నందమూరి బాలకృష్ణ కెరీర్ పరంగా ప్రస్తుతం మంచి జోరు ప్రదర్శిస్తున్నారు. బాలయ్య కెరీర్ లో పీక్ స్టేజి అంటే సమరసింహారెడ్డి, నరసింహనాయుడు చిత్రాలు విడుదలైన టైం అనే చెప్పాలి. ఆ రేంజ్ లో కాకున్నా ప్రస్తుతం బాలయ్య చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రాణిస్తున్నాయి. సీనియర్ హీరోల్లో బాలయ్య వరుసగా నాలుగు హిట్లు కొట్టడం అంటే రేర్ ఫీట్ అని చెప్పొచ్చు.
అఖండతో మొదలైన బాలయ్య తాండవం తాజాగా విడుదలైన డాకు మహారాజ్ చిత్రంతో కూడా కొనసాగుతోంది. నేడు విడుదలైన డాకు మహారాజ్ చిత్రానికి అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. సెకండ్ హాఫ్ కొంత స్లోగా ఉన్నప్పటికీ ఓవరాల్ గా ఫ్యాన్స్ ఎంజాయ్ చేసేలా ఉందని అంటున్నారు. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ ఇలా బాలయ్య నాలుగు హిట్లు అందుకున్నారు.
కొన్నేళ్ల క్రితం బాలయ్య నటించిన సినిమాలు గమనిస్తే ట్రోలింగ్ స్టఫ్ గా సోషల్ మీడియాలో వైరల్ అయ్యేవి. సింహా ముందు వరకు బాలయ్య నటించిన చాలా చిత్రాలు ట్రోలింగ్ కి గురయ్యాయి. సింహా తర్వాత పరిస్థితి కాస్త మెరుగుపడింది. పూర్తిగా కాదు. అఖండ తర్వాత బాలయ్యలో స్పష్టమైన మార్పు మొదలయింది. బాలయ్య లో ఇంత మార్పుకి కారణం ఏంటి ? వరుస హిట్లు ఎలా సాధ్యం అవుతున్నాయి అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో కొన్ని ఆసక్తికర విషయాలు వైరల్ అవుతున్నాయి.
బాలకృష్ణ గతంలో డైరెక్టర్లని గుడ్డిగా నమ్మేవారు. అందుకు ఉదాహరణ ఒక్క మగాడు చిత్రం. కథ కూడా వినకుండా వైవిఎస్ చౌదరి తమ ఫ్యామిలీకి అభిమాని అని బాలయ్య ఆ చిత్రం చేశారు. రిజల్ట్ ఏంటో అందరికీ తెలుసు. ఆలాంటి సిల్లీ కథలతో బాలయ్య చాలా చిత్రాలు చేశారు. కానీ అఖండ నుంచి బాలయ్య దర్శకులని గుడ్డిగా నమ్మడం లేదు. బాలయ్యలో వచ్చిన ప్రధానమైన మార్పు ఇదే. కథా చర్చల్లో బాలయ్య బాగా ఇన్వాల్వ్ అవుతున్నారట. భగవంత్ కేసరి, డాకు మహారాజ్ చిత్రాల్లో బాలయ్య స్వయంగా కొన్ని ఐడియాలు ఇచ్చారట. అవసరమైన మార్పలు సూచించారు. తన ఫ్యాన్స్ కి ఏమి కావాలి అనేది బాలయ్య డైరెక్టర్లకి చెబుతున్నారు.
బాలయ్యలో వచ్చిన మరో మార్పు ఏంటంటే.. ట్రెండుకి తగ్గట్లుగా యువ దర్శకులని ఎంచుకోవడం. అవుట్ డేటెడ్ డైరెక్టర్లని పక్కన పెట్టేసి తన బాడీ లాంగ్వేజ్ పూర్తిగా తెలిసిన బోయపాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అదే విధంగా గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, బాబీ లాంటి యువ దర్శకులని బాలయ్య ఎంచుకుంటున్నారు. తాను ఎంచుకునే కథల విషయంలో బాలయ్య తన చిన్న కుమార్తె తేజస్విని అభిప్రాయం కూడా తెలుసుకుంటున్నారట. ఇటీవల తేజస్విని తన తండ్రి సినిమాల కథల ఎంపిక, ఇతర విషయాలని దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ బాలయ్య వరుస హిట్లు కొడుతున్నారనే అభిప్రాయం వినిపిస్తోంది.