Mahesh Babu
హీరోగా మహేష్ బాబు ఇప్పుడంటే సూపర్ స్టార్. నెంబర్ వన్ స్టేజీని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఆయన తొలి సినిమానుంచి ఆ క్రేజ్ ఉంది. మహేష్ బాబు మొదటి సినిమా చేయటానికి చాలా మంది దర్శకులు, నిర్మాతలు పోటీ పడ్డారు.
కృష్ణగారు తన కొడుకుని ఎవరు చేతిలో పెట్టాలనే డెసిషన్ తీసుకోక ముందు చాలా ఆఫర్స్ వచ్చేవి. రెండు రోజులకు ఒకరైనా అడిగేవారట మేము లాంచ్ చేస్తాం. మీ అబ్బాయిని మా చేతిలో పెట్టండి అని. అదే సమయంలో మహేష్ బాబుకు అప్పటికి భారీ అయిన రెమ్యనరేషన్ సైతం ఆఫర్ చేసారట. ఆ వివరాలు చూద్దాం.
హీరో కృష్ణ కొడుకుగా మహేష్ హీరోగా రంగప్రవేశం చెయ్యడానికి రంగం సిద్ధమవుతున్న రోజులవి. మీడియాలో తెగ వార్తలు వచ్చేవి. ఫలానా అప్పుడు మొదటి చిత్రం ముహూర్తం జరుపుకోవచ్చు అని. బాల నటుడిగా అనేక చిత్రాలలో నటించిన మహేష్ నటనపై అందరికీ నమ్మకం. అలాగే సూపర్ స్టార్ కొడుకు. ఇంక తిరుగేముంది. ఖచ్చితంగా అదిరిపోయే ఓపినింగ్స్ వస్తాయి. డిస్ట్రిబ్యూటర్స్ ఎగబడతారు. అదే నిర్మాతల నమ్మకం.
అయితే సూపర్ స్టార్ కృష్ణ ఆచి,తూచి అడుగులు వేసారు. తన కొడుకు ఈ రోజు ఈ స్దాయిలో ఉండటానికి సరపడ సరంజామా ఆయన ఏర్పాటు చేసారు. మహేష్ అటుఇటుగాని వయసువల్ల సినిమాల్లో నటించకుండా చదువుపై శ్రద్ధ వహించిన విషయం తెలిసిందే. ఏడాదితో డిగ్రీ పూర్తవుతుంది అనే టైమ్ లో ఆయనకు ఆఫర్స్ మొదలయ్యాయి. మహేష్ హీరోగా సినిమాల్లో నటించడానికి సిద్దమవడం జరిగింది.
హీరోగా మహేష్ తొలిచిత్రం నిర్మించడానికి ఎందరో నిర్మాతలు పోటీపడ్డాన్నారు. కృష్ణను అభిమానించి అతడితోనే చిత్రాలు తీసే దాదాపు ఆరుగురు నిర్మాతలు మొదటి ఛాన్సు తమకే దక్కాలని ఆశించారు. కాని ఆ ఛాన్సు ప్రముఖ నిర్మాత కే ఇవ్వాలనేది కృష్ణగారి ఆలోచన.,
సూపర్ స్టార్ కృష్ణ కొడుకు మహేష్ కు లాంచ్ అవకముందే ఎందరో అభిమానులున్నారు. మంచి ఈజ్, చక్కని టైమింగ్, స్పీడు యాక్షన్ వున్న నటుడు మహేష్ అని అందరికీ తెలిసిందే. డాన్స్ లోనూ, ఫైట్స్ లోనూ తన సత్తా ఏమిటో గతంలోనే రుజువు చేసుకున్నాడు.
అందువల్లే మొదటి చిత్రానికే గొప్ప క్రేజ్ ఏర్పడింది. కనుకే నిర్మాతలు ముందుకు వచ్చారు. అప్పట్లో ప్రతి నిర్మాత ఒక్కో చిత్రానికి కోటి రూపాయలు ఆఫర్ చేసారంటే మహేష్ పట్ల ఎంత నమ్మకంతో వున్నారో అర్ధం చేసుకోవచ్చు. కొత్త హీరోకి మొదటి చిత్రానికే కోటిరూపాయలంటే ఇది సంచలన రికార్డ్.
