Mem Famous Review: `మేమ్‌ ఫేమస్‌` మూవీ రివ్యూ, రేటింగ్‌..

First Published | May 26, 2023, 7:39 AM IST

సుమంత్‌ ప్రభాస్‌ అనే కుర్రాడు తనే దర్శకుడిగా, హీరోగా నటిస్తూ తీసిన సినిమా `మేమ్‌ ఫేమస్‌`. దీన్ని `రైటర్‌ పద్మభూషణ్‌` వంటి సినిమాని తీసిన ఛాయ్‌ బిస్కెట్‌, లహరి ఫిల్మ్స్ వాళ్లు నిర్మించారు. నేడు శుక్రవారం(మే 26)న ఈ సినిమా రిలీజ్‌ అవుతుంది. ఈ సినిమా ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. 

తెలంగాణ బ్యాక్‌ డ్రాప్‌లో సినిమాలు ఈ మధ్య బాగా వర్కౌట్‌ అవుతున్నాయి. అలాగే `జాతిరత్నం` సినిమా స్టయిల్‌ కామెడీ కూడా ఆకట్టుకుంటుంది. అయితే అన్నీ సినిమాలకు అది సెట్ కాదు. బలమైన కంటెంట్‌ ఉన్నప్పుడు, దాన్ని అంతే బాగా తెరపైకి ఎక్కించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. లేదంటే తేడా కొడుతుంది. తాజాగా కొత్త కుర్రాళ్లు కలిసి చేసిన సినిమా `మేమ్‌ ఫేమస్‌`. సుమంత్‌ ప్రభాస్‌ అనే కుర్రాడు తనే దర్శకుడిగా, హీరోగా ఈ సినిమాని రూపొందించారు. దీన్ని `రైటర్‌ పద్మభూషణ్‌` వంటి సినిమాని తీసిన ఛాయ్‌ బిస్కెట్‌, లహరి ఫిల్మ్స్ వాళ్లు నిర్మించారు. నేడు శుక్రవారం(మే 26)న ఈ సినిమా రిలీజ్‌ అవుతుంది. ఈ సినిమాకి చాలా రోజులుగా వెరైటీ పబ్లిసిటీతో రచ్చ రచ్చ చేశారు. అందరి నోళ్లల్లో నానేలా చేశారు. మరి పబ్లిసిటీ చేసినంత స్టఫ్‌ సినిమాలో ఉందా? `రైటర్‌ పద్మభూషణ్‌`కి వర్కౌట్‌ అయినట్టు, ఈ సినిమాకి వర్కౌట్‌ అవుతుందా? ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. 

కథః
తెలంగాణలోని బండనర్సంపల్లి అనే ఓ విలేజ్‌లో జరిగే కథ ఇది. మయి(సుమంత్‌ ప్రభాస్‌), దుర్గ(మణి ఏగుర్ల), బాలి(మౌర్య చౌదరి), కుర్రాడు లిప్‌స్టిక్‌ స్నేహితులు. పొద్దున లేస్తే గొడవలు, రాత్రి అయితే తాగుడు. తెల్లారితే పెద్దమనుషుల ముందు పంచాయితీలు. ఇదే వీరి ప్రపంచం. ఎంత తిట్టినా బుద్ది లేకుండా అలానే ప్రవర్తిస్తుంటారు. వీళ్లకి అంజిమామ తోడవుతుంటాడు. ఏదైనా పని చేస్కోని బతకండ్రా అంటూ రోజూ అందరు తిడుతుంటారు. దీంతో పనికొచ్చే పని చేయాలని, ఎవరూ చేయని పని చేయాలని అనుకుని సొంతంగా టెంట్‌ హౌజ్‌ పెట్టుకోవాలని నిర్ణయించుకుంటారు. ఆలోచన చెప్పగానే తాను ఎంతగానో ప్రేమించే మామ కూతురు మౌనిక(సార్య లక్ష్మణ్‌) రెండు బంగారు గాజులిస్తుంది. అలాగే వాళ్ల ఇంట్లో పెద్దలు, ఊరు సర్పంచ్‌ జింక వేణు(కిరణ్‌ మచ్చా) సపోర్ట్ చేస్తారు. అప్పులు చేసి డబ్బులిస్తారు. మొత్తానికి టెంట్‌ హౌజ్‌ పెట్టి బిజీ అవుతుంటారు. అంతలోనే బాలి లవర్‌ బబ్బు(సిరి) మరో వ్యక్తితో ఎంగేజ్‌మెంట్‌ చేసుకుంటుంది. అంతలోనే కరెంట్‌ షాట్‌ సర్య్కూట్‌కి టెంట్‌ హౌజ్‌ మొత్తం కాలిపోతుంది. దీంతో వాళ్లని తీరని విషాదం నింపేస్తుంది. అప్పులు చేసి పెట్టిన టెంట్‌, వచ్చిన డబ్బులన్నీ కాలి బుడిద అయిపోతాయి. అప్పు ఇచ్చినవాడు రోడ్డుమీదకు ఈడుస్తుంటాడు. మరోవైపు తన మరదల్ని పెళ్లి చేసుకోవాలంటే ఏదైనా ఊరికి మంచి పనిచేసి రావాలని మామ(మురళీధర్‌ గౌడ్‌) గొడవ పెట్టుకుంటాడు. దీంతో ఏం చేయాలి, ఎలా ఫేమస్‌ అవ్వాలి అనే ఆలోచనలో ఉన్నప్పుడు ఓ ఫ్రాంక్‌ వీడియోలు చేసే బ్యాచ్‌ ఇచ్చిన ఐడియాతో వెరైటీగా వీడియోలు తీస్తూ యూట్యూబ్‌లో పెడతారు. ఫేమస్‌ అయిపోవాలని చాలా ప్రయత్నిస్తారు. మరి అనుకున్నట్టుగానే ఫేమస్‌ అయ్యారా? ఫేమస్‌ అయ్యేందుకు వాళ్లు ఇంకా ఏం చేశారు? ఊరు కోసం ఏం మంచి పని చేశారు? తన మరదలితో పెళ్లికి మామ ఒప్పుకున్నాడా? ఇందులో గొరటి వెంకన్న పాత్రేంటి? చివరికి కథ ఏ తీరం చేరిందనేది మిగిలిన సినిమా. 
 


