మోహన్ బాబు జీవితం వివాదాలమయం, బాంబు బ్లాస్ట్ నుండి కన్న కొడుకుపై దాడి వరకు!

First Published | Dec 11, 2024, 11:49 AM IST

నటుడిగా ఎంతో కీర్తిని పోగేసుకున్న మోహన్ బాబు జీవితం వివాదాలమయం. ఆయన ప్రవర్తన, మాట తీరు అనేక గొడవలకు కారణమైంది. మోహన్ బాబు కేంద్రంగా చోటు చేసుకున్న వివాదాస్పద సంఘటనలు ఏమిటో చూద్దాం.. 
 

మోహన్ బాబు జీవితంలో వివాదాలు

విలక్షణ నటుడు మోహన్ బాబు సుదీర్ఘ నట ప్రస్థానం లో అనేక వివాదాలకు కేంద్రబిందువు అయ్యాడు. వాటిలో కొన్ని చర్చించుకుందాం.. 

మోహన్ బాబు ముక్కోపి. వేదికలపై కూడా తనకు అనిపించింది మాట్లాడేస్తాడు. దాని వలన ఎదుటవారు బాధపడతారనే ఆలోచన చేయరు. దానికి ఆయన పెట్టుకున్న పేరు ముక్కుసూటితనం. సెట్స్ లో నటులను కొట్టడం, తనకంటే సీనియర్ హీరోలను తక్కువ చేసి మాట్లాడటం పరిపాటి. ముఖ్యంగా తన గురించి తాను డబ్బు కొట్టుకోవడం మోహన్ బాబుకు ఉన్న అతిపెద్ద చెడ్డ అలవాటు. 

మోహన్ బాబు నట ప్రస్థానంలో అనేక మైలురాళ్ళు ఉన్నాయి. నిర్మాతగా కూడా ఆయన చిత్ర పరిశ్రమకు సేవలు అందించారు. కానీ ఆయన వ్యక్తిగత జీవితం వివాదాల మయం. ప్రజల్లో కూడా ఆయన మీద ఒకింత వ్యతిరేక భావన ఉంది. మంచు హీరో సినిమా రిలీజ్ అయితే కనీసం పట్టించుకునే ప్రేక్షకులు లేరు. మోహన్ బాబు నటించిన సన్ ఆఫ్ ఇండియా చిత్రానికి పోస్టర్స్ ప్రింట్ ఖర్చు కాదు కదా... అవి అటించడానికి కొన్న మైదా ఖర్చు కూడా రాలేదు. మోహన్ బాబు వ్యవహార శైలి ఆయనపై గౌరవాన్ని తగ్గిస్తూ వచ్చింది. 

హీరోయిన్స్ పై దాడి

మోహన్ బాబు సెట్స్ లో పలువురు నటులపై చేయిచేసుకున్నాడనే వాదన ఉంది. ఈ విషయాన్ని ఆయన కూడా ఒప్పుకున్నాడు. ఆయన కెరీర్లో అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా ఉన్న పెదరాయుడు మూవీ సెట్స్ లో ఒక నటిని మోహన్ బాబు అందరి ముందు కొట్టి అవమానించాడట. 

సాక్షి శివానంద్ చెల్లెలు శిల్పా శివానంద్ ని మోహన్ బాబు కొట్టడంతో పాటు భయాందోళనలకు గురి చేశాడు. విష్ణు డెబ్యూ మూవీ 'విష్ణు'లో శిల్పా శివానంద్ హీరోయిన్ గా చేసింది. అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ జరుగుతుండగా విష్ణుతో ఒక కిస్ చేయాలని మోహన్ బాబు పట్టుబట్టారట. 

అందుకు నిరాకరించడంతో శిల్పా శివానంద్ ని తన తల్లి పర్వీన్ ముందే మోహన్ బాబు కొట్టారట. స్టూడియోలో నిర్బంధించడంతో శిల్పా పోలీసులను ఆశ్రయించారట. లెజెండ్రీ కమెడియన్ బ్రహ్మానందంని కూడా మోహన్ బాబు కొట్టారనే వాదన ఉంది. 
 


