ఎన్టీఆర్ 50, 60 దశకాల్లో ఎక్కువగా పౌరాణిక జానపద చిత్రాలు చేశారు. 70వ దశకం నుంచి ఆడియన్స్ అభిరుచికి తగ్గట్లుగా ఫ్యామిలీ చిత్రాలు, మాస్ చిత్రాలు చేశారు. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ ని పీక్ స్టేజికి తీసుకు వెళ్లిన దర్శకులు ఇద్దరు ఉన్నారు. ఒకరు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కాగా.. మరొకరు దర్శక రత్న దాసరి నారాయణ రావు. ఎన్టీఆర్, రాఘవేంద్ర రావు కాంబినేషన్ అయితే అప్పట్లో సంచలనం సృష్టించింది.
అడవిరాముడు, వేటగాడు లాంటి చిత్రాలు తిరుగులేని బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. రాఘవేంద్ర రావు తన యూట్యూబ్ ఛానల్ లో అడవి రాముడు విశేషాలు చెబుతూ కొన్ని ఆసక్తికర విషయాలు రివీల్ చేశారు. అడవి రాముడు చిత్రాన్ని కథలో కానీ స్క్రీన్ ప్లే లో కానీ చాలా పకడ్బందీగా ఉండేలా ప్లాన్ చేశాం. హీరో ఫారెస్ట్ ఆఫీసర్ అనే సంగతి విలన్ కి ఇంటర్వెల్ బ్యాంగ్ లోనే తెలుస్తుంది. డ్రమాటిక్ గా ఉండాలని అలా ప్లాన్ చేశాం.
సాధారణంగా అటవీ ప్రాంతాల్లో ఉండే ప్రజలని, ట్రైబల్ ని ఏనుగులు ఏమీ చేయవు. కొత్త వ్యక్తులు వెళితే అటాక్ చేస్తాయి. ఎన్టీఆర్ ఫారెస్ట్ ఆఫీసర్ గా అడవిలోకి ట్రైబల్ ఉండే ప్రాంతానికి వెళతారు. ఏనుగులతో సఖ్యత పెంచడానికి ఒక సీన్ క్రియేట్ చేశాం. పిల్ల ఏనుగులని రౌడీలా భారీ నుంచి ఎన్టీఆర్ రక్షిస్తారు. అది చూసి తల్లి ఏనుగులు ఎన్టీఆర్ కి పూలమాల వేస్తాయి. ఆ తర్వాత ఎన్టీఆర్ ఏనుగుపై ఎక్కి స్వారీ చేస్తారు.
హీరోని కలవడానికి హీరోయిన్ జయప్రద హడావిడిగా వస్తుంది. నేరుగా ఆమె హీరోని కలవకుండా ఒక సాంగ్ ద్వారా కలిసేలా చేయాలని అనుకున్నాం. ఆమె వస్తుండగా వాగులో పడిపోవడం.. హీరో వచ్చేలోపు చీర ఆరబెట్టుకోవడం చూపించాం. అప్పుడే ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి అనే సాంగ్ వస్తుంది. కొన్ని పాటలు హిట్ అవుతాయి, కొన్ని సూపర్ హిట్ అవుతాయి. చాలా తక్కువ పాటలు చరిత్ర సృష్టిస్తాయి. అలా చరిత్ర సృష్టించిన సాంగ్ ఇది.
ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక పాటకి థియేటర్స్ లో జనాలు కరెన్సీ నోట్ల వర్షం కురిపించిన పాట అది. ఎక్కడ చూసినా థియేటర్స్ లో మారుమోగిపోయింది. అడవిలో దాదాపు 40 రోజులు ఈ చిత్రాన్ని షూట్ చేశాం. షూటింగ్ చివరిరోజు ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. 40 రోజులు అడవిలో మీతో ట్రావెల్ చేశాం బ్రదర్.. ఇది నా జీవితంలో మరచిపోలేని గ్రీన్ మెమొరీ అని చెప్పి వెళ్లిపోయారు. ఎన్టీఆర్ చెప్పిన ఆ మాట తనకి ఆస్కార్ కంటే గొప్పది అని రాఘవేంద్ర రావు అన్నారు.