విశ్లేషణః
`మేమ్‌ ఫేమస్‌` సినిమా చూస్తుంటే తరుణ్‌ భాస్కర్‌ షార్ట్ ఫిల్మ్ `సైన్మా`, `పెళ్లిచూపులు`, అనుదీప్‌ `జాతిరత్నాలు` వంటి సినిమాలు గుర్తుకొస్తుంటాయి. సినిమా సాగే విధానం మాత్రం `జాతిరత్నాలు`ని తలపిస్తుంది. అది అప్పట్లో కొత్త అటెంప్ట్. జెన్యూన్‌ కామెడీతో చేసిన సినిమా. అందుకే ఆడియెన్స్ ఆదరించారు. బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత అదే ఐడియాతో సినిమాలు చేస్తే దాన్ని పేరడీ లాంటి సినిమాలే అవుతాయి, కానీ ఒరిజినాలిటీ మిస్‌ అవుతుంది. `మేమ్‌ ఫేమస్‌` చిత్రంలో అదే జరిగింది. నిజానికి సుమంత్‌ ప్రభాస్‌ ఈ సినిమాని తన స్టయిల్‌లో జెన్యూన్‌గా తీశాడు. బాగా రాసుకున్నాడు. కానీ దాన్ని తెరపై ఆవిష్కరించడంలో పూర్తి స్థాయిలో సక్సెస్‌ కాలేకపోయాడు. బట్‌ కొత్త దర్శకుడు, కొత్త నటుడిగా అతను చేసిన వర్క్ కి కచ్చితంగా అభినందించాల్సిందే. తనలో కంటెంట్‌ ఉందని మాత్రం నిరూపించుకున్నాడు. బట్‌ సినిమా చాలా వరకు రొటీన్‌ ఫీలింగ్‌ కలిగిస్తుంది. షార్ట్ ఫిల్మ్ ని తలపిస్తుంది.
 

