గత సంక్రాంతికి 2023లో ‘వీరసింహారెడ్డి’ బరిలో దిగి విజయాన్ని అందుకున్న బాలయ్య ఇప్పుడు ‘డాకు మహారాజ్’ తో ప్రేక్షకులు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సినిమా రిలీజ్ కు ముందు సరైన బజ్ క్రియేట్ కాలేదు. ట్రైలర్ లో స్టైలిష్ యాక్షన్ కనిపించింది
కానీ ఫ్యాన్స్ కోరుకున్న మాస్ బాలయ్య తక్కువయ్యాడనే కామెంట్స్ వినిపించాయి. అయితే రిలీజ్ అయ్యాక బాబి...తమ హీరో బాలయ్య అదిరిపోయేలా చూపించారనే టాక్ వినిపిస్తోంది. సినిమా గురించి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటిటి వివరాలు మీడియాలో వైరల్ అవుతున్నాయి.
'డాకు మహారాజ్' సినిమాలో సీతారాం పాత్రలో బాలకృష్ణ నటించారు. ఆయనకు జంటగా ప్రగ్యా జైస్వాల్ నటించారు. 'డాకు మహారాజ్' సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ యువ నిర్మాత, సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగ వంశీ, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకం మీద సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేశారు. ఈ సంస్థల్లో రూపొందిన సూపర్ హిట్ సినిమాలు చాలా వరకూ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ తీసుకుంది. ఇప్పుడు కూడా ఆ సంస్థకే 'డాకు మహారాజ్' వెళ్ళటం జరిగింది.
డాకూ మహారాజ్ థియేటర్లలో విడుదలైన ఎన్ని రోజులకు ఓటీటీలో సినిమా వస్తుంది? అంటే...ఏ స్దాయి హిట్ అనే దానిపై ఆధారపడుతుంది అంటున్నారు. చాలా సినిమాలు థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకు ఓటీటీలో వస్తున్నాయి.
'డాకు మహారాజ్' విషయంలో కూడా అదే జరగవచ్చని అంటున్నారు. ఫిబ్రవరి రెండవ వారంలో ఈ సినిమా ఓటిటికు రావచ్చు అని తెలుస్తోంది. అయితే పెద్ద సక్సెస్ అయితే మాత్రం 45 రోజుల తర్వాతే ఓటిటిలోకి వస్తుంది.
చిత్రం కథ ఏంటి
కథ 1996లో జరుగుతూంటుంది. మదనపల్లి హిల్ స్టేషన్ లో ఓ పెద్ద కోటీశ్వరుల కుటుంబం. ఆ కుటంబానికి చెందిన ఎస్టేట్ లీజుకు తీసుకుని అందులో అక్రమాలు చేస్తూంటారు లోకల్ పొలిటీషన్ (రవికిషన్). ఆ విషయం తెలిసి ఆ కుటుంబ పెద్ద అడ్డుపడితే ... ఆ కుటుంబంలోని ఓ పాపని వాళ్ళు టార్గెట్ చేస్తారు. ఆ పాప ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని ఒకరికి ఫోన్ రావడంతో ఆ చిన్నారి దగ్గరకు బాలయ్య బయిలుదేరతాడు. ప్రమాదంలో ఉందని ఫోన్ వచ్చిన ఆ పాప ఇంటిలో బాలయ్య డ్రైవర్‌గా చేరారు. తనను నానాజీగా పరిచయం చేసుకుంటాడు. అక్కడ పాపని కంటికి రెప్పలా కాపాడుతూంటాడు. ఆ కుటంబానికి దగ్గర అవుతూంటాడు.
మరో ప్రక్క ఎన్కౌంటర్ స్పెషలిస్టు స్టీఫెన్ రాజ్ (మలయాళ నటుడు షైన్ టామ్ చాకో) 'డాకు ఎక్కడ?' అని వెతుకుతూ ఎస్టేట్ గురించి తెలుసుకుంటాడు. ఇక పాపను, కుటుంబాన్ని రవికిషన్ ఏమీ చెయ్యలేకపోవటంతో, వాళ్ళను ఎలాగైనా అంతమొందించి, అక్కడ ఎస్టేట్ లో ఉన్న తమ మాల్ ని తీసుకెళ్లాలని ఠాకూర్( మెయిన్ విలన్ బాబీ డియోల్) ఎంట్రీ ఇస్తాడు.
అప్పుడు బాబీడయోల్ కు బాలయ్య గురించిన ఓ నిజం తెలుస్తుంది. అలాగే ఎన్కౌంటర్ స్పెషలిస్టు స్టీఫెన్ రాజ్ కు సైతం బాలయ్య ఎవరో తెలుస్తుంది. అతను మరవరో రాదు డాకూ మహారాజ్ అని గుర్తిస్తాడు. అసలు ఈ డాకూ మహారాజ్ ఎవరు...ఆ పాప కుటుంబానికి, అతనికి సంభందం ఏమిటి...ఆ స్దాయి వ్యక్తి ఓ డ్రైవర్ గా వాళ్ల ఇంట్లో చేరాల్సిన అవసరం ఏమిటి, బాబీ డయోల్ కు బాలయ్యకు మధ్య ఉన్న వైరం ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.