గేమ్ చేంజర్’ సంక్రాంతి స్పెషల్‌గా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా అనుకున్న స్దాయిలో టాక్ తెచ్చుకోలేకపోయింది.
మార్నింగ్ షో నుంచే ఈ సినిమా ప్రేక్షకుల నుండి డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ నటనకు మంచి మార్కులు పడినా, 'అప్పన్న' పాత్రలో చరణ్ జీవించాడని మెచ్చుకున్నా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవటం ఆగటం లేదు.
గేమ్ ఛేంజర్ రిలీజ్ కు ముందు బాగానే బజ్ క్రియేట్ చేసింది. సినిమాలో ఏదో ఉందనే భ్రమ కలగచేసింది. అడ్వాన్స్ బుకింగ్స్ తో సినిమా హడావుడి బాగానే చేసింది. చాలా ఏరియాల్లో హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. ఇక ఈ సినిమా ఫస్ట్ డే వసూళ్ళపైనే అందరి ఫోకస్ పడింది.
పాన్ ఇండియా స్థాయిలో పలు భాషల్లో విడుదలైన గేమ్ ఛేంజర్, మొదటి రోజున మంచి వసూళ్లను సాధించినట్లు సమాచారం. ఈ క్రమంలో మేకర్స్ మాత్రం తమ పోస్టర్ ద్వారా మొదటి రోజు వరల్డ్ వైడ్ గ్రాస్ వసూళ్లు 185 కోట్లుగా ప్రకటించారు. ఇది ఇప్పుడు ట్రోలింగ్ అవుతోంది.
రూ. 450 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. బుక్ మై షో వెబ్ సైట్‌లో తొలిరోజు 1.3 మిలియన్లకు పైగా గేమ్ ఛేంజర్ టికెట్లు అమ్ముడైనట్లు వెల్లడించారు. వీకెండ్, పండుగ కలిసి రావడంతో సేల్స్, కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.
టాక్ తో సంభందం లేకుండా చాలా చోట్ల కలెక్షన్స్ బాగున్నాయి. మాట్నీకి డ్రాప్ అయినా ఫస్ట్ షో,సెకండ్ షోలకు జనం బాగున్నారు. వీకెండ్ కూడా కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు.
గేమ్ ఛేంజర్ కలెక్షన్స్ తమిళంలో బాగానే ఉన్నా...మలయాళంలో 'గేమ్ ఛేంజర్' సినిమాకి భారీ ఎదురు దెబ్బ తగిలినట్లుగా ట్రేడ్ చెప్తోంది. కేరళలో ఫస్ట్ డే అసలు థియేటర్ షేర్ రాలేదని ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ 'రాధే శ్యామ్' తర్వాత, కేరళలో ఓపెనింగ్ డే నాడు జీరో షేర్ నమోదు చేసిన తెలుగు పాన్ ఇండియన్ స్టార్ సినిమా ఇదేనని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. మళయాళంలో బన్నికు మార్కెట్ ఉన్నా పుష్ప2 అక్కడ ఆడలేదు. మన సినిమాలపై అక్కడ మెల్లిగా మోజు తగ్గుతోంది.
తమిళం విషయానికి అక్కడ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా సరిగ్గా జరగలేదని తెలుస్తోంది. తమ తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ 'గేమ్ ఛేంజర్' సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారని అక్కడవారు ఆశించారు. 'ఇండియన్ 2' డిజార్డర్ ఫలితంతో విమర్శలు ఎదుర్కోవడంతో, ఈసారి బ్లాక్ బస్టర్ హిట్టుతో అందరికీ సరైన సమాధానం చెప్పాలని కోరుకున్నారు.
కానీ దర్శకుడు మళ్లీ వర్కవుట్ కానీ అవుట్ డేటెడ్ సినిమాతో ప్రేక్షకులను నిరాశపరిచారని అక్కడ మీడియా అంటోంది. తమిళనాడులో తొలిరోజు బుకింగ్స్ చాలా సెంటర్లలో యావరేజ్‌గా ఉండటమే తార్కాణం.