
టాలీవుడ్‌కి ఈ ఏడాది `మిరాయ్` రూపంలో మరో హిట్ పడింది. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద రచ్చ చేస్తోంది. ఇప్పటికే ఇది వంద(రూ.115) కోట్లు దాటింది. అయితే సినిమాకి వచ్చిన టాక్‌ని బట్టి చూస్తే ఇది ఈజీగా రెండు వందల కోట్లు దాటేస్తుందని అంతా భావించారు. కానీ ఆ స్థాయిలో బాక్సాఫీసు వద్ద సత్తా చాటలేకపోతుంది. మొదటి వారంలో జోరు చూపించిన ఈ మూవీ రెండో వారంలో డల్ అయ్యింది. కాకపోతే సినిమా బడ్జెట్, బిజినెస్ పరంగా చూస్తే ఇప్పటికే ఇది బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. నిర్మాతలకు, బయ్యర్లకి లాభాలు తెచ్చిపెట్టింది.
`మిరాయ్` మూవీతో పెద్ద హిట్‌ని అందుకున్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. ఆయనకు చాలా కాలంగా సక్సెస్ లేదు. `ధమాఖా` తర్వాత వరుసగా పరాజయాలు ఫేస్ చేశారు. కోట్లు పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఓ దశలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పని గట్టుకుని ఫ్లాప్ సినిమాలు తీస్తుందా అనే కామెంట్స్ కూడా వినిపించాయి. ప్రెస్ మీట్లలోనూ అలాంటి ప్రశ్నలు ఎదురయ్యాయి. వాటన్నింటికి `మిరాయ్` సినిమా సమాధానం చెప్పింది. ఈ చిత్రంతో పీపుల్స్ మీడియా బ్రాండ్ వాల్యూ పెరిగింది. చాలా రోజుల తర్వాత హిట్ రావడంతో నిర్మాత విశ్వప్రసాద్‌లో ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు.
ఈ చిత్రంతో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఎలివేట్ అయ్యాడు. మంచి టెక్నీషియన్‌గా పేరు తెచ్చుకున్నారు. ఈ మూవీకి దర్శకత్వం వహించడంతోపాటు కెమెరామెన్‌గా ఆయన పనిచేశారు. విజువల్స్ పరంగానూ మూవీని అద్భుతంగా రూపొందించారు. మేకింగ్ పరంగానూ అదరగొట్టాడు. కథ, స్క్రీన్‌ప్లేని బాగా డీల్ చేశాడు. ఇలా కార్తీక్ ఘట్టమనేని దర్శకుడుగా సక్సెస్ అయ్యాడు. ఈ చిత్రం ఆయన్ని ఇండస్ట్రీలో తిరుగులేని దర్శకుడిగా నిలబెడుతుందని, అదే సమయంలో పెద్ద దర్శకుల జాబితాలో చేర్చుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. `మిరాయ్` కార్తీక్ లైఫ్‌నే మార్చేసింది.
`మిరాయ్` సక్సెస్‌తో ప్రధానంగా మంచు మనోజ్ లైఫ్ మారిపోయింది. ఆయనకి మంచి పేరొచ్చింది. తేజ సజ్జాతో సమానంగా మంచు మనోజ్‌కి పేరు రావడం విశేషం. ఇంకా చెప్పాలంటే ఈ సక్సెస్‌ని తేజ సజ్జా కంటే మనోజే ఎక్కువగా క్యాష్ చేసుకున్నాడు. తనని తాను కరెక్ట్ గా ప్రమోట్ చేసుకున్నాడు. దీంతో `మిరాయ్` సక్సెస్‌తో మనోజ్ విలన్‌గా నిలబడిపోతాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆయన్ని బౌన్స్ బ్యాక్ అయ్యేలా చేసిందని చెప్పొచ్చు. ఇకపై హీరోగానే కాదు, బలమైన పాత్రలకు మనోజ్ కేరాఫ్‌గానూ నిలుస్తాడని చెప్పొచ్చు. ఇందులో మనోజ్ విలన్‌గా నటించిన విషయం తెలిసిందే. ఆయనతోపాటు శ్రియాకి కూడా ఇది మంచి కామ్ బ్యాక్ మూవీగా నిలిచిందని చెప్పొచ్చు.
ఇక ఫైనల్‌గా `మిరాయ్` మూవీతో హీరో తేజ సజ్జా సరికొత్త రికార్డులు సృష్టించారు. బ్యాక్ టూ బ్యాక్ విజయాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టాడు. `జాంబీ రెడ్డి`, `హనుమాన్`, `మిరాయ్`తో సక్సెస్‌లు అందుకున్నారు. `హనుమాన్`తోపాటు `మిరాయ్` రెండూ పాన్ ఇండియా స్థాయిలో మెప్పించాయి. అయితే కలెక్షన్లలో `మిరాయ్`.. `హనుమాన్`ని దాటేస్తుందని భావించారు. కానీ వెనకబడిపోయింది. కాకపోతే ఈ మూవీ ఓవర్సీస్‌లో మాత్రం దుమ్మురేపింది. అమెరికాలో ఏకంగా రెండున్నర మిలియన్స్ కలెక్ట్ చేసింది. ప్రభాస్, ఎన్టీఆర్ తర్వాత ఈ రికార్డు క్రియేట్ చేసిన హీరోగా తేజ కావడం విశేషం. ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదలైన విషయం తెలిసిందే.