సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే వివాహిత కన్ను మూసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఏ11 గా అల్లు అర్జున్ ని పేరు చేర్చారు. ఈ కేసులో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ బెయిల్ పై విడుదలయ్యాడు. కాగా తెలంగాణ పోలీసులు మరోసారి అల్లు అర్జున్ ని విచారణకు పిలిచారు. BNS 35(3) సెక్షన్ క్రింద నోటీసులు జారీ చేశారు.
Allu Arjun
నేడు 11 గంటలకు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి హాజరయ్యారు. చిక్కడపల్లి సీఐ, ఏసీపీ అల్లు అర్జున్ ని విచారించనున్నారు. ఇటీవల అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు. తొక్కిసలాట ఘటనపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ప్రెస్ మీట్లో అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ పై కూడా చిక్కడపల్లి పోలీసులు ప్రశ్నలు అడగనున్నారట. కీలకమైన 12 ప్రశ్నలు అల్లు అర్జున్ కోసం పోలీసులు సిద్ధం చేశారట.
సీన్ ఆఫ్ అఫెన్స్ లో భాగంగా.. అల్లు అర్జున్ ని సంధ్య థియేటర్ వద్దకు తీసుకెళ్లనున్నారట. అల్లు అర్జున్ ఏ సమయానికి థియేటర్ లోకి వెళ్ళింది. బయటకు వచ్చింది, ఎలా బయటకు వచ్చిందన్న విషయాలపై వివరణ కోరనున్నారట. అల్లు అర్జున్ లీగల్ టీం తో పాటు విచారణలో పాల్గొననున్నారని సమాచారం.
1.సంధ్య థియేటర్ దగ్గర ఎందుకు ఊరేగింపుగా వెళ్లాల్సి వచ్చింది? 2. సంథ్య థియేటర్‌కు రావొద్దని యాజమాన్యం మీకు ముందే చెప్పిందా? 3. పోలీసుల అనుమతి లేదన్న విషయం తెలుసా?.. తెలియదా? 4. సంధ్య థియేటర్‌లో ప్రీమియర్ షోకు వస్తున్నట్లు అనుమతి కోరారా? ఆ కాపీ ఏమైనా ఉందా? 5. మీరు గానీ, మీ పీఆర్ టీమ్ గానీ పోలీసుల అనుమతి తీసుకున్నారా? 6. సంధ్య థియేటర్ వద్ద పరిస్థితిని మీ పీఆర్ టీమ్ ముందే మీకు వివరించిందా? 7. తొక్కిసలాటలో రేవతి చనిపోయిన విషయం మీకు ఎప్పుడు తెలిసింది?
8. తొక్కిసలాట జరిగిన విషయాన్ని మీకు ముందుగా ఎవరు చెప్పారు? 9. ఏసీపీ చెప్పినప్పుడు థియేటర్ నుంచి ఎందుకు వెంటనే వెళ్లిపోలేదు? 10. సినిమా ప్రారంభమైన కొద్దిసేపటికే తొక్కిసలాట ఘటన గురించి తెలిసినా మీరెందుకు సినిమా చూశారు? 11. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మీరు ముందే థియేటర్ యాజమాన్యానికి చెప్పారా? 12. రోడ్ షో కోసం మీరు ఎంతమంది బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్నారు? వంటి కీలకమైన ప్రశ్నలు అల్లు అర్జున్ కోసం పోలీసులు సిద్ధం చేశారట. అలాగే సీన్ ఆఫ్ అఫెన్స్ లో భాగంగా.. అల్లు అర్జున్ ని సంధ్య థియేటర్ వద్దకు తీసుకెళ్లనున్నారట. ఈ క్రమంలో సంధ్య థియేటర్ వద్ద భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారట.
వివాదం ఇలా మొదలైంది... డిసెంబర్ 4వ తేదీ రాత్రి పుష్ప 2 ప్రీమియర్స్ ప్రదర్శన నేపథ్యంలో అల్లు అర్జున్ సంధ్య థియేటర్ వద్దకు హీరోయిన్ రష్మికతో పాటు వెళ్లారు. అల్లు అర్జున్ రాకతో భారీగా అభిమానులు సంధ్య థియేటర్ కి చేరుకున్నారు. ఈ క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. రేవతి అనే మహిళ మృతి చెందింది. రేవతి తొమ్మిదేళ్ల కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ఘటనపై తెలంగాణ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అల్లు అర్జున్ పేరు ఏ 11గా చేర్చారు. డిసెంబర్ 12న అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. ఆయనకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. వైసీపీ ఎంపీ అడ్వకేట్ నిరంజన్ రెడ్డిని రంగంలోకి దించారు.
ఆయన వాదనలతో ఏకీభవించిన కోర్టు అల్లు అర్జున్ కి 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఒకరోజు రాత్రి అల్లు అర్జున్ చంచల్ గూడ జైలులో గడపాల్సి వచ్చింది. హైకోర్టులో వాదనలు జరుగుతుండగానే.. కింది కోర్టు తీర్పు మేరకు అల్లు అర్జున్ ని చంచల్ గూడ జైలుకి తరలించారు. కోర్టు బెయిల్ మంజూరు చేసిన క్రమంలో ఆర్డర్ కాపీ.. జైలు అధికారులకు అందాల్సి ఉంది. ఆ కాపీ మాకు సకాలంలో అందలేదన్న కారణం చూపుతూ అల్లు అర్జున్ ని జైలులో ఉంచారు.