`ఆర్‌ఆర్‌ఆర్`(RRR) సినిమా కోసమే దాదాపు నాలుగేళ్లు త్యాగం చేశాడు ఎన్టీఆర్(NTR). కరోనా కారణంగా, `ఆర్‌ఆర్‌ఆర్` డిలే కావడం కారణంగా ఆయన తన కెరీర్‌లో నాలుగేళ్లు మిస్ చేసుకున్నారు. ఈ గ్యాప్‌లో ఆయన మూడు సినిమాలు చేసేవారు. నాలుగు సంవత్సరాలు ఒక్క సినిమాకి కేటాయించినా రావాల్సిన క్రెడిట్, ఇమేజ్ రాకపోవడంతో కాస్త నిరాశలో తారక్ ఉన్నట్టు వినిపిస్తున్నా టాక్. అయితే ఆ గ్యాప్‌ని భర్తీ చేసే పనిలో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్.
తారక్ (Jr Ntr) సినిమాల లైనప్ భారీగానే ఉంది. ప్రస్తుతం ఆయన కొరటాల శివతో `NTR30` సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఈ నెలాఖరులోనే ప్రారంభం కాబోతుంది. `ఉప్పెన` ఫేమ్ బుచ్చిబాబుతో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ రెండు ప్యారలల్‌గా తెరకెక్కుతాయి. ఆ తర్వాత ప్రశాంత్ నీల్(Prashanth Neel)తో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇది భారీ పాన్ ఇండియా చిత్రంగా డిజైన్ చేశారు. ఈ చిత్రాలన్నీ పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కబోతున్నాయి.
దీంతోపాటు మరో బిగ్గెస్ పాన్ ఇండియా మూవీకి రంగం సిద్ధమవుతుందని సమాచారం. పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ రావడానికి ముందే పాన్ ఇండియా డైరెక్టర్‌గా పేరుతెచ్చుకున్న ఏకైక దర్శకుడు శంకర్(Shankar). భారీ చిత్రాలకు, విజువల్ వండర్స్ కి ఆయన పెట్టింది పేరు. శంకర్‌తో ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్నారనేది లేటెస్ట్ ఫిల్మ్ నగర్ టాక్. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నట్టు సమాచారం.
శంకర్ ఇప్పుడు రామ్‌చరణ్(Ram Charan)తో `RC15` సినిమా చేస్తున్నారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. ఇందులో శ్రీకాంత్, సునీల్, అంజలి కీలక పాత్రలు పోషిస్తుండగా, చరణ్‌కి జోడీగా కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రస్తుతం ఇది శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమా తర్వాత శంకర్.. హిందీలో రణ్‌వీర్ సింగ్‌తో `అపరిచితుడు 2` చేయబోతున్నారు. దీన్ని ఇప్పటికే ప్రకటించారు.
అనంతరం ఎన్టీఆర్‌తో (Ntr with Shankar) సినిమా చేయాలని భావిస్తున్నారట. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా భారీ స్థాయిలో ఈసినిమాని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. `ఆర్‌ఆర్‌ఆర్`లో ఎన్టీఆర్ నటన చూశాక శంకర్.. తారక్‌తో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారట. దీనిపై తారక్‌ని అప్రోచ్ కావడం, ఆయన కూడా సానుకూలంగా రియాక్ట్ కావడంతో మంచి కథ సెట్ అయితే ఈ ప్రాజెక్ట్ సెట్ అయినట్టే అని ఇండస్ట్రీ వర్గాల టాక్. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ ఈ వార్త మాత్రం ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పిస్తుంది. ఇదే నిజమైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బిగ్గెస్ట్ ఫెస్టివల్ అని చెప్పొచ్చు.