
డార్లింగ్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని గాయం వెంటాడుతుంది. ఆయన వైద్యుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ ఆ గాయం వెంటాడుతుందట. తరచూ ఆయన చికిత్స కోసం ఫారెన్ వెళ్లాల్సి వస్తుందట. ఇదే ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతుంది. మరి ప్రభాస్ కి ఏమైందనేది చూస్తే. ఈ ఏడాది మార్చిలో ప్రభాస్ కాలుకి ఆపరేషన్ కోసం స్పెయిన్ వెళ్లిన విషయం తెలిసిందే. `సలార్` చిత్ర షూటింగ్‌లో ఆయన కాలుకి గాయం అయిన కారణంగా ట్రీట్‌మెంట్ కోసం స్పెయిన్ వెళ్లారు. ఆల్మోస్ట్ ఆ గాయం తగ్గిపోయిందని అంతా భావించారు.
కానీ ఆ కాలు గాయం ఇంకా మానలేదట. తరచూ ఇప్పుడు కూడా ప్రభాస్ ట్రీట్‌మెంట్ చేయించుకున్నారట. షూటింగ్ లు పక్కన పెట్టి కూడా ట్రీట్‌మెంట్‌కి మధ్య మధ్యలో విదేశాలకు వెళ్లి వస్తున్నారని తెలుస్తుంది. ఇదే విషయాన్ని నిర్మాత అశ్వనీదత్ కూడా తెలిపారు. ఆయన ప్రభాస్‌తో `ప్రాజెక్ట్ కే`ని దాదాపు ఐదు వందల కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. గురువారం ఆయన మీడియాతో ముచ్చటిస్తూ `ప్రాజెక్ట్ కే` గురించి అనేక విషయాలను పంచుకున్నారు.
వారి వైజయంతి మూవీస్ సమర్పణలో వచ్చిన `సీతారామం` ఈవెంట్‌కి గెస్ట్ గా ప్రభాస్ వస్తారా? అని మీడియా అడగ్గా, అది సాధ్యం కావడంకష్టమన్నారు. ప్రభాస్‌ని ఇన్వైట్ చేయాలనుకుంటున్నామని చెప్పారు. అయితే ఆయన కాలు గాయం కారణంగా ఇప్పుడు కూడా ఆసుపత్రికి వెళ్తున్నారట. గాయానికి సంబంధించి తరచూ చెకప్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఆయన్ని పిలవడం కూడా ఈ టైమ్‌లో కష్టం అని, ఆయన్ని కష్టపెట్టడం ఎందుకని అన్నారు. ఇప్పటికే ఆయన యూరప్‌కి వెళ్లినట్టు తెలుస్తుంది. త్వరలోనే హైదరాబాద్‌కి రానున్నారట ప్రభాస్. ఆ తర్వాత `ప్రాజెక్ట్ కే` మళ్లీ స్టార్ట్ అవుతుందని చెప్పారు.
ఇక `ప్రాజెక్ట్ కే` చిత్రం గురించి చెబుతూ, తన కెరీర్‌లోనే కనీవినీ ఎరుగని రీతిలో ఈ సినిమా ఉంటుందని చెప్పారు. పాన్ ఇండియాకాదు, పాన్ వరల్డ్ టార్గెట్‌గా రూపొందిస్తున్నారు. `అవెంజర్స్` సినిమాల మాదిరగా ఉంటుందన్నారు. చైనా, అమెరికా, కెనడా వంటి అంతర్జాతీయ మార్కెట్ లక్ష్యంగా సినిమాని భారీ స్థాయిలో నిర్మిస్తున్నట్టు చెప్పారు. దర్శకుడు నాగ్ అశ్విన్ అత్యద్భుతంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట. ఆయన టేకింగ్ చూసిన అమితాబ్, దీపికా పదుకొనె వంటి నటులు కూడా మళ్లీ షూటింగ్ ఎప్పుడు ఎప్పుడూ అని ఎదురుచూస్తున్నారట.
ఇప్పటి వరకు చూడని అమితాబ్‌ని వెండితెరపై ఆవిష్కరించబోతున్నారట నాగ్ అశ్విన్. ఆయన తనకు అల్లుడిగా దొరకడం అదృష్టమనే స్థాయిలో చెప్పారు. అదే సమయంలో ఆయన తమ ఫ్యామిలీలోకి రావడం వల్లే తన వైజయంతి మూవీస్ మళ్లీ ప్రాణం పోసుకుందని చెప్పారు. `ప్రాజెక్ట్ కే`లో ప్రభాస్ నటన హైలైట్ గా ఉంటుందని, ఇందులో నెక్ట్స్ లెవల్ ప్రభాస్‌ని చూస్తారని తెలిపింది. ఈ చిత్రాన్ని డార్లింగ్ బర్త్ డే గిఫ్ట్ గా అక్టోబర్ 18న విడుదల చేయాలనుకుంటున్నట్టు తెలిపారు. ఈ జనవరికి షూటింగ్ పార్ట్ అవుతుందని, ఎనిమిది నెలలపాటు వీఎఫ్‌ఎక్స్ వర్క్ ఉంటుందన్నారు. ప్రభాస్‌కి పుట్టిన రోజు గిఫ్ట్ గా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. కుదరకపోతే జనవరి 2024లో రిలీజ్ చేస్తామన్నారు నిర్మాత అశ్వనీదత్.
వైజయంతి మూవీస్ పతాకంపై తెరకెక్కుతున్న `ప్రాజెక్ట్ కే`కి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా, ప్రభాస్‌కి జోడీగా బాలీవుడ్ భామ దీపికా పదుకొనె నటిస్తుంది. అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. దిశా పటానీలో మరో హీరోయిన్‌గా చేస్తుంది. సైన్స్ ఫిక్షన్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. విజువల్ వండర్ గా ఉండబోతుందని చెబుతున్నారు. దీంతోపాటు డార్లింగ్ ప్రస్తుతం `సలార్`, `ఆదిపురుష్` చిత్రాల్లోనూ నటిస్తున్నారు. `ఆదిపురుష్` సంక్రాంతికి విడుదల కాబోతుంది.