రజినీకాంత్ కి ద్రోహం

సూపర్ స్టార్ రజినీకాంత్, మోహన్ బాబు మధ్య సాన్నిహిత్యం ఉంది. మంచి మిత్రులు వారు. కొన్ని విషయాల్లో రజినీకాంత్ మిత్రుడు మోహన్ బాబు సలహా తీసుకుంటాడట. జూబ్లీహిల్స్ లో చౌకగా భూములు ధరలు ఉన్న సమయంలో రజినీకాంత్ వాటిని కొనుగోలు చేయాలని అనుకున్నారట. మోహన్ బాబు రజినీకాంత్ ని తప్పుదోవ పట్టించి, కొనకుండా చేశారట. 

వజ్రోత్సవ వేడుకల్లో చిరంజీవి పై అక్కసు

తెలుగు సినిమా 75 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా 2007లో వజ్రోత్సవ వేడుకలు పెద్దలు ఘనంగా ఏర్పాటు చేశారు. చిరంజీవికి లెజెండరీ నటుడు అవార్డు ప్రకటించారు. దీన్ని మోహన్ బాబు తప్పుబట్టారు. 500 సినిమాల్లో నటించి, అనేక సినిమాలు నిర్మించిన నేను... ఏ విధంగా లెజెండరీ అవార్డుకి అర్హుడిని కాదని వేదికపై అసహనం వెళ్లగక్కాడు. ఆ వేడుక మూడ్ మొత్తం ఈ వివాదంతో చెడిపోయింది . 

అనంతరం జీ అవార్డు వేడుకల్లో పవన్ కళ్యాణ్, మోహన్ బాబు మధ్య వివాదం చెలరేగింది. మోహన్ బాబు, చిరంజీవి కుటుంబాల మధ్య కోల్డ్ వార్ ఏళ్ల తరబడి కొనసాగింది. 

అక్కినేని పై అవమానకర వ్యాఖ్యలు

ఓ వేడుకలో మోహన్ బాబు మాట్లాడుతూ.. అన్నపూర్ణమ్మ గారు అక్కినేని నాగేశ్వరరావు కంటే నేను గొప్ప నటుడిని అని చెప్పారు, అన్నారు. అదే వేదిక మీదున్న ఏఎన్నార్ మోహన్ బాబుకు తనదైన శైలిలో చురకలు అంటించారు. ఈ వీడియో ఇప్పటికీ వైరల్ అవుతూ ఉంటుంది. 
 

మా ఎన్నికల్లో దాడులు

2021లో జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించాయి. అధ్యక్ష పదవి కోసం ప్రకాష్ రాజ్, విష్ణు పోటీపడ్డారు. ప్రకాష్ రాజ్ కి చిరంజీవి ఫ్యామిలీ మద్దతు తెలిపింది. ఎన్నికల బూత్ లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో పోటీ చేసిన బెనర్జీని మోహన్ బాబు బండబూతులు తిట్టాడు. ఈ విషయం చెప్పుకుని బెనర్జీ కన్నీరు పెట్టుకున్నాడు. 

ఎన్నికల్లో మోహన్ బాబు అవకతవకలు పాల్పడ్డాడని ప్రకాష్ రాజ్ ఆరోపించారు. మా అధ్యక్షుడిగా గెలిచిన విష్ణు... మీడియా ముందు, చిరంజీవి అంకుల్ ఫోన్ చేసి పోటీ నుండి తప్పుకోమన్నారని నేరుగా విమర్శలు చేశాడు. 
 

మనోజ్ తో విబేధాలు

తాజాగా చిన్న కొడుకు మనోజ్ పై మోహన్ బాబు తన మనుషులతో దాడి చేయించాడు.ఇంటి నుండి మనోజ్ ని వెళ్లిపోవాలని ఆదేశించాడు. మనోజ్, ఆయన భార్య మౌనిక వలన తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. టీవీ 9 ప్రతినిధి పై దాడి చేయడంతో అతడు ఆసుపత్రి పాలయ్యాడు. పోలీసులు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు.

బాంబ్ బ్లాస్ట్

మోహన్ బాబు 1997లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ నుండి తృటిలో తప్పించుకున్నాడు. ఈ బ్లాస్ట్ లో 25 మందికి పైగా మరణించారు. పరిటాల రవి, మోహన్ బాబు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మోహన్ బాబు జీవితంలో ఇవి కొన్ని మచ్చుకు మాత్రమే... 

Latest Videos

click me!