Priyanka Singh: సాయి తేజ్ నుంచి ప్రియాంక సింగ్ గా తన ప్రయాణం గురించి తలుచుకుని ఎమోషనల్ అయ్యింది సోషల్ మీడియా స్టార్ పింకీ. బతుకుతానో లేదో తెలియిన పరిస్థితుల్లో.. నొప్పులతో నిద్రలేని రాత్రులను జయించి ఆమె ఇప్పుడు ఎలా ఉందంటే?
తెలుగు బుల్లితెరపై 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుని, ఆ తర్వాత 'బిగ్ బాస్' రియాలిటీ షోతో మరింత ప్రజాదరణ పొందిన సెలెబ్రిటీ ప్రియాంక సింగ్. చిన్నతనం నుంచే మనసులో తాను ఒక అమ్మాయిననే భావన ఉన్నప్పటికీ, సమాజం, పరిస్థితుల భయం మధ్య జీవించిన ఆమె.. చివరికి ధైర్యం చేసి అబ్బాయి (సాయి తేజ) రూపం నుండి పూర్తిగా అమ్మాయి (ప్రియాంక సింగ్)గా మారాలని నిర్ణయించుకున్నారు. అబ్బాయి నుంచి ట్రాన్స్‌జెండర్‌గా మారేందుకు ఆమె చేసిన పోరాటం, అనుభవించిన నరకం గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్న విషయాలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి.
24
ముంబైలో లింగమార్పిడి - శారీరక, మానసిక వేదన
ప్రియాంక సింగ్ ట్రాన్స్‌జెండర్‌గా మారి పదేళ్లు పూర్తయిన సందర్భంగా తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యింది. లింగమార్పిడి (Gender Reassignment Surgery) కోసం ఆమె ముంబై వెళ్లి అనేక అవస్థలు పడ్డారు. ఆపరేషన్ తర్వాత తీవ్రమైన రక్తం కారడం (బ్రీడింగ్), విపరీతమైన శారీరక నొప్పులు, నిద్రలేని రాత్రులు గడపాల్సి వచ్చిందని తెలిపారు. సర్జరీ అనంతరం కొంతకాలం విరామం తీసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా ఎదుర్కొన్నట్లు వెల్లడించారు. ఆ సమయంలో తీసుకున్న కొన్ని సర్జరీకి సంబంధించిన ఫొటోలను కూడా ఆమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
34
బ్రతుకుతానో లేదో తెలియని పరిస్థితి..
ప్రియాంక సింగ్ మాట్లాడుతూ.. "నా భవిష్యత్తు ఏమవుతుందో, నేను బతుకుతానో లేదో తెలియని పరిస్థితిలో తీవ్ర భయాందోళనలు, గందరగోళం అనుభవించాను. ఆ సమయంలో నేను చిందించిన కన్నీళ్లు, అనుభవించిన వేదనను మాటల్లో వర్ణించలేను" అని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ప్రస్తుతం ఎంతో కాన్ఫిడెంట్ తో లైఫ్ ను లీడ్ చేస్తోంది ప్రియాంక.
ఈ పదేళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే.. నా జీవితం అనేక భావోద్వేగ అధ్యాయాలతో నిండి ఉందని ప్రియాంక పేర్కొన్నారు. అందులో ఎంతటి మానసిక, శారీరక బాధాకరమైన సంఘటనలు ఉన్నాయో, వాటన్నింటినీ దాటుకుని అనుకున్న గుర్తింపు సాధించినందుకు అంతే సంతోషకరమైన క్షణాలు కూడా ఉన్నాయని ఆమె అన్నారు. సమాజం నుండి వచ్చిన విమర్శలు, అవమానాలు ఎదుర్కొని ఒక స్వతంత్ర మహిళగా నిలబడడం సాధారణ విషయం కాదు. "ఈరోజు అద్దంలో నన్ను నేను చూసుకున్నప్పుడు, నేను సాధించిన విజయాన్ని బట్టి నాపై నాకు ఎంతో గర్వంగా అనిపిస్తుంది" అని ప్రియాంక ధైర్యంగా స్పష్టం చేశారు.