పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ షూటింగ్‌లోకి అడుగుపెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల నేపథ్యంలో ఆయన సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. దాదాపు ఏడెనిమిది నెలల తర్వాత మళ్లీ ఆయన ముఖానికి మేకప్ వేసుకున్నారు. కత్తి పట్టి కదన రంగంలోకి దిగారు. ప్రత్యర్థుల అంతు చూసేందుకు రెడీ అయ్యారు. మొత్తంగా సినిమా సెట్‌లోకి అడుగుపెట్టారు.
బిగ్ బాస్ తెలుగు 8 ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం ఇక్కడ చూడండి.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నారు. `ఓజీ`, `హరిహర వీరమల్లు`, `ఉస్తాద్ భగత్ సింగ్`. ఈ మూవీ సినిమాలు ఇప్పటికే కొంత పార్ట్ చిత్రీకరణ జరుపుకున్నాయి. ఆ సమయంలోనే ఏపీలో రాజకీయాలు హీటెక్కడంతో పవన్ ఆ వైపు దృష్టిపెట్టాడు. దీంతో సినిమా షూటింగ్‌లు పూర్తి చేయలేకపోయాడు. అలా ఈ మూడు సినిమాల షూటింగ్ మధ్యలోనే ఆగిపోయాయి. ఎన్నికలు అయిపోయాయి. ఏపీలో అధికారంలోకి వచ్చారు. పవన్ డిప్యూటీ సీఎం అయ్యారు. వంద రోజులు కూడా పూర్తి చేసుకుని అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి రికార్డు సృష్టించారు పవన్.
రాజకీయంగా ఆయన అన్ని సెట్ చేసుకుని ఇప్పుడు పెండింగ్‌లో ఉన్న తన సినిమాల షూటింగ్‌లు పూర్తి చేసే పనిలో పడ్డారు. నేడు సోమవారం నుంచి మళ్లీ ఆయన షూటింగ్‌లోకి అడుగుపెట్టారు. ఈ రోజు ఉదయం ఏడుగంటలకే ఆయన `హరిహర వీరమల్లు` సినిమా షూటింగ్‌లో పాల్గొన్నట్టు టీమ్ తెలిపింది.
విజయవాడలో వేసిన ప్రత్యేక సెట్‌లో ఈ మూవీ చిత్రీకరణ జరుపుతున్నారు. పెండింగ్‌లో ఉన్న మిగిలిన షూటింగ్ పార్ట్ ని ఫాస్ట్ గా పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఈ టీమ్ షూటింగ్‌కి సంబంధించిన పక్కా ప్లాన్ రెడీ చేసింది, పవన్‌తో తీయాల్సిన సన్నివేశాలను ఫాస్ట్ గా తీయబోతున్నారట. దానికి సంబంధించిన ముందస్తు వర్క్ చేశారని, ఏమాత్రం టైమ్ వేస్ట్ కాకుండా చిత్రీకరణ పూర్తి చేయబోతున్నారని సమాచారం.
అయితే అందుకోసం విజయవాడ సమీపంలోనే ప్రత్యేక సెట్‌లు వేశారట. తన క్యాంపు ఆఫీసుకి దగ్గరలోనే సెట్ వేసి మిగిలిన రెండు సినిమాలు `ఓజీ`, `ఉస్తాద్ భగత్ సింగ్`లను కూడా పూర్తి చేయబోతున్నారు. అంతేకాదు పవన్ తో ఇంపార్టెంట్ సీన్లని, క్లోజప్ షాట్లని, ఆయన బాడీ కనిపించే షాట్లని తీసి, మిగిలిన లాంగ్ షాట్‌లను డూప్‌తో నడిపిస్తున్నారట.
ఇప్పటికే చాలా వరకు అలాంటి సీన్లు పూర్తయ్యాయని తెలుస్తుంది. ఈ రోజే పవన్ తిరిగి `హరిహర వీరమల్లు` చిత్ర షూటింగ్‌లో పాల్గొనగా, అదే సమయంలో రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించింది టీమ్. వచ్చే ఏడాది మార్చి 28న విడుదల చేయబోతున్నట్టు తెలిపింది.
`హరిహర వీరమల్లు` సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాబీడియోల్ నెగటివ్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా నిర్మాత ఏఎం రత్నం కొడుకు, దర్శకుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి మొదటగా క్రిష్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. సినిమా ఆలస్యం కారణంగా
దీన్నుంచి ఆయన తప్పుకున్నట్టు సమాచారం. అయితే దర్శకత్వ పర్యవేక్షణ చేస్తారని గతంలో టీమ్ వెల్లడించడం గమనార్హం. 17వ శతాబ్దానికి చెందిన మోఘల్ సామ్రాజ్యం నేపథ్యం కథతో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇందులో పవన్ వీరమల్లుగా కనిపిస్తుండగా, బాబీ డియోల్ ఔరంగాజేబ్‌గా నటిస్తున్నారు.
`హరిహర వీరమల్లు` సినిమా షూటింగ్ పూర్తి చేసిన అనంతరం పవన్ `ఓజీ` చిత్రీకరణలో పాల్గొనబోతున్నారు. దీనికి సుజీత్ దర్శకత్వం వహిస్తుండగా, డీవీవీ దానయ్య నిర్మాత. దీంతోపాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో `ఉస్తాద్ భగత్ సింగ్` సినిమా చేస్తున్నారు పవన్. చివరగా ఇది పూర్తి చేయనున్నారట. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది పవన్ నుంచి ఈ మూడు సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉంది.