Mahesh Babu
సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా మహేష్ బాబు వెండితెరకు పరిచయం అయ్యాడు. పసిప్రాయంలోనే నటుడిగా మారాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా తొమ్మిది చిత్రాలు చేశాడు. తండ్రి కృష్ణ, అన్నయ్య రమేష్ బాబులతో కలిసి నటించాడు. మహేష్ బాబు చిన్నప్పుడే స్టార్డం అనుభవించడం విశేషం.
డ్యూయల్ రోల్స్, సూపర్ కిడ్, మల్టీస్టారర్స్ చేశాడు. ఈ క్రమంలో బాల్యంలోనే బైక్ రైడ్, హార్స్ రైడింగ్ వంటి సాహసాలు చేశాడు. 1990లో వచ్చిన బాల చంద్రుడు మూవీలో మహేష్ మెయిన్ లీడ్. కాకపోతే అప్పటికీ ఆయన చైల్డ్ ఆర్టిస్టే.
1999లో మహేష్ బాబు పూర్తి స్థాయి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. దర్శకుడు రాఘవేంద్రరావు రాజకుమారుడు చిత్రంతో పరిచయం చేశాడు. ఈ మూవీ సూపర్ హిట్. మణిశర్మ సాంగ్స్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. మహేష్ రొమాన్స్ తో పాటు యాక్షన్ ఇరగదీశాడు.
Mahesh Babu
మురారి, ఒక్కడు, అతడు, పోకిరి చిత్రాలతో అతిపెద్ద స్టార్ గా ఎదిగాడు. సుదీర్ఘ కెరీర్లో మహేష్ బాబు పలు రకాల పాత్రలు చేశారు. కాగా మహేష్ బాబు ఓ సందర్భంలో తాను నడిపిన ఫస్ట్ బైక్ ఏంటో తెలియజేశారు. మహేష్ రైడ్ చేసిన ఫస్ట్ బైక్ టీవీఎస్ 50 అట. అప్పటికి మహేష్ వయసు కేవలం 11 ఏళ్ళు అట.
టీనేజ్ కూడా రాకుండానే బైక్ రైడ్ చేశానని మహేష్ బాబు చెప్పుకొచ్చారు. మరి స్టార్డం లోనే కాదు సాహసాల్లో కూడా మహేష్ బాబు తండ్రికి తగ్గ తనయుడు అనిపిస్తున్నాడు.
మరోవైపు మహేష్ బాబు గుంటూరు కారం మూవీతో సంక్రాంతికి ప్రేక్షకులను పలకరించాడు. దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన గుంటూరు కారం పర్లేదు అనిపించుకుంది. కథ, కథనాల్లో దమ్ము లేకున్నా... మహేష్ మేనియాతో చెప్పుకోదగ్గ వసూళ్లు రాబట్టింది. నెక్స్ట్ ఆయన రాజమౌళితో చిత్రం చేయనున్నారు.
స్క్రిప్ట్ ఫైనల్ దశలో ఉండగా మే లో మహేష్-రాజమౌళి ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం కలదట. ఈ విషయాన్ని ఎస్ గోపాల్ రెడ్డి ఇటీవల వెల్లడించారు. ఇక జంగిల్ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కనుంది. హాలీవుడ్ సక్సెస్ ఫుల్ సిరీస్ ఇండియానా జోన్స్ ని తరహాలో ఉంటుందని రాజమౌళి స్వయంగా వెల్లడించారు.
హాలీవుడ్ నటుడు, సాంకేతిక నిపుణులు పని చేయనున్నారట. రాజమౌళి కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. మహేష్ బాబు ఈ చిత్రం కోసం మేకోవర్ అవుతున్నారు. మహేష్ ని సరికొత్తగా చూపించే ప్రయత్నాల్లో రాజమౌళి ఉన్నారట.