మెగాస్టార్ చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని ఎందరో హీరోలు ఇండస్ట్రీకి వచ్చారు. చిరంజీవి అభిమానులుగా ఉంటూ సినిమాల్లో రాణిస్తున్నారు. అయితే చిరంజీవి తన 40 ఏళ్ళ కెరీర్ లో తన సాటి హీరోలతో పోటీ పడుతూ ఎదిగారు తప్ప ఎప్పుడూ ఎవ్వరికీ దాసోహం అనలేదు.
కానీ మెగాస్టార్ ఒక సారి ఓ క్రేజీ హీరో ముందు దాసోహం అనే మాట అన్నారు. చాలా ఎమోషనల్ గా చిరంజీవి ఆ మాట చెప్పారు. చిరంజీవి మీలో ఎవరు కోటీశ్వరుడు షోకి ఒకసారి హోస్ట్ గా చేశారు. ఈ షోకి చాలా మంది హీరోలు అతిథులుగా హాజరయ్యారు. నేచురల్ స్టార్ నాని కూడా ఒక ఎపిసోడ్ కి అతిథిగా హాజరయ్యారు. చిరంజీవికి నాని అంటే చాలా ఇష్టం అట. అందరి తరహాలోనే తాను కూడా నాని నేచురల్ పెర్ఫామెన్స్ కి ఫిదా అవుతానని చిరంజీవి అన్నారు.
చిరంజీవి మాట్లాడుతూ.. తాను ఎవరి ముందు ఈ మాట అనలేదు. కానీ నీ ముందు అంటున్నా. నాకు కష్టపడి పైకి వచ్చిన వారంటే చాలా ఇష్టం. నువ్వు కష్టపడి పైకొచ్చిన విధానం, నీ నటనకి నేను దాసోహం అని చిరంజీవి అన్నారు. మెగాస్టార్ అంతటివారు ఈ మాట చెప్పడంతో నాని షాక్ అయ్యారు.
అయ్యో సార్.. అంత మాట ఏంటి అని అన్నారు. నా జీవితంలో ఇది అతిపెద్ద కాంప్లిమెంట్ అని నాని తెలిపారు. నేను కూడా ఒక మాట చెప్పాలనుకుంటున్నా సర్.. అందరూ రామ్ చరణ్ కి, అల్లు అర్జున్ కి, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ వీళ్ళందరికీ మీరే బ్యాగ్రౌడ్ అంటుంటారు.
అది నిజం కాదు. వాస్తవానికి మీరు వారి నెత్తి మీద పెద్ద బరువు. మీ లెగసీని వాళ్ళు మోస్తున్నారు. నిజంగా మీరు ఎవరికి బ్యాగ్రౌండ్ అంటే.. నా లాంటి వాళ్ళకి అని నాని తెలిపారు.
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని నా లాంటి వాళ్ళకి మీరే ఆదర్శం అని నాని తెలిపారు. గతంలో నాని నెపోటిజం గురించి కూడా కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. రాంచరణ్ తొలి చిత్రాన్ని కోటి మంది చూశారు అది ఎందువల్ల అంటూ నాని గతంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.