Premane Oorilo Movie Review: ప్రేమనే ఊరిలో మూవీ రివ్యూ.. కన్నడలో హిట్‌, మరి ఇక్కడ ?

Published : Oct 03, 2026, 10:21 PM IST

Premane Oorilo Movie Review: కన్నడలో హిట్‌ అయిన `ప్రేమద ఊరలి` మూవీ తెలుగులో `ప్రేమనే ఊరిలో` పేరుతో విడుదలైంది. సురేష్ కొండేటి రిలీజ్‌ చేసిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

PREV
16
ప్రేమనే ఊరిలో మూవీ రివ్యూ

కన్నడలో మంచి విజయాన్ని అందుకున్న `ప్రేమద ఊరలి` సినిమాను తెలుగులో `ప్రేమనే ఊరిలో` పేరుతో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సురేష్ కొండేటి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. రంగాయన రఘు, శ్రీరామ్, రమిక శివు, తపస్విని పూనాచ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి పల్లెటూరి ప్రేమకథ నేపథ్యం. మనోజ్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం శుక్రవారం(అక్టోబర్‌ 2)న తెలుగులో విడుదలైంది. యాక్షన్, హింస, భారీ హంగులకు దూరంగా కుటుంబ బంధాలు, ప్రేమ, త్యాగం, భావోద్వేగాలకు ప్రయారిటీ ఇస్తూ తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? కథ, కథనం, నటీనటుల పనితీరు ఎలా ఉన్నాయి? పూర్తి రివ్యూలో తెలుసుకుందాం.

26
ప్రేమనే ఊరిలో మూవీ కథ

భార్యను కోల్పోయిన నాగన్న (రంగాయన రఘు) తన కుమారుడు సంతోష్ (శ్రీరామ్)ను ఎంతో ప్రేమగా పెంచుతాడు. వ్యవసాయం చేసుకుంటూ పల్లెటూరిలో ప్రశాంతంగా జీవించే సంతోష్‌పై అతడి మరదలు వసంత (రమిక శివు) మనసు పారేసుకుంటుంది. అయితే కొడుక్కి మంచి చదువుకున్న అమ్మాయిని కోడలిగా తీసుకురావాలనేది నాగన్న కోరిక. సంతోష్‌కు కూడా పెళ్లి విషయంలో కొన్ని ప్రత్యేకమైన ఆలోచనలు, షరతులు ఉండటంతో సంబంధాలు కుదరవు. ఇలాంటి సమయంలో విదేశాల నుంచి వచ్చిన రుక్మిణి (తపస్విని పూనాచ) పరిచయమవుతుంది. ప్రేమలో మోసపోయి బాధలో ఉన్న ఆమెను చూసిన సంతోష్ తొలిచూపులోనే ఇష్టపడతాడు. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించే సమయంలో అనుకోని పరిణామం ఎదురవుతుంది. తన స్నేహితుడి కూతురిని పెళ్లి చేసుకోవాలని తండ్రి కోరడంతో సంతోష్ చిక్కుల్లో పడతాడు. తండ్రి మాట కోసం తన ప్రేమను త్యాగం చేశాడా? వసంత, రుక్మిణి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి? చివరకు ఈ ప్రేమకథ ఎక్కడికి చేరింది? అనేది సినిమా.

36
ప్రేమనే ఊరిలో మూవీ విశ్లేషణ

ప్రేమకథ అంటే వెంటనే గుర్తొచ్చే అంశాలు ప్రేమికుల మధ్య గొడవలు, కుటుంబాల వ్యతిరేకత, యాక్షన్, హడావుడి. కానీ ప్రేమనే ఊరిలో మాత్రం వీటన్నింటికీ దూరంగా ఒక స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమకథను చెప్పే ప్రయత్నం చేసింది. పచ్చని పొలాలు, గ్రామీణ జీవనశైలి, కుటుంబ అనుబంధాలు, మనుషుల మధ్య ఆప్యాయతలను ప్రధానంగా తీసుకొని దర్శకుడు కథను నడిపించాడు. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రేమను కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య ఆకర్షణగా చూపించకుండా, బాధ్యతలు, కుటుంబ గౌరవం, త్యాగం వంటి అంశాలతో ముడిపెట్టడం ఆసక్తికరంగా ఉంటుంది. హీరో పాత్రలోని సంఘర్షణ కూడా ఇదే కోణంలో సాగుతుంది. ఒకవైపు తన మనసుకు నచ్చిన అమ్మాయి, మరోవైపు తండ్రి మాట. ఈ రెండింటి మధ్య నలిగిపోయే యువకుడి పరిస్థితిని దర్శకుడు సహజంగా చూపించాడు.

ఫస్టాఫ్ విషయానికి వస్తే హీరో పరిచయం, పెళ్లి చూపులు, మరదలు వసంత ప్రేమ, రుక్మిణి గతం వంటి అంశాలతో కథ ముందుకు సాగుతుంది. కొన్ని సన్నివేశాలు నవ్విస్తాయి. మరికొన్ని క్యూట్‌గా అనిపిస్తాయి. అయితే కథలోకి పూర్తిస్థాయిలో వెళ్లడానికి కొంత సమయం తీసుకోవడం, కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగడం మైనస్‌గా మారాయి. విరామానికి ముందు వచ్చే పెళ్లి మలుపు ఊహించదగినదే అయినా, తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తిని కలిగిస్తుంది. సెకండాఫ్ ఈ సినిమాకు అసలు బలం. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య ఏర్పడే అపార్థాలు, భావోద్వేగ సంఘర్షణలు, వసంత ప్రేమలోని బాధను దర్శకుడు సున్నితంగా ఆవిష్కరించాడు. ఇక్కడ పాత్రల ప్రవర్తనలో కనిపించే మార్పులు కథకు బలాన్ని ఇస్తాయి. ముఖ్యంగా ప్రేమించిన వ్యక్తిని కోల్పోవడం, కుటుంబం కోసం వ్యక్తిగత ఆనందాన్ని పక్కన పెట్టడం వంటి అంశాలు ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి.

