
తరుణ్ భాస్కర్ ఇప్పుడు దర్శకుడిగా కంటే నటుడిగానే బిజీ అయిపోయాడు. ఓ వైపు హీరోగా, మరోవైపు కీలక పాత్రలు పోషిస్తూ ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ఆయన హీరోగా `ఓం శాంతి శాంతి శాంతిః` అనే చిత్రంలో నటించారు. ఇందులో ఈషా రెబ్బా హీరోయిన్. ఏఆర్ సజీవ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ప్రకటన నుంచే ఆసక్తిని క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్‌ని విడుదల చేశారు. హీరో విజయ్ దేవరకొండ శుక్రవారం సాయంత్రం సోషల్ మీడియా ద్వారా ఈట్రైలర్‌ని పంచుకున్నారు.
ఇక `ఓం శాంతి శాంతి శాంతిః` మూవీ ట్రైలర్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. మరి ఈ ట్రైలర్ ఎలా ఉందనేది చూస్తే, సెటిల్డ్ హ్యూమర్‌తో ఎంటర్‌టైన్‌మెంట్‌ని ప్రధానంగా చేసుకుని ఈ సినిమాని రూపొందించారని అర్థమవుతుంది. కోస్తాంధ్ర ప్రాంతంలో సాగే కథ ఇది. ఇందులో హీరో తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులకు వెళ్తాడు. ఈషా రెబ్బాతో పెళ్లి చూపులు. ఇద్దరు ఏం మాట్లాడుకోరు. ఈషా రెబ్బా ధైర్యం చేసి చివరగా ఏ సినిమా చూశారని అడుగుతుంది. `వాల్తేర్ వీరయ్య` చూసినట్టు చెబుతాడు తరుణ్. అంతేకాదు అందులో ఇంటర్వెల్ లో ఉన్న డైలాగ్ కూడా చెబుతాడు. `ఈడు నా ఎర, నువ్వు నా సొర` అని, సొర అంటే గుర్తొచ్చింది. సముద్రపు షాపలు తింటారా మీరు` అని అడుగుతాడు తరుణ్.
ఆ తర్వాత బ్రహ్మాజీ.. తరుణ్ భాస్కర్ గొప్పతనం చెబుతాడు. కానీ ఆయన రియాలిటీ ఏంటో చూపించారు. తాగుడు, యాటిట్యూడ్ వంటివి ఆవిష్కరించారు. బంగారు తీగ అంటూ వర్ణించారు. అవి చాలా ఫన్నీగా ఉన్నాయి. ఇందులో తరుణ్ తండ్రి పాత్ర పోషించిన పాత్రధారి `మా వాడు క్యారెక్టర్ లో రిప్.. రిచ్ ఇన్ పర్సనాలిటీ` అని వచ్చీ రాని ఇంగ్లీష్‌లో చెప్పడం షాకిస్తుంది. అనంతరం తరుణ్, ఈషాకిి పెళ్లి అవుతుంది. ఫ్యామిలీ లైఫ్‌లో ఇద్దరు బిజీ అవుతారు. అనంతరం గొడవల స్టార్ట్ అవుతాయి. చీటికి మాటికి భార్య ఈషా రెబ్బని కొడుతుంటాడు తరుణ్. వరుసగా ఆమెని కొట్టడం, దానికి ఇంట్లో చెల్లి, అమ్మ చేసే కామెంట్లు మరింత క్రేజీగా ఉన్నాయి.
ఇక బ్రహ్మాజీ కలగజేసుకుని మన గోదారోళ్లకి ఎటకారాలు సెట్ అయినట్టు ప్రతీకారాలు సెట్ కావురా అని చెప్పడంతో తరుణ్ భాస్కర్ మారిపోతాడు. వ్యాయామం చేయడం, యోగా చేయడం, కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం చేస్తుంటాడు.
ఇక ఫోన్ విషయంలో ఈషా రెబ్బ, తరుణ్ భాస్కర్ ఇద్దరు పట్టుదలతో ఉంటారు. ఇద్దరూ లాక్కునే ప్రయత్నంలో మరోసారి ఈషాని కొట్టే ప్రయత్నం చేస్తాడు తరుణ్. ఈ సారి ఈషా తిరగబడుతుంది. ఆయన్ని అడ్డుకుంటుంది. రివర్స్ ఎటాక్‌కి దిగుతుంది. దీంతో ఈషా దగ్గరకు వస్తేనే వణికిపోతుంటాడు తరుణ్. ఇది ఆద్యంతం ఫన్నీగా ఉంది. శాంతి, మనశ్శాంతి అంటూ యోగా చేస్తుంటాడు తరుణ్. ఫైనల్‌గా `బుద్ధి తక్కువై, సినిమా సలహా ఇచ్చాను, హీరోకి తక్కువ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి ఎక్కువలా తయారయ్యాడు` అని బ్రహ్మాజీ చెప్పడం ఆకట్టుకుంది.
మొత్తంగా ట్రైలర్ సెటిల్డ్ హ్యూమర్‌తో సాగుతూ ఆకట్టుకుంది. సినిమా మంచి ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్‌గా సాగుతుందని తెలుస్తోంది. ఇందులో గోదావరి యాస హైలైట్‌గా ఉండబోతుందని తెలుస్తుంది. ఇక ఈషా రెబ్బా పాత్ర ఇందులో బలంగా ఉంటుందని అర్థమవుతుంది. ఆమె చాలా సెటిల్డ్ యాక్టింగ్‌తో కనిపించింది. ఆమెకి కూడా ఈ మూవీ బౌన్స్ బ్యాక్ అయ్యే చిత్రంగా నిలుస్తుందనిపిస్తుంది. ఇక ఈ మూవీ ఈ నెల 30న థియేటర్లో విడుదల కాబోతుంది. దీన్ని సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణాని, అనుప చంద్రశేఖరన్, సాధిక షేక్, నవీన్ శనివారపు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.