
పవన్ కళ్యాణ్ నటించిన `హరి హర వీరమల్లు` మూవీ ఇటీవల ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి ప్రారంభం నుంచే మిశ్రమ స్పందన లభించింది.
మొదటి వీకెండ్‌లో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదనిపించింది. సుమారు రూ.110కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. కానీ వీక్ డేస్‌లో మూవీ కలెక్షన్లు దారుణంగా పడిపోయింది. ఆల్మోస్ట్ డిజాస్టర్ రేంజ్‌కి వెళ్లిపోయింది.
ఇప్పుడు `కింగ్‌డమ్` మూవీ రావడంతో ఆ సినిమా థియేటర్లన్నీ ఎత్తేయాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే ఈ మూవీపై తాజాగా నటుడు ప్రకాష్ రాజ్ హాట్ కామెంట్ చేశారు. పవన్ కళ్యాణ్‌పై ఫైర్ అయ్యారు. అభిమానాన్ని దోచుకుంటున్నారంటూ విరుచుకుపడ్డారు.
ప్రకాష్ రాజ్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. `హరి హర వీరమల్లు` మూవీ విషయంలో ఫ్యాన్స్ ని అధిక టికెట్ రేట్లతో దోచుకున్నారని, కంటెంట్ విషయంలో మోసం చేశారని అన్నారు.
సినిమాల్లో మీ రాజకీయం ఏంటని ప్రశ్నించారు. బలవంతంగా మీ ప్రాపగండాని రుద్దితే జనం చూడరని, అందుకు గట్టిగా సమాధానం చెప్పారని తెలిపారు ప్రకాష్ రాజ్. ఆయన ఏం చెప్పారనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.
`సినిమా ఇండస్ట్రీకి, ఆడియెన్స్ కి మధ్య ఒక బంధం ఏర్పడుతుంది. అది కథల పరంగా కావచ్చు, నటన పరంగానూ కావచ్చు. ఈ మధ్య వచ్చిన `హరి హర వీరమల్లు`గానీ, `కన్నప్ప`గానీ, `థగ్ లైఫ్`గానీ, `గేమ్ ఛేంజర్`గానీ, ప్రీ రిలీజ్ ఎలివేషన్స్ ఏంటి? చెత్త సినిమాలు తీసిన విషయం మీకు తెలియదా. ఎవరికి అమ్ముతున్నారు.
మీరు చేస్తున్నది నమ్మకద్రోహం కాదా. `బాహుబలి` లాంటి సినిమాని రాజమౌళి తీస్తే అది ఎలా ఆడింది. బిగ్ బడ్జెట్ సినిమాలకు అదొక ట్రెండ్ సెట్టింగ్ మూవీ. కానీ అదే మేం చేస్తున్నామని చెప్పి, ఎలాంటి సినిమాలను ఇస్తున్నారు. ఇచ్చి ఎలాంటి దోపిడి చేస్తున్నారు. ఎవరిని దోపిడి చేస్తున్నారు. మీ ఫ్యాన్స్ నే కదా` అంటూ ప్రశ్నించారు ప్రకాష్ రాజ్.
ఆయన ఇంకా చెబుతూ, `హై బడ్జెట్ సినిమాలు అంటున్నారు. మరి ఆ రేంజ్‌లో కథ ఉందా? వీఎఫ్‌ఎక్స్ ఉన్నాయా? ఫైట్స్ ఉన్నాయా? సినిమాకి ఐదేళ్ల(హరి హర వీరమల్లు సినిమాని ఉద్దేశించి) టైమ్ ఎందుకు పట్టింది?.
మీరు అక్కడ ద్రోహం చేసి, వడ్డీలకు వడ్డీలు పెరిగి, కథలను మార్చి, రాజకీయంగా మీరు ఒకస్థాయిలో ఉన్నారని, అందులో మీ రాజకీయ సిద్ధాంతాలను రుద్ది దాన్ని ఓ సినిమాగా తీయాలని వచ్చి, దానికి మేం ఇంత కష్టపడ్డామని చెబుతున్నారు.