అప్పటికే పెద్దకొడుకు రమేష్ నటుడుగా రాణించక పోవడంతో, ఇప్పుడు మహేశ్ మీద నమ్మకంతో వున్నాడు కృష్ణ. అందువల్లే మొదటి చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా భావించి మంచి కాంబినేషన్, మంచి కధ కోసం ప్రయత్నం చేసారు.
ఆ టైమ్ లోనే సినిమారంగానికి సంబంధించి ఎంతోమంది వారసులు రంగప్రవేశం చేసారు, చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, వడ్డే నవీన్, భరత్ హీరోలుగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నం చేస్తున్న సమయం అది. దాసరి కుమారుడు అరుణ్ కుమార్ హీరోగా, చలపతిరావు కుమారుడు విల న్ గా రంగ ప్రవేశం చేయబోతున్నారు. మహేష్ అందరికంటే ఎక్కువగా ప్రేక్షకుల మన్ననలు పొందాలన్న కృష్ణ ఆశ నిరాశ కాలేదు.
రాఘవేంద్రరావు కి మహేష్ కు చిన్నతనం నుంచే పరిచయం, చనువు ఉండేవి. అందుకే తన కొడుకుని హీరోగా లాంచ్ చేసే బాధ్యతను ఆయనకు అప్పగించాడు కృష్ణ.. సెట్స్లో కూడా రాఘవేంద్రరావుని, మామయ్య.. మామయ్య అని పిలుస్తుండేవాడు మహేష్..
అయితే 'రాజకుమారుడు' సినిమాకి ముందు దర్శకుడు కె. రాఘవేంద్ర రావు వరుస ఫ్లాపుల్లో ఉన్నారు. 'అన్నమయ్య' వంటి క్లాసిక్ సూపర్ హిట్ మూవీ తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన 'మేరే సప్నో కి రాణి', 'శ్రీమతి వెళ్లొస్తా', 'లవ్ స్టోరీ 1999', 'పరదేశీ', 'ఇద్దరు మిత్రులు' సినిమాలు డిజాస్టర్లుగా నిలిచారు. వరుసగా 5 సినిమాలు ఫ్లాప్ అయినా మహేష్ని లాంచ్ చేసే బాధ్యత, కృష్ణ.. తనకి అప్పగించడంతో కథ విషయంలో ప్రయోగాలు చేయలేదు దర్శకేంద్రుడు..
పెద్ద హంగామా మహేష్ మీద పెట్టుకోకుండా సింపుల్ కథతో లవ్ స్టోరీని మలిచి, తన మార్కుతో ప్రెసెంట్ చేశాడు కె. రాఘవేంద్రరావు. కృష్ణ అభిమానుల కోసం మహేష్ని కొన్ని సీన్స్ కౌ బాయ్ గెటప్లో చూపించాడు. అలాగే ఫ్లాష్ బ్యాక్లో మహేష్ తండ్రిగా కృష్ణ కనిపిస్తారు.
ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింటా, మహేష్ తో రొమాన్స్ చేసింది. కమర్షియల్ హిట్ దర్శకుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో అశ్వనీదత్ చిత్రంలో మహేష్ నటించడానికి కృష్ణ తన అంగీకారం తెలియజేయడంతో హీరోగా మహేష్ రంగప్రవేశాన్ని సంచలనాత్మకంగా తీర్చిదిద్దారు.
Mahesh Babu, krishna,
అప్పటి మేటి దర్శకుడు రాఘవేంద్రరావు. మహేష్ ని అద్భుతమైన రీతిలో సరికొత్త తరహాలో ప్రేక్షకులముందుకు తేవాలన్న లక్ష్యంతో తన అనుభవాన్ని అంతా ఉపయోగించి చిత్రాన్ని ప్లాన్ చేసారు. అప్పటికి కృష్ణకు చెక్కుచెదరని ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకుని అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ సినిమాలో కూర్చి రాజకుమారుడు సినిమా తీసారు. అది ఎంత పెద్ద హిట్టో మనందరికీ తెలిసిందే.