యూత్ ఎంటర్ టైనర్ గా ఈరోజు థియేటర్లలోకి వచ్చిన చిత్రాల్లో ‘రాజయోగం’ ఒకటి. ఇంట్రెస్టింగ్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా యూత్ ను ఆకట్టుకునేలా టాక్ ను సంపాదించుకుంది. చిన్న సినిమా అయినా.. పెద్ద సినిమా అయినా కథ బాగుంటేనే ఆడియెన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. సూపర్ హిట్ చిత్రంగా నిలబెడుతున్నారు. ఈ క్రమంలో క్రైమ్ కామెడీ జానర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉందనేది తెలుసుకుందాం.
టైటిల్ : రాజయోగం (Rajayogam)
నటీనటులు : సాయి రోనక్, అజయ్ ఘోష్, ప్రవీణ్, గిరి, భద్రం, షకలక శంకర్, తాగుబోతు రమేష్, చిత్రం శ్రీను, సిజ్జు, మధునందన్
నిర్మాత : మణి లక్ష్మణ్ రావు,
సహ నిర్మాతలు : డాక్టర్ శ్యామ్ లోహియా, నందకిషోర్ దారక్
బ్యానర్ : శ్రీ నవబాలా క్రియేషన్స్, వైష్ణవి నటరాజ్ ప్రొడక్షన్స్
సంగీతం : అరుణ్ మురళీధరన్
రచన, దర్శకత్వం : రామ్ గణపతి
రిలీజ్ డేట్ : 30 డిసెంబర్ 2022
కథ :
ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు రిషి (సాయి రోనక్) మెకానిక్ గా పనిచేస్తుంటాడు. జీవితంలో లగ్జరీ లైఫ్ ను అనుభవించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తుంటాడు. రిచ్ ఫ్యామిలీకి చెందిన యువతిన పెళ్లి చేసుకుని సెటిల్ అవుదామని అనుకుంటాడు. ఈ క్రమంలో ఓ స్టార్ హోటల్ కు కారు డెలివరీకి వెళ్లి కారు ఓనర్ కూతురితోనే లవ్ లో పడతాడు. ఇదే సమయంలో 50 కోట్ల విలువ గల వజ్రాన్ని జేజిక్కించుకునేందుకు రాధా (అజయ్ ఘోష్) తన టీంతో తిరుగుతుంటాడు. ఈ క్రమంలో శ్రీ కూడా రాధాతో వెళ్లిపోతోంది. ఇంతకీ శ్రీ రిషిని వదిలి ఎందుకు వెళ్లిపోయింది.. మళ్లీ ఎప్పుడు కలిశారు? వజ్రాన్ని దక్కించుకునేందుకు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారనేది మిగితా సినిమా.
కథనం :
క్రైమ్ కామెడీ చిత్రాలంటే ప్రేక్షకులు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటారు. ఈ జానర్ లోనే వచ్చిన చిత్రం ‘రాజయోగం’. సినిమా కథకు తగ్గట్టుగానే టైటిట్ ఉండటం విశేషం. మిడిల్ క్లాస్ కుర్రాడు విలాసవంతమైన జీవితం కోసం ప్రేమలో పడటం.. వీరిద్దరూ ఓ వజ్రాల వేటలో చిక్కుకోవడం ఆసక్తిని పెంచుతుంది. కానీ యూత్ నే లక్ష్యంగా చేసుకుని దర్శకుడు రామ్ గణపతి బోల్డ్ కామెడీ, హద్దులు మీరిన రొమాన్స్ తో ఫ్యామిలీ ఆడియెన్స్ కు దగ్గర కాలేకపోయాడు. కామెడీ, రొమాన్స్ సన్నివేశాలు, పలు ట్విస్టులతో ఫస్ట్ ఆఫ్ సరదాగా సాగుతుంది. ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ సెకండాఫ్ పై ఆసక్తిని పెంచుతుంది. కానీ సెకండాఫ్ ఊహించనంత గొప్పగా లేదనిపిస్తుంది.
ప్లస్, మైనస్ లు :
హీరో సాయి రోనక్, హీరోయిన్ అకింత సాహా అన్ని ఎమోషన్స్ ను పండించారు. కామెడీ, రొమాన్స్, యాక్షన్ తో అలరించారు. కథ చాలా రోటీన్ గానే ఉంది. కథనం కూడా ఓ మాదిరిగా ఉంటుంది. కొత్తదనం చూపించడంలో దర్శకుడు కాస్తా విఫలం అయ్యాడనిపిస్తోంది. క్యారెక్టర్స్ ను రూపొందించిన తీరు బాగుటుంది. నేపథ్య సంగీతం ఫర్వాలేదు. సంగీతం అంతగా ఆకట్టుకోలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్తా మెరుగ్గా ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలూ కథకు తగ్గట్టుగానే ఉన్నాయి. ఓవరాల్‌గా మంచి వినోదాన్ని పంచే చిత్రంగా నిలిచింది.