సినిమా ప్రమోషన్స్ కి పది రోజులు ఎంత నిజాయితీగా వచ్చారో, అలా ముందే షూటింగ్‌కి వచ్చి ఉంటే రెండేళ్ల క్రితమే సినిమా విడుదలయ్యేది కదా? `అంటూ మండిపడ్డారు ప్రకాష్ రాజ్.
ఈ సందర్భంగా సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తావన తెస్తూ, `రజనీకాంత్ `బాబా` మూవీ తీశారు. తనే కథ రాసి, ప్రొడ్యూస్ చేసిన సినిమా అది. విడుదల రోజు చెన్నైలో ఓ రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఆ రోడ్డు పక్కన ఓ సైకిల్‌పై వెళ్లే ఓ వ్యక్తి ఏడుస్తూ కనిపించాడు.
అంతకు ముందు రెగ్యూలర్‌గా అదే రోడ్డుపై ఉంటాడు. అప్పుడప్పుడు డబ్బులిస్తుంటాను. ఆ రోజు ఏడుస్తూ కనిపించాడు. కారు ఆపి, ఎందుకు ఏడుస్తున్నావని అడిగితే, రెండు వందల టికెట్ సార్, బాస్ మోసం చేశారు అన్నాడు.
ఇప్పుడు ఈ మూవీని చూసింది చాలా మంది పవన్ కళ్యాణ్‌గారి ఫ్యాన్సే కదా, వారిని మోసం చేశామని మీకు తెలియడం లేదా? ఎవరిని దోచుకుంటున్నావు, ఏంటీ ఈ ప్రాపగండా సినిమాల గోల` అని కామెంట్ చేశారు ప్రకాష్ రాజ్.
ఈ సందర్భంగా మహేష్ బాబు, ఎన్టీఆర్‌లకు సంబంధించిన ప్రస్తావన తెస్తూ, `ఓ ఈవెంట్‌లో ఎన్టీఆర్, మహేష్ బాబు స్టేజ్ పై `మేం మేం ఫ్రెండ్స్, మీరు కొట్టుకోవద్దు` అన్నారు. కానీ మీరేం(పవన్ కళ్యాణ్) చెబుతున్నారు. తిరిగి కొట్టమంటాడా? చొక్కా చిచ్చుకుని ప్రేమిస్తుంటే వారిని నువ్వు సైనికులు అనుకుంటున్నావా? ఇది పెద్ద నాన్సెన్స్.
కానీ జనాలు మూర్ఖులు కాదు. ప్రధాని మోడీ బయోపిక్ తీస్తే, ఆ సినిమాని వంద మంది కూడా చూడలేదు. ఈ ప్రాపగండా సినిమాలను జనం చూడరు. నీ ఫ్యాన్సే ఉమ్ముతున్నారు. నువ్వేదో ప్రయోగం చేస్తే అది ఫెయిల్ అయితే బాధపడొచ్చు, కానీ ఇది నీ సోమరితనం వల్ల, అహాంకారం వల్ల ఐదేళ్లు అయ్యింది.
మొదట ఒక దర్శకుడిని అనుకున్నారు. తర్వాత మరో డైరెక్టర్‌ని తీసుకొచ్చారు. ఆ డైరెక్టర్ అనుకున్న కథని అనుకున్న విధంగా తీసే స్వేచ్ఛ ఇచ్చారా మీరు. సినిమా వేరే, రాజకీయం వేరు. మీరు పాపులర్ అయ్యిందే వినోదం ద్వారా, అలాంటిదాంట్లోకి మరోటి బలవంతంగా రుద్దడం ఎంత వరకు కరెక్ట్.
నేను బయట రాజకీయాలు మాట్లాడతా. కానీ నా సినిమాల్లో రాజకీయాలు మాట్లాడను, అది సెపరేట్ గేమ్. రెండింటిని ఇన్‌వాల్వ్ చేయను. ఇలాంటి వారికి జనాలు సమాధానాలు ఇస్తున్నారు. కానీ ప్రశ్నించే గొంతుకలు లేవాలి` అని అన్నారు ప్రకాష్ రాజ్.
ప్రశ్న యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు ప్రకాష్ రాజ్. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.