నయనతార 'కనెక్ట్' మూవీ రివ్యూ... 

First Published Dec 22, 2022, 1:20 PM IST

నయనతార లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ కనెక్ట్. దర్శకుడు అశ్విన్ శరవణన్ తెరకెక్కించిన ఈ చిత్రం డిసెంబర్ 22న తెలుగు,తమిళ భాషల్లో విడుదలైంది. లేడీ సూపర్ స్టార్ నటించిన కనెక్ట్ మూవీ ఈ మేరకు విజయం సాధిస్తుందో చూద్దాం... 

కథ
సుసాన్(నయనతార) భర్త జోసెఫ్ బెనోయ్(వినయ్ రాయ్) ఒక డాక్టర్. కోవిడ్ రోగులకు వైద్యం అందించే క్రమంలో ఆ రోగం బారినపడి జోసెఫ్ మరణిస్తాడు. తండ్రిని ఎంతగానో ప్రేమించే సుసాన్ కూతురు అన్నా(నఫీసా హనియా)తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేకపోతోంది. కోవిడ్ తో చనిపోవడంతో చివరి చూపుకు కూడా సుసాన్, అన్నా నోచుకోలేకపోతారు. తండ్రిపై ప్రేమను చంపుకోలేని అన్నా... ఎలాగైనా తండ్రి ఆత్మతో మాట్లాడాలి అనుకుంటుంది. దాని కోసం ఆమె చేసిన పని సుసాన్ కుటుంబాన్ని చిక్కుల్లోకి నెడుతుంది. అన్నాను ఆత్మ ఆవహిస్తుంది. కూతురిని సుసాన్ ఎలా కాపాడుకుంది అనేది మిగతా కథ... 

హారర్ చిత్రాలకు వాడే ముడిసరుకు, దినుసులు ఒక్కటే. ఇంగ్రిడియంట్స్  ఒక్కటైనప్పటికీ చెఫ్ టాలెంట్ పై టేస్ట్ ఆధారపడి ఉంటుంది. హారర్ కథలన్నీ దాదాపు ఒకే ఫార్మటులో నడుస్తాయి. అలరించే ట్విస్ట్స్ తో ప్రేక్షకులను భయపెట్టగలితే సక్సెస్ సొంతం అవుతుంది. కనెక్ట్ మూవీ కథలో కూడా ఎలాంటి కొత్తదనం ఉండదు. ఆత్మావహించిన కూతురిని తల్లి ఎలా కాపాడుకుందో చెప్పారు.


కనెక్ట్ చిత్ర దర్శకుడు అశ్విన్ శరవణన్ కొంత మేర సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. కొన్ని హారర్ సన్నివేశాలతో ఆయన భయపెట్టించారు. సౌండ్ ఎఫెక్ట్స్ గుండెలు అదురుకునేలా చేస్తాయి. మ్యూజిక్ డైరెక్టర్ ఆ కోణంలో సక్సెస్ అయినట్లే. చిన్న రూమ్ లో నయనతారకు చెమటలు పట్టించే విజువల్స్ సినిమాటోగ్రాఫర్ నేర్పుగా చిత్రీకరించారు. 


లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన నయనతార ఎమోషన్ అండ్ ఇంటెన్స్ సన్నివేశాల్లో బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. కూతురుని కాపాడుకోవాలనే తపనతో కూడిన సన్నివేశాల్లో నయనతార నటన చాలా సహజంగా సాగింది. కనెక్ట్ మూవీతో బెస్ట్ యాక్ట్రెస్ గా ఆమె నిరూపించుకున్నారు. 

చిన్న చిన్న పాత్రలకు కూడా పేరున్న నటులను తీసుకున్నారు. అనుపమ్ ఖేర్ పాత్రకు పెద్దగా స్క్రీన్ స్పేస్ ఉండదు. సత్యరాజ్, అనుపమ్ ఖేర్ తమ పాత్రల పరిధిలో మెప్పించారు. వినయ్ రాయ్, నఫీసా హనియా మెప్పిస్తారు. 
 


సాంకేతిక విభాగాల్లో కనెక్ట్ మెప్పిస్తుంది. సినిమాటోగ్రఫీ, బీజీఎం చెప్పుకోదగ్గ అంశాలు. హారర్ సన్నివేశాలకు పర్ఫెక్ట్ టెంపో, ఇంటెన్సిటీ క్రియేట్ చేయడంలో అవి ఉపయోగపడ్డాయి. కనెక్ట్ మూవీకి మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ప్రధానబలంగా నిలిచాయి. ఎడిటింగ్ పర్వాలేదు. 
 


స్క్రీన్ ప్లే, పతాక సన్నివేశాలు సినిమాకు మైనస్ అని చెప్పాలి. ఫైనల్ లో అద్భుతమైన ట్విస్ట్ ఉంటుందని ఆశించిన ప్రేక్షకులు క్లైమాక్స్ చూసి ఊసూరుమంటారు. ముగింపు సరిగాలేదు. అలాగే టైట్ స్క్రీన్ ప్లే లేకపోవడంతో సినిమా ఆద్యంతం ఉత్కంఠ కలిగించలేకపోయింది. ఫైనల్ గా ప్రేక్షకులు కనెక్ట్ సినిమాకు ఎలాంటి ఫలితం ఇస్తారో తెలియాలంటే... వీకెండ్ ముగియాలి. 

రేటింగ్:2.75/5 
నటీనటులు:నయనతార, అనుపమ్ ఖేర్, సత్యరాజ్, వినయ్ రాయ్ ,  నఫీసా హనియాదర్శకత్వం:  అశ్విన్ శరవణన్ 
D.O.P - మణికంఠన్ కృష్ణమాచారి
సంగీతం - పృథ్వీ చంద్రశేఖర్
ఎడిటర్ - రిచర్డ్ కెవిన్
 

click me!