
కింగ్ నాగార్జున హీరోగా ఇన్నాళ్లు మెప్పించారు. ఇప్పుడు ఆయన కెరీర్ పరంగా పెద్ద టర్న్ తీసుకున్నారు. విలన్‌గా మారిపోయారు. ఇటీవల `కుబేర` చిత్రంలో కాస్త నెగటివ్ షేడ్ ఉన్న పాత్రని పోషించారు. ఇప్పుడు `కూలీ`లో పూర్తిస్థాయిలో విలన్‌గా మారారు. ఇందులో సైమన్‌గా అత్యంత క్రూరమైన విలన్‌గా నటించారు నాగార్జున. ఆయన ఈ పాత్ర చేస్తున్నారని తెలిసి రజనీకాంత్ కూడా షాక్ అయ్యారు. దర్శకుడు లోకేష్ ఈ విషయం చెప్పినప్పుడు నిజమేనా, ఆయన ఒప్పుకున్నారా? అని ఆశ్చర్యపోయారట. నాగార్జున ఈ మూవీ చేయడం సర్‌ప్రైజింగ్‌గా అనిపించిందన్నారు రజనీకాంత్.
బేసిక్‌గా తాను విలన్ కాబట్టి ఇలాంటి పాత్ర చేయాలని తనకు ఆసక్తిగా ఉందని, అలాంటిది ఈ పాత్రలో ఎవరు చేస్తారని ఎంతో క్యూరియాసిటీతో ఉన్నట్టు రజనీకాంత్ సోమవారం హైదరాబాద్‌లో జరిగిన `కూలీ` ఈవెంట్‌లో భాగంగా తాను ఇచ్చిన వాయిస్ వీడియోలో తెలిపారు. అయితే ఇదే ఈవెంట్‌లో నాగార్జున మాట్లాడుతూ, మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. వైజాగ్‌లో ఫస్డ్ డే షూట్ జరుగుతుందని, ఆ సమయంలో రజనీకాంత్, తనపై మొదటి షాట్ తీయాల్సి ఉందని, రజనీ సెట్ మీదకు వచ్చి నన్ను కిందకిపైకి రెండు మూడు నిమిషాల పాటు చూసి ‘మీరు ఇలా ఉన్నారని తెలిస్తే మన సినిమాలో నాగార్జున వద్దని లోకేశ్‌కు చెప్పేవాడిని` అని (నవ్వుతూ) అన్నట్టు తెలిపారు నాగార్జున. అదే తనకు పెద్ద కాంప్లిమెంట్‌గా భావిస్తున్నట్టు తెలిపారు నాగ్.
తాను నెగటివ్ రోల్ చేయడం గురించి మాట్లాడుతూ, ``నిన్నేపెళ్లాడతా’ చేసిన తర్వాత ‘అన్నమయ్య’ చేస్తుంటే.. ‘ఇప్పుడెందుకు ఇలాంటి కథ’ అని కొందరు నిరుత్సాహ పరిచే ప్రయత్నం చేశారు. నాకు కొత్తదనం ఇష్టం. సెట్‌కు వెళ్లాక బోర్ కొట్టకూడదంటే డిఫరెంట్ పాత్రలు చేయాలి. ఆ ప్రయత్నంతోనే ఇంతకాలం పని చేశాను. కొన్ని దెబ్బలు తిన్నా. మంచి మంచి విజయాలూ అందుకున్నాను. ఒకరోజు లోకేశ్ నన్ను కలిసి ‘మీరు విలన్‌గా చేస్తానంటే మీకో కథ చెబుతా. లేదంటే కాసిన్ని సినిమా కబుర్లు చెప్పి టీ తాగి వెళ్లిపోతా’ అన్నారు. లోకేష్ `ఖైదీ`, `విక్రమ్` నా ఫేవరట్ ఫిలిమ్స్. ఆ సినిమాలు చూసిన తర్వాత ఎప్పటికైనా ఈ దర్శకుడితో పనిచేయాలని బలంగా అనుకున్నా. ‘కూలీ’ కథ చెప్పిన తర్వాత నాకు చాలా నచ్చింది. ‘రజనీ సర్ ఈ కథ ఒప్పుకొన్నారా’ అని అడిగా. ఎందుకంటే ఈ కథలో ‘సైమన్’ పాత్ర కథలో ఆల్ మోస్ట్ హీరోలాంటిది. లోకేష్ హీరో విలన్స్ ని ఈక్వెల్ గా చూపిస్తాడు.
నా కెరీర్‌లో మొదటిసారి లోకేష్ కథ చెబుతుంటే రికార్డు చేసుకున్నా. ఇంటికి వెళ్లాక మళ్లీ మళ్లీ విన్నా. నాకు అనిపించిన కొన్ని మార్పులు చెప్పా. మరొకరైతే, ఈజీగా తీసుకుంటారు. కానీ, నేను చెప్పిన విషయాలు పరిగణనలోకి తీసుకుని ‘సైమన్’ పాత్రను లోకేశ్ తీర్చిదిద్దిన విధానం నాకు నచ్చింది. రజనీ సర్ చెప్పినట్లు ఎప్పుడూ మంచి వాళ్లగానే సినిమాలో నటిస్తే బాగుండదు కదా (నవ్వుతూ). వైజాగ్‌లో మా ఫస్ట్ షూట్ జరిగింది. రెండో రోజు షూటింగ్ సందర్భంగా రికార్డు చేసిన వీడియో సోషల్‌మీడియాలో లీకై వైరల్ అయింది. అది సీన్ చూసి ‘మనుషులు ఇంత ఈవిల్ గా ఉంటారా?’ అని లోకేష్ ని అడిగాను. ఇంతకంటే ఈవిల్ గా ఉంటారని చెప్పారు. మీ లోపల కూడా ఒక ఈవిల్ ఉన్నారని చెప్పారు. క్యారెక్టర్ పెర్ఫార్మెన్స్ కి అది కాంప్లీమెంట్ గా తీసుకున్నాను` అని వెల్లడించారు నాగ్.
లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన `కూలీ` చిత్రంలో రజనీకాంత్‌తోపాటు నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, శృతిహాసన్, సత్యరాజ్, సౌబిన్ వంటి వారు ముఖ్యపాత్రలు పోషించారు. పూజా హెగ్డే మోనికా సాంగ్‌లో రచ్చ చేసింది. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈమూవీ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్ట్ 14న విడుదల కాబోతుంది. భారీ స్థాయిలో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో సునీల్ నారంగ్, దిల్ రాజు, సురేష్ బాబు సంయుక్తంగా విడుదల చేస్తున్నారు. తెలుగు రైట్స్ రూ.50కోట్లకు కొన్నట్టు సమాచారం. గోల్డ్ వాచ్ స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ మూవీ సాగబోతుందని దర్శకుడు లోకేష్ ఇప్పటికే వెల్లడించారు.