Singeetham Srinivasa Rao: తెలుగు సినీపరిశ్రమ గర్వించదగ్గ దర్శకుడు.. ప్రయోగాలకు పెట్టింది పేరు.. సింగీతం శ్రీనివాసరావు ఇక లేరు. చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ఆయన కన్నుమూశారు.
తెలుగు పరిశ్రమకు మాత్రమే కాదు.. తన సినిమాలతో భారతీయ చలనచిత్ర రంగానికి వన్నె తెచ్చిన మహోన్నత దర్శకుడు, వినూత్న ప్రయోగాల సృష్టికర్త సింగీతం శ్రీనివాసరావు (94) ఇకలేరు. గత కొంతకాలంగా వయోభారంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మరణవార్త తెలుసుకున్న సినీ ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. చిత్రసీమ ఒక అద్భుతమైన దిగ్గజాన్ని, ట్రెండ్ సెట్టర్‌ను కోల్పోయిందని చిత్ర ప్రముఖులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
24
సృజనాత్మకతకు.. ప్రయోగాలకు కేరాఫ్ అడ్రెస్..
తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సుమారు 60కి పైగా చిత్రాలను తెరకెక్కించిన సింగీతం శ్రీనివాసరావు, సినిమా సాంకేతికతకు కొత్త రూపు ఇచ్చారు. మాటలు లేకుండా కేవలం హావభావాలతో నడిచే మూకీ చిత్రం ‘పుష్పక విమానం’తో ప్రపంచ సినిమా దృష్టిని ఆకర్షించారు. అలాగే తెలుగులో తొలి సైన్స్ ఫిక్షన్ చిత్రంగా నిలిచిన ‘ఆదిత్య 369’, అద్భుత జానపద కళాఖండం ‘భైరవద్వీపం’ వంటి సినిమాలు ఆయన దర్శకత్వ ప్రజ్ఞకు నిలువెత్తు నిదర్శనాలు.
34
విశ్వనటుడు కమల్ హాసన్‌తో అపూర్వ అనుబంధం
కమల్ హాసన్‌తో సింగీతం చేసిన ప్రయోగాలు భారతీయ సినిమాలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాయి. ‘అపూర్వ సహోదరర్లు’లో పొట్టి కమల్ క్యారెక్టర్, ‘మైఖేల్ మదన కామరాజు’, ‘అమావాస్య చంద్రుడు’ వంటి చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. అలాగే కన్నడ నటసార్వభౌమ రాజ్‌కుమార్‌తోనూ ఆయన ఎన్నో ఘనవిజయాలను అందుకున్నారు. ‘మయూరి’ చిత్రంతో నటి సుధాచంద్రన్ జీవిత కథను తెరకెక్కించి జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందారు.
44
చివరి శ్వాస వరకు సినిమాయే ..
94 ఏళ్ల వయసులో కూడా ఆయన సినిమాలపై ఉన్న మక్కువను వీడలేదు. ఇటీవల వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై తన 61వ చిత్రాన్ని (SSR61) ప్రకటించి, ఈ వయసులోనూ మెగాఫోన్ పట్టి సరికొత్త చరిత్ర సృష్టించారు. చివరిగా ఆయన నాగ్ అశ్విన్ నిర్మాణంలో సింగ్ గీతం అనే సినిమాకి దర్శకత్వం వహించారు. సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు. భారతీయ సినిమాకు ఆయన అందించిన సేవలు, సృజనాత్మక ఆలోచనలు ఎప్పటికీ అమరంగా ఉంటాయని కొనియాడారు.