సినిమాలో అక్కడక్కడ జెన్యూన్‌ కామెడీ సీన్లు ఉన్నాయి. అలాగే అక్కడక్కడ ఎమోషనల్‌ సీన్లు కూడా బాగున్నాయి. సరదాగా సాగే క్రమంలో మధ్య మధ్యలో సీరియస్‌ నెస్‌గా, ఎమోషనల్‌  సీన్లు హత్తుకుంటాయి. కాకపోతే కొన్ని సీన్లని బలవంతంగా ఇరికించిన ఫీలింగ్‌ కలుగుతుంది. రైతు సందేశం, భూమి గురించి చెప్పేసీన్లు సింక్‌ కావు. కానీ జస్ట్ సరదాగా తీసుకెళ్లి, మధ్య మధ్యలో ఎమోషనల్‌ టచ్‌ ఇచ్చిన తీరు బాగుంది. అదే సమయంలో చాలా వరకు ఊహించని సన్నివేశాలు రాసుకోవడం సుమంత్‌ ప్రభాస్‌లోని ప్రతిభకి నిదర్శనం. దీనికితోడు పంచ్‌ డైలాగు సైతం బాగున్నాయి. నవ్వులు తెప్పించేలా అనిపిస్తాయి. తెలంగాణ యాస, పల్లెటూరు సన్నివేశాలు, అక్కడి మనుషుల ప్రవర్తన, చివరికి గొరటి వెంకన్న చేత పాట పాడించి ఊరు సమస్యలు చెప్పించిన తీరు బాగుంది. సినిమాకి ఇదొక హైలైట్‌ పాయింట్‌. ఫోటోగ్రాఫర్‌ తో వచ్చే కామెడీ, వీడియోలు తీసే క్రమంలో పుట్టే కామెడీ సీన్లు అలరించేలా ఉన్నాయి. ఇలా సినిమా కొన్ని సీన్ల పరంగానే బాగుంటుంది. తప్ప, ఓవరాల్‌ సినిమాగా మాత్రం మెప్పించలేకపోయింది. చాలా చోట్ల బలవంతపు కామెడీ కనిపిస్తుంది, అదే సమయంలో డెప్త్ లేని ఎమోషన్స్ ఉంటాయి. 

చాలా చోట్ల షార్ట్ ఫిల్మ్ ని తలపిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ కూడా షాట్‌ అండ్‌ స్వీట్‌గా ఉంటూ వాహ్‌ అనిపిస్తున్నాయి. కానీ ఇది రెండున్నర గంటల షార్ట్ ఫిల్మ్ ఫీలింగ్‌ని కలిగిస్తుంది. చాలా సీన్లకి సుమంత్‌ ప్రభాస్‌ మెచ్యూరిటీ సరిపోలేదు. ఇమ్మెచ్యూర్‌గా, ఇల్లాజికల్‌గానూ ఉంటాయి. సినిమాని చూస్తుంటే `సైన్మా`, `పెళ్లిచూపులు`, `జాతిరత్నాలు` వంటి సినిమాలు మన కళ్ల ముందు కనిపిస్తుండటంతో దీని కిక్‌ మిస్‌ అయ్యింది. నిర్మాణం పరంగా చాలా నాసిరకంగా ఉంది. సింక్‌ సౌండ్‌ సెట్‌ కాలేదు(సంధ్య థియేటర్‌లో సౌండ్‌ సమస్యలు కావచ్చు) చాలా డైలాగులు అర్థం కాకుండా ఉంటాయి. దీనికితోడు సినిమా క్వాలిటీ కూడా మిస్‌ అయ్యింది. ఈ సినిమాకి బడ్జెట్‌ ఎక్కువ ఎందుకు అనుకున్నారో ఏమో చాలా వరకు చుట్టేసిన ఫీలింగ్‌ కనిపిస్తుంది. అయితే ఇటీవల ప్రొడక్షన్‌ పరంగా చాలా తక్కువతో సినిమా తీసి, ఎక్కువగా సోషల్‌ మీడియా పబ్లిసిటీతో ఊదరగొడుతున్నారు. సోషల్‌ మీడియాని వాడుకుని జనాల్లో ఇది మంచి సినిమా, మిస్‌ కాకూడని సినిమా అనేలా ఆలోచన తీసుకొస్తున్నారు. శృతి మించిన పబ్లిసిటీ కారణంగా ఒకవేళ ఈ సినిమా బాగాలేదని చెబితే మనకు సినిమా చూడటం రాదేమో, అందరు బాగుందని అంటున్నారుగా? అనే ఫీలింగ్‌ని సదరు ఆడియెన్స్ కి కలిగేలా ఈ పబ్లిసిటీ స్టంట్ ఉండటం గమనార్హం. `మేమ్‌ ఫేమస్‌` విషయంలో నిర్మాతలు చేసింది కూడా అదే అని సినిమా చూశాక అర్థమవుతుంది. దీన్ని కూడా `రైటర్‌ పద్మభూషణ్‌` సినిమా స్టయిల్‌లో ఆడియెన్స్ పై రుద్దే ప్రయత్నం చేశారు. కానీ ఆ సినిమాకి వర్కౌట్‌ అయినట్టు దీనికి వర్క్ అవుతుందా? అనేది ప్రశ్న. ఓవరాల్‌గా సుమంత్‌ ప్రభాస్‌, అతని బ్యాచ్‌ చేసిన ప్రయత్నం అభినందనీయం. వారి లైఫ్‌ సెట్‌ అయిపోతుంది.
 

