నాగ్ అశ్విన్ తప్పు చేస్తున్నాడా,ప్రభాస్ కు తలనొప్పిగా మారనుందా?

First Published Jun 18, 2024, 8:48 AM IST

 దాదాపు 600 కోట్లు బడ్జెట్ పెట్టామని చెప్తున్న ఈ సినిమాకు భీబత్సమైన  ఓపినింగ్స్ ఉంటేకానీ రికవరీలు ఆ స్దాయిలో ఉండవు. అంటే ఈ పాటికే ఈ సినిమా...

kalki 2898 ad


ప్రభాస్ సినిమా అంటే దాదాపు నెల ముందు నుంచి మంచి ఊపు ఉంటుంది. అభిమానులు కొత్త సినిమా ప్రమోషన్స్ ను చూసుకుని మురిసిపోతూ ఎంజాయ్ చేస్తూంటారు. అవే ఓపినింగ్స్ కు దారి తీస్తూంటాయి. అయితే ప్రభాస్ సినిమా కదా ప్రత్యేకంగా ప్రమోట్ చేసేదేముంది..జనం వాళ్ళంతట వాళ్లే వచ్చి చూస్తారు. అని అనుకుంటే మాత్రం సలార్ లాగ మీడియం రిజల్ట్ కే పరిమితం కావాల్సి ఉంటుంది. ఇప్పుడు సీక్వెల్స్ కు రకరకాల తర్జన భర్జనలు పడాల్సిన పరిస్దితి సలార్ 2 కు ఉంది. ఈ నేపధ్యంలో కల్కి సినిమా ప్రమోషన్స్ కూడా ఇప్పటిదాకా ఊపందుకోకపోవటం అందరకీ షాక్ ఇస్తోంది. ఈ విషయంలో నాగ్ అశ్విన్ తప్పు చేస్తున్నాడనే అంటున్నారు. 


చూస్తే రిలీజ్ డేట్ ఎంతో టైమ్ లేదు. దగ్గరకు వచ్చేసింది. ఈ నెల 27వ తేదీన విడుదల కాబోతున్న   “కల్కి 2898 AD” చిత్రానికి ఇప్పటికే ప్రారంభం కావాల్సిన  హంగామా ఎక్కడా కనపడడం లేదు .  రిలీజైన పాటలు పెద్దగా కిక్ ఇవ్వలేదు. యానిమేషన్ వీడియో సైతం అనుకున్న స్దాయిలో జనాల్లోకి వెళ్లలేదు. దాదాపు 600 కోట్లు బడ్జెట్ పెట్టామని చెప్తున్న ఈ సినిమాకు భీబత్సమైన  ఓపినింగ్స్ ఉంటేకానీ రికవరీలు ఆ స్దాయిలో ఉండవు. అంటే ఈ పాటికే ఈ సినిమా ఎలాగైనా  ఖచ్చితంగా చూడాలనే ఆలోచన జనాల్లోకి  నింపగలగాలి. ఆ మేరకు ప్రమోషన్స్ హోరెత్తించాలి.  కానీ  “కల్కి 2898 AD” సినిమాకు  ఆ సందడి కనపడటం లేదనేది సగటు ప్రభాస్ అభిమాని ఆవేదన. 
 

సినిమాలో కంటెంట్, ప్రభాస్ కటౌట్ చూసి కొంతమంది ఖచ్చితంగా ఈ సినిమా రిలీజ్ రోజునే చూడాలనుకుంటారు. అందులో తిరుగులేదు. అయితే  లో-ప్రొఫైల్ పబ్లిసిటీ ఒక్కోసారి కొంపముంచుతుంది. దానికి తోడు సైన్స్ ఫిక్షన్ కావటంతో టాక్ వచ్చాకే చూద్దామనుకునేవాళ్లు చాలా మంది ఉంటారు. కాబట్టి  ప్రేక్షకులు ఫస్ట్ వీకెండ్ లోనే  వచ్చి చూసేలా  “కల్కి 2898 AD” ప్రమోషన్ స్ట్రాటజీలను దర్శకుడు నాగ్ అశ్విన్ పెంచాలి. ఒక్కసారి బాహుబలి టైమ్ లో రాజమౌళి ఏ రేంజి ప్రమోషన్స్ చేసి పీక్స్ కు తీసుకెళ్లాడో గుర్తు చేసుకుంటే సమస్య కు పరిష్కారం దొరుకుతుందంటున్నారు ట్రేడ్ నిపుణులు. 
 


