‘‘హత్య’ సినిమా నిర్మాత, దర్శకులపై కేసు: సునీల్ యాదవ్ ఫిర్యాదు
సునీల్ యాదవ్ ఫిర్యాదు మేరకు 'హత్య' మూవీ నిర్మాతపై పోలీసులు కేసు నమోదు చేశారు. సినిమాలో తనను, తన తల్లిని కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు.
సునీల్ యాదవ్ ఫిర్యాదు మేరకు 'హత్య' మూవీ నిర్మాతపై పోలీసులు కేసు నమోదు చేశారు. సినిమాలో తనను, తన తల్లిని కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు.
వాస్తవంగా జరిగిన కొన్ని ఘటనల్ని తీసుకుని.. సినిమా కథకు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసుకుని తీసే క్రైమ్ డ్రామాలు కత్తి మీద సామే. సినిమాలో ఎంత వరకు వాస్తవాలు చూపించొచ్చు.. ఎంత వరకు లిబర్టీ తీసుకోవాలి అనేది కష్టంగా మారుతుంది.
జనవరి 2025లో థియేటర్ లోనూ, రీసెంట్ గా ఓటిటిలోనూ హత్య మూవీ చూస్తుంటే.. అది ఎవరి కథ అయి ఉంటుందో అందరికీ అర్థం అవుతుంది. కానీ సినిమా ప్రారంభానికి ముందు మాత్రం ఇదంతా కల్పితం అని, అన్నీ కూడా కల్పిత పాత్రలే అని, ఎవరినైనా పోలి ఉంటే యాదృశ్చికం అని కార్డు వేశారు.
అయితే ఆ సినిమా వైఎస్ వివేకా హత్య కేసుని ఆధారంగా చేసుకుని ఈ కథ, స్క్రీన్ ప్లేని దర్శకురాలు శ్రీవిద్య బసవ రాసుకున్నారని అర్దమవుతుంది. ఇప్పుడు ఇదే సినిమాపై మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో రెండో నిందితుడు సునీల్ యాదవ్ కేసు నమోదు చేసారు.
శనివారం సునీల్ యాదవ్ తన తల్లితో సహా పులివెందుల పోలీస్ స్టేషన్‌కు వెళ్లి డీఎస్పీ మురళీనాయక్‌కు ఫిర్యాదు చేశారు.
వివేకా హత్యపై రూపొందించిన ‘హత్య’ సినిమాలో తనను, తన తల్లిని అవమానించేలా సన్నివేశాలు చిత్రీకరించారంటూ సునీల్ యాదవ్ పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే అంశంపై మూడు రోజుల కిందట కడపలో ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు శనివారం వేకువజామున కేసు నమోదు చేశారు.
‘హత్య’ సినిమా డైరెక్టర్, నిర్మాత, రచయితలను నిందితులుగా చేర్చారు. ఈ చిత్రంలోని సన్నివేశాలను ‘వైఎస్ అవినాష్‌రెడ్డి అన్న యూత్’ పేరుతో ఉన్న వాట్సప్ గ్రూప్‌లో పోస్ట్ చేసి, వైరల్ చేసినట్లు సునీల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీంతో ఆ వాట్సప్ గ్రూప్ అడ్మిన్ పవన్‌కుమార్‌ను కేసులో మొదటి నిందితుడిగా చేర్చారు. వైకాపా కడప సోషల్ మీడియా వాట్సప్ గ్రూప్ అడ్మిన్‌ను రెండో నిందితుడిగా చేర్చారు. వీరితోపాటు మరికొందరిని చేరుస్తూ.. కేసు నమోదు చేశారు.
ఈ క్రమంలో పవన్‌కుమార్‌ను పోలీసులు మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నారు. కడప సైబర్ క్రైమ్ స్టేషన్‌లో విచారించిన అనంతరం పులివెందుల తరలించారు.