నటీనటులుః
సుమంత్‌ ప్రభాస్‌.. హీరోగా, దర్శకుడిగా రెండు బాధ్యతలు తొలి సినిమాతోనే చేసి సక్సెస్‌ అయ్యాడు. అతను ఇంకా కష్టపడితే రెండు విభాగాల్లోనూ సక్సెస్‌ అవుతాడు. మరో విశ్వక్‌సేన్‌లా అవుతాడు. నటన పరంగా అతనిలో విజయ్‌ దేవరకొండ స్టయిల్‌ కనిపిస్తుంది. కానీ బాగా చేశాడు. సినిమాని నడిపించాడు. అతని బ్యాచ్‌ మణి ఏగుర్ల,మౌర్య చౌదరి, లిప్‌ స్టిక్‌ కుర్రాడు చాలా బాగా చేశారు. హీరో తర్వాత ఈ చిన్న కుర్రాడు ఈ సినిమాతో బాగా ఫేమస్‌ అయిపోతాడు. హీరోయిన్లు సిరి రాసి, సార్య లక్ష్మణ్‌ సైతం ఆకట్టుకున్నారు. మామ పాత్రలో ఊరి పెద్ద మనిషిగా మురళీధర్‌ గౌడ్‌ మరోసారి మెప్పించాడు. సినిమాకి ప్లస్‌ అయ్యారు. గొరటి వెంకన్న తన పాటతో ఊర్రూతలూగించాడు. అంజిమామ పాత్ర మరో ప్లస్‌. కుర్రాళ్లకి నటన పరంగా అనుభవ లేమి తప్ప నటన, కామెడీ పరంగా బాగా చేశారు. 
 

టెక్నీకల్‌ః
మ్యూజిక్‌డైరెక్టర్‌ కళ్యాణ్‌ నాయక్‌ ఇప్పటికే `రైటర్‌ పద్మభూషణ్‌` చిత్రంతో నిరూపించుకున్నాడు. ఇందులో మంచి బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ ఇచ్చాడు. పాటలు ఆ స్థాయిలో లేవు. కెమెరా వర్క్  పరంగా శ్యామ్‌ దూపాటి ఉన్నంతలో బాగుంది. ఫ్రేముల్లో క్వాలిటీ మిస్‌ అయ్యింది. ఎడిటింగ్‌ సినిమాకి పెద్ద మైనస్‌. ఓ ఇరవై నిమిషాల వరకు తీసేయొచ్చు. అలా చేస్తే మరింత క్రిస్పీగా ఉంటుంది. నిర్మాణ విలువలూ ఈ సినిమా ప్రధాన లోపం. వాళ్ళు మరింత సహకారం అందించి ఉంటే సుమంత్‌ ఇంకా బాగా తీసేవాడేమో. ఇక దర్శకత్వం పరంగా సుమంత్‌ తొలి ప్రయత్నం కచ్చితంగా అభినందనీయం. ఎంకరేజ్‌ చేయాల్సిందే. అతనిలో మంచి టాలెంట్‌ ఉందని అర్థమవుతుంది. రైటింగ్‌ పరంగా, కామెడీ సీన్లని బాగా చేసుకున్నాడు. పంచ్‌ డైలాగ్‌లు బాగున్నాయి. అదే సమయంలో ఈ సినిమాకి అనుభవలేమి కనిపిస్తుంది. దీనికితోడు సక్సెస్‌ఫుల్‌ సినిమాలను ఫాలో అవడం మైనస్‌. దాన్ని దాటుకుని కొత్తగా చేయాల్సింది. చేస్తే రిజల్ట్ వేరేలా ఉండేది.

ఫైనల్‌గాః ముగ్గురు కుర్రాళ్లని వేసుకుని చేసే ప్రతి సినిమా `జాతిరత్నాలు` కాలేదు, అలాగే ప్రమోషన్స్ పరంగా ప్రతి సినిమాని మరో `రైటర్‌ పద్మభూషణ్‌` చేయలేము. `మేమ్‌ ఫేమస్‌` కొంత బోరింగ్‌, మరికొంత రొటీన్‌ స్టఫ్‌తో కూడిన టైమ్‌ పాస్ మూవీ.

రేటింగ్‌ః 2.25

నటీనటులు : సుమంత్ ప్రభాస్, మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య లక్ష్మణ్, సిరి రాసి, నరేంద్ర రవి, మురళీధర్ గౌడ్, కిరణ్ మచ్చ, అంజిమామ, శివ నందన్ తదితరులు
ఛాయాగ్రహణం : శ్యామ్ దూపాటి
సంగీతం : కళ్యాణ్ నాయక్
నిర్మాతలు : అనురాగ్ రెడ్డి,శరత్ చంద్ర, చంద్రు మనోహర్
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : సుమంత్ ప్రభాస్
 

Latest Videos

click me!