ఇలా నాగ్ అశ్విన్ ప్రమోషన్స్ పెద్దగా చేయకుండా   లో-ప్రొఫైల్ పబ్లిసిటీతో రిలీజ్ చేస్తే దాని ఇంపాక్ట్ వెళ్లి ప్రబాస్ పై పడుతుంది. పూర్తిగా తన భుజాలు మీదే మోయాల్సిన సిట్యువేషన్ క్రియేట్ అవుతుంది. ఆరు వందలు కోట్లు పెట్టుబడి అంటే ఎంత లేదన్నా లాభాలుతో కలిపి  వెయ్యి కోట్లు అయినా షేర్ రప్పించగలగాలి . అంటే ఎంత గ్రాస్ రావాలి. సినిమా బాగుందన్నా, ప్రభాస్ బాగా చేసాడన్నా సరిపోదు. వెనక్కి డబ్బులు వస్తే నే ప్రభాస్  మార్కెట్ పికప్ అవుతుంది. 


ఇప్పటికే  ఫస్ట్  సింగిల్‌ ‘భైరవ యాంథమ్‌’ పూర్తి లిరిక్‌ వీడియో విడుదలైంది. సినిమా ప్రచారంలో భాగంగా ఈ పాటను విడుదల చేసిన మేకర్స్‌.. ఈ సాంగ్‌ను భారతదేశపు అతిపెద్ద పాటగా పేర్కొన్నారు. ప్రభాస్‌, పంజాబీ సింగర్‌ దిల్జీత్‌ దోసాంజే ఈ పాటలో ఆకట్టుకునే వేషధారణతో తలపాగాలు ధరించి సందడి చేశారు.  హీరో  పాత్ర తీరు తెన్నులను ప్రేక్షకులకు పరిచయం చేసేలా సాగే ఈ పాటను రామజోగయ్య శాస్త్రి, కుమార్‌ రాశారు. తెలుగుతో పాటు హిందీ లిరిక్స్‌ కలగలసిన ఈ సాంగ్‌ను పంజాబీ సింగర్‌ దిల్జీత్‌ దోసాంజే, విజయనారాయణ్‌ సంయుక్తంగా ఆలపించగా, సంతోశ్‌ నారాయణన్‌ సంగీతం అందించారు. 
 

‘భైరవ యాంథమ్‌’నార్త్ ఇండియాను టార్గెట్ చేసినట్లు అర్దమవుతుంది. మనవాళ్లకు ఇక్కడ ఎక్కలేదు అనేకంటే కనెక్ట్ కాలేదనే చెప్పాలి. నార్త్ ఇండియా లో సిట్యువేషన్ ఏమిటీ అంటే వాళ్లకు ఈ పంజాబి సాంగ్స్  చాలా రొటీన్. నెలకు నాలుగైదు దిగిపోతూంటాయి. కాబట్టి వాళ్లకు కొత్తేమీ అనిపించలేదు. దాంతో ఈ పాటతో టీమ్ ప్రమోషన్స్ పరంగా సాధించింది మాత్రం పెద్దగా లేదనే చెప్పాలి. వీటిన్నటి దృష్ట్యా నాగ్ అశ్విన్ ...ప్రమోషన్స్ పెంచాల్సిన అర్జెన్సీ ఏర్పడింది.  అయితే  ప్రీ రిలీజ్  ఈవెంట్ ఘనంగా చేస్తాము కదా ఆ విధంగా ప్రమోషన్స్ చేస్తాము కదా అనే ఆలోచనలో టీమ్ ఉందని తెలుస్తోంది. 

Kalki 2898 AD


 కంటెంట్ విషయానికి వస్తే... కల్కి 2898 AD’ కథ మహాభారతం నుండి మొదలవుతుందని దర్శకుడు నాగ్ అశ్విన్ ముందే చెప్పాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో రాబోతున్న కల్కి 2898 ఏడీ మూవీపై ఏ రేంజి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయో అందరికీ తెలిసిందే. అతి తక్కువ సినిమాలతోనే అతి పెద్ద స్టార్ డైరక్టర్ గా ఎదిగిన నాగ్ అశ్విన్ సృష్టించిన కల్కి ప్రపంచాన్ని సిల్వర్ స్క్రీన్ పై చూసేందుకు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇన్ని రోజులు  సినిమాపై ఉన్న అంచనాలు.. నిన్న మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్ తో ఎక్సపెక్టేషన్స్ ఆకాశాన్ని తాకాయనటంలో సందేహం లేదు.  
 


 ‘ఈ భూమిలో మొదటి నగరం, చివరి నగరం కాశీ. పైన నీరు ఉంటుందట. భూమి పై ఉన్నదంతా పీల్చేస్తే అంతా అక్కడే ఉంటుంది’ అనే డైలాగ్స్ తో ఈ సినిమా ట్రైలర్ మొదలవుతుంది. ఇక ఈ సినిమాలోని గ్రాఫిక్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. మరో కొత్త ప్రపంచాన్ని చూపించాడు దర్శకుడు.ట్రైలర్ చూసిన వారంతా వావ్ అనే ఒకే ఒక పదం వాడుతున్నారు. టిక్కెట్ బుక్కింగ్స్ ప్రారంభమైన ఓవర్ సీస్ లో టిక్కెట్ సేల్స్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక 40 శాతం పెరిగాయని తెలుసింది. ఈ క్రమంలో ఈ సినిమాని గురించిన ప్రతీ అంశం ఆసక్తికరమే. 
 