నాగన్న గతానికి సంబంధించిన ఫ్లాష్‌బ్యాక్ కొత్తదనం లేకపోయినా, తండ్రి పాత్రను మరింత అర్థం చేసుకునేలా చేస్తుంది. రైతుల జీవితం, వారి కష్టాలు, ఆడపిల్లల భవిష్యత్తు గురించి చెప్పే మాటలు కథలో సహజంగా ఇమిడిపోయాయి. అయితే క్యూట్ మూమెంట్స్ పేరుతో కొన్ని సన్నివేశాలను సాగదీయడం వల్ల భావోద్వేగాల తీవ్రత మధ్య మధ్యలో తగ్గుతుంది. కానీ క్లైమాక్స్ దగ్గరకు వచ్చేసరికి సినిమా పూర్తిగా మరో స్థాయికి చేరుతుంది. చివరి 30 నిమిషాల్లో వచ్చే భావోద్వేగాలు, పాత్రల నిర్ణయాలు, బంధాల విలువ ప్రేక్షకుల మనసును తాకుతాయి. ముఖ్యంగా రంగాయన రఘు పాత్ర ద్వారా పండించే ఎమోషన్ కంటతడి పెట్టిస్తుంది. ముగింపు తర్వాత కూడా పాత్రలు, వాటి భావోద్వేగాలు మనసులో నిలిచిపోతాయి.

46
ప్రేమనే ఊరిలో మూవీలో ఆర్టిస్ట్ లు ఎలా చేశారంటే?

సంతోష్‌గా శ్రీరామ్ సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. పల్లెటూరి యువకుడిగా, ప్రేమికుడిగా, బాధ్యతల మధ్య నలిగిపోయే భర్తగా తన పాత్రలోని వేరియేషన్స్‌ను చక్కగా చూపించాడు. ముఖ్యంగా ద్వితీయార్థంలో అతడి నటన మెప్పిస్తుంది. వసంతగా రమిక శివు మొదట కొంత అల్లరి, మగరాయుడి తరహా ప్రవర్తనతో కనిపించినా, తర్వాతి భావోద్వేగ సన్నివేశాల్లో తన నటనతో ఆకట్టుకుంది. రుక్మిణిగా తపస్విని పూనాచ క్యూట్‌గా కనిపిస్తూ పాత్రకు అవసరమైన అమాయకత్వాన్ని అందించింది. అయితే సినిమాకు ప్రధాన ఆకర్షణ నాగన్నగా నటించిన రంగాయన రఘు. కొడుకుపై ప్రేమ, బాధ్యత, తన గతం తాలూకు వేదనను ఆయన అద్భుతంగా పలికించారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఆయన నటన సినిమాకు ప్రాణం పోసింది. బామ్మ పాత్రతో పాటు ఇతర సహాయ నటీనటులు కూడా తమ పరిధి మేరకు మెప్పించారు.

56
ప్రేమనే ఊరిలో మూవీ టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?

సాంకేతికంగా సంగీతం సినిమాకు ప్రధాన బలం. పాటలు కథా ప్రవాహానికి అనుగుణంగా సాగుతూ వినసొంపుగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పచ్చని పొలాలు, గ్రామీణ వాతావరణం, గుడి పరిసరాలను కెమెరామెన్ అందంగా చిత్రీకరించారు. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి. అయితే తెలుగు డబ్బింగ్‌లో కొన్ని చోట్ల పెదవుల కదలికలకు సంభాషణలు సరిపోలకపోవడం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎడిటింగ్ విషయంలో మరింత శ్రద్ధ తీసుకొని, ముఖ్యంగా ప్రథమార్థంలోని అనవసరమైన సన్నివేశాలను తగ్గించి ఉంటే సినిమా మరింత ఆసక్తికరంగా మారేది.

66
ఫైనల్‌గా

ప్రేమనే ఊరిలో ఒక స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమకథ. నెమ్మదిగా సాగే కథనం, కొన్ని సాగదీత సన్నివేశాలు ఇబ్బంది పెట్టినా, కుటుంబ బంధాలు, ప్రేమ, త్యాగం, చివరి అరగంటలో పండే భావోద్వేగాలు సినిమాను నిలబెడతాయి. ముఖ్యంగా రంగాయన రఘు నటన, క్లైమాక్స్ ప్రేక్షకుల మనసును హత్తుకుంటాయి. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను కోరుకునే వారు, ముఖ్యంగా భార్యాభర్తలు కలిసి చూడదగ్గ చిత్రం. ఈ పల్లెటూరి ప్రేమకథని కాస్త ఓపిక పడితే చివర్లో కన్నీళ్లు పెట్టిస్తుంది.

రేటింగ్‌: 2.75

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories