దక్షణాది చిత్ర పరిశ్రమలో లెజెండ్రీ దర్శకుడు, 'డైరెక్టర్ల హిమాలయం' అని అభిమానులు ఆప్యాయంగా పిలుచుకునే భారతీరాజా అనారోగ్యంతో ఈరోజు జూన్ 10న తెల్లవారుజామున కన్నుమూశారు.
తమిళ సినిమాల్లో పల్లెటూరి జీవితాన్ని, అక్కడి సహజమైన అందాన్ని, భావోద్వేగాలను వెండితెరపైకి తీసుకొచ్చిన వారిలో భారతీరాజా మొదటి వ్యక్తి. 'డైరెక్టర్ల హిమాలయం' అనే కీర్తిని పొందిన ఆయన, కేవలం సినిమాలు తీయలేదు.. తమిళ ప్రజల జీవనశైలి, ప్రేమ, బంధాలు, మట్టి వాసనను ప్రపంచానికి తెలియజేశారు. అలాంటి లెజెండ్రీ డైరెక్టర్ మరణించారు. 84 ఏళ్ళ వయసులో ఆయన తుది శ్వాస విడిచారు. దీనితో దక్షణాది చిత్ర పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
26
16 వయదినిలే..
1977లో వచ్చిన '16 వయదినిలే' సినిమాతో భారతీరాజా తమిళ ఇండస్ట్రీలో ఒక కొత్త విప్లవాన్ని సృష్టించారు. అప్పటివరకు స్టూడియోలకే పరిమితమైన సినిమా షూటింగ్‌ను ఆయన పల్లెటూర్లకు, పచ్చని పొలాలకు తీసుకెళ్లారు. ఆయన సినిమాల్లోని పాత్రలు సాధారణ ప్రజల జీవితాలను ప్రతిబింబించాయి. అందుకే ప్రేక్షకులు ఆయన్ను ఒక దర్శకుడిలా కాకుండా, తమ కుటుంబ సభ్యుడిలా భావించారు.
36
భారతీరాజా సినిమాలు
'కిళక్కే పోగుమ్ రైల్', 'అలైగళ్ ఓయవదిల్లై', 'ముదల్ మరియాదై', 'మண் వాసనై', 'కరుత్తమ్మ', 'కిళక్కు చీమయిలే' లాంటి సినిమాలు ఈనాటికీ ప్రేక్షకుల మనసులో నిలిచిపోయాయి. ముఖ్యంగా మానవ సంబంధాలు, మాతృత్వం, ప్రేమ, గ్రామీణ సంస్కృతిని ఆయన తెరపై చూపించిన విధానం ఎన్నో తరాలను ఆకట్టుకుంది.
ఎంతో మంది నటీనటుల సినీ జీవితానికి పునాది వేసింది కూడా భారతీరాజానే. కొత్త ప్రతిభను గుర్తించి తమిళ సినిమాకు పరిచయం చేయడంలో ఆయన పాత్ర అపారమైనది. ఆయన పరిచయం చేసిన వారిలో చాలా మంది ఆ తర్వాత తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర తారలుగా ఎదిగారు.
56
మట్టితో పెనవేసుకున్న జీవితం
భారతీరాజా గురించి మాట్లాడేటప్పుడు, ఆయన సినిమాలే కాదు; ఆయన నిరాడంబరత, మట్టితో పెనవేసుకున్న జీవితం, తమిళ భాష, సంస్కృతిపై ఉన్న ప్రేమ కూడా గుర్తుకొస్తాయి. సినీ పరిశ్రమలో దశాబ్దాలుగా ప్రయాణించిన ఆయన, తన కళ ద్వారా అసంఖ్యాక అభిమానుల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు. ఒక దర్శకుడిగానే కాకుండా, తమిళ ప్రజల జీవన అనుభూతులను కళారూపంలో చిత్రించిన సృష్టికర్తగా భారతీరాజా ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఆయన సినిమాలు బతికున్నంత కాలం, తమిళ మట్టి వాసన, పల్లె ప్రజల భావోద్వేగాలు వెండితెరపై ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి.
66
అనారోగ్యంతో బాధపడుతూ..
84 ఏళ్ల భారతీరాజా గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా గతేడాది తన కుమారుడి మరణం తర్వాత తీవ్ర మనోవేదనకు గురైన ఆయన, అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు తెల్లవారుజామున చెన్నైలోని నీలాంగరై నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్త తెలిసిన సినీ ప్రముఖులు తమ సంతాపం తెలుపుతున్నారు.