ఈ చిత్రంలో ప్రభాస్ పాత్రను సూపర్ హీరోగా చూపించారు. అలాగే బరో వాహనాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. సినిమాలో అద్భుతమైన ఫైట్స్‌ని కంపోజ్ చేశారని ట్రైలర్ చుస్తే అర్ధమవుతుంది.  ఇక ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు దీపికా పదుకొణె, దిశా పటానీ, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, రాజేంద్ర ప్రసాద్ వంటి ఎందరో స్టార్ నటీనటులు కనిపించనున్నారు. సీనియర్ హీరోయిన్ శోభన, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ గెస్ట్  పాత్రలో నటించినట్లు తెలుస్తోంది. అయితే విజయ్ దేవరకొండ పాత్ర మాత్రం కేవలం క్యామియో రోల్ కాదని తెలుస్తోంది.  
 


ట్రైలర్‌లోనే దర్శకుడు దాదాపు స్టోరీ లైన్ చెప్పేశాడు. గాలి, నీరు, ఆహారం స్వచ్ఛంగా పుష్కలంగా ఉండే ప్రాంతం కాంప్లెక్స్. అక్కడికి వెళ్లాలని ప్రభాస్ ప్రయత్నిస్తూ ఉంటాడు. అక్కడికి వెళ్ళడానికి కావాల్సిన బౌంటీలను సంపాదించే పనిలో పడతాడు. ఈ క్రమంలోనే తనకు వచ్చిన డీల్స్ ను పూర్తి చేస్తుంటాడు. అప్పుడే అసలు కథ మొదలవుతుంది. దీపికాను తీసుకురావాలన్న డీల్ పై హీరో బయలుదేరుతాడు. ఆమెను కాపాడుతున్న అమితాబ్ (అశ్వథామ)తో భైరవ యుద్ధం చేస్తాడు. అలాగే ట్రైలర్ లో చిన్నపిల్లవాడు అమితాబ్ తో మాట్లాడుతూ కనిపించాడు. బహుశా అతనే కల్కి అయ్యే అవకాశం ఉంది. 


కల్కిని చెడ్డవారి చేతుల్లో పడకుండా అశ్వథామ కాపాడుతుంటాడు. ఆ తర్వాత ఆ బాధ్యతలను భైరవ తీసుకునే ఛాన్స్ ఉంది. ఇలా తనకు తెలియని ఓ పెద్ద యుద్ధంలోకి భైరవ అడుగు పెడతాడు. ట్రైలర్‌ను మనం క్షుణ్ణంగా గమనిస్తే ఇదే కథ మనకు కనిపిస్తుంది. కాగా ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ లో ప్రభాస్, అమితాబ్ , దీపికా పాత్రలు హైలైట్ కానున్నాయి. అలాగే కమల్ హాసన్ ను కూడా మాములు మానవుడిగా చూపించలేదు. ఆయన పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండనుంది. ఇక ‘కల్కి 2898 ఏడీ’ సినిమా బడ్జెట్ 600 కోట్ల రూపాయలు. ఈ సినిమా గ్రాఫిక్స్‌ కోసం భారీగా ఖర్చు చేశారు. 
 


నాగ్ అశ్విన్  మీడియా ఇంటరాక్షన్ చెప్పినదాని ప్రకారం ఈ చిత్రం మహాభారత కాలంలో మొదలై 2898 లో ముగుస్తుంది. అందుకే ఈ చిత్రానికి ‘Kalki 2898 AD’అని పెట్టామని చెప్పారు.  అలాగే  మేము ఇక్కడ  మన వరల్డ్ ని క్రియేట్ చేయటానికి  ప్రయత్నిస్తున్నాము. పూర్తి భారతీయతను ఈ సినిమాలో అందిస్తాము. ముఖ్యంగా  ఈ సినిమాని బ్లేడ్ రన్నర్ (హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ చిత్రం) లాగా చేయకూడదనేది మా ముందు ఉన్న ఛాలెంజ్. క్రీ.శ. 2898 నుండి మనం 6000 సంవత్సరాల వెనక్కి వెళితే, మనం క్రీ.పూ. 3102కి చేరుకుంటాం, అంటే కృష్ణుడి చివరి అవతారం గడిచిపోయినట్లే అని క్లారిటీ ఇచ్చారు నాగ్ అశ్విన్. 
 

Latest Videos

click me!