టాలీవుడ్‌లో రెబల్ స్టార్‌గా పాపులర్ అయిన కృష్ణంరాజు(Krishnam raju) అకాల మరణం యావత్ తెలుగు రాష్ట్రాల అభిమాలను దుఖసాగరంలో ముంచేత్తింది. టాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతుంది. తెలుగు చిత్ర పరిశ్రమ మరోసారి మూగబోయింది. తొలితరం నటుల్లో ఒకరైన కృష్ణం రాజు ఆకస్మిక మరణం టాలీవుడ్‌ని విషాదంలోకి తీసుకెళ్లింది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారు జామున కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఫ్యామిలీకి(Krishnam raju Family Details) సంబంధించి ఎవరికీ తెలియని విషయాలు చూద్దాం.
కృష్ణంరాజు 1940 జనవరి 20న వెస్ట్ గోదావరిలోని మోగల్తూరులో జన్మించారు. ఆయన అసలు పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. ఆనాటి రాజుల కుటుంబం కావడం విశేషం. సినిమాల్లోకి వచ్చాక సింపుల్‌గా కృష్ణంరాజుగా పిలిపించుకున్నారు. అదే సినిమాల్లో వేసుకున్నారు. కృష్ణంరాజుగా తెలుగు సినిమాని ఓ ఊపు ఊపేశారు.
Rip Krishnam Raju
సినిమాల్లోకి రాకముందు కృష్ణంరాజు ఫోటో జర్నలిస్ట్ గా పనిచేశారు. ఆయన ఆంధ్రరత్న పత్రికలో ఫోటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఆయన తీసిన ఫోటోలకుగానూ రాష్ట స్థాయిలో సెకండ్ బెస్ట్ ఫోటోగ్రాఫర్‌గా అవార్డు కూడా రావడం విశేషం. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదట విలన్‌గా కొన్ని సినిమాలు చేశారు. 1966లో `చిలకా గోరింక` అనే చిత్రంతో హీరోగా మారారు. వరుసగా అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. మొత్తంగా దాదాపు 200 సినిమాల్లో నటించినట్టు సమాచారం. రాజకీయంగానూ రాణించారు. కేంద్ర మంత్రిగానూ పనిచేశారు.
ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన ఫ్యామిలీ విషయాలు చూస్తే, అనేక ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. కృష్ణంరాజు రెండు పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసిందే. మొదట ఆయనకు సీతాదేవితో వివాహం జరిగింది. పెద్దలు కుదిర్చిన పెళ్లి. వీరికి పిల్లలు లేరు. ఓ కూతురుని దత్తత తీసుకున్నారు. అయితే 1995లో సీతాదేవి కారు ప్రమాదంలో కన్నుమూసింది. ఒంటరివాడైన కృష్ణంరాజుకి ఏడాది తర్వాత 1996 సెప్టెంబర్ 20న శ్యామలాదేవితో రెండో వివాహం జరిపించారు. వీరికి ముగ్గురు కుమార్తెలున్నారు.
ఇలా మొత్తం కృష్ణం రాజుకి ఐదుగురు కుమార్తెలు అని చెప్పొచ్చు. తన కుటుంబంలో అంతా అమ్మాయిలే ఉంటే, అబ్బాయిని దత్తత తీసుకుంటారు. కానీ కృష్ణంరాజు మళ్లీ అమ్మాయినే దత్తత తీసుకోవడం ఆయనకు అమ్మాయిల పట్ల ఉన్న గౌరవానికి, బాధ్యతకి నిదర్శనంగా నిలుస్తుంది. పెద్ద కూతురు సాయి ప్రసీద, సాయి ప్రకీర్తి, సాయి ప్రదీప్తి, దత్తత తీసుకున్న మరో కూతురు ప్రశాంతి ఉన్నారు. అందరి పేర్లు `ప` అక్షరం మీదనేఉండటం విశేషం. ప్రభాస్,ప్రమోద్ కూడా `ప` అక్షరంతోనే ఉండటం విశేషం.
కృష్ణంరాజు పెద్ద కుమార్తె(శ్యామలాదేవి మొదటి కూతురు) ప్రస్తుతం నిర్మాతగా రాణిస్తుంది. కృష్ణం రాజు గోపీకృష్ణ మూవీస్ అనే నిర్మాణ సంస్థని స్థాపించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ప్రొడక్షన్ బాధ్యతలను ప్రసీదకి అప్పగించారు. ఇటీవల ప్రభాస్ నటించిన `రాధేశ్యామ్` చిత్రానికి ప్రసీద ఓ నిర్మాతగా వ్యవహరించారు. దీన్ని యూవీ క్రియేషన్స్ తో కలిసి నిర్మించారు.
కృష్ణంరాజు సోదరుడు ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు ఉన్నారు. ఆయన కుమారుడే ప్రభాస్(prabhas) అనే విషయం తెలిసిందే. సూర్యనారాయణరాజు అన్న స్థాపించిన `గోపీకృష్ణ మూవీస్` బ్యానర్‌పైనే అనేక సినిమాలు నిర్మించారు. `కృష్ణవేణి`, `భక్తకన్నప్ప`, `అమదీపం`, `మన వూరి పాండవులు`, `మధుర స్వప్నం`, `త్రిశూలం`, `బొబ్బిలి బ్రహ్మన్న`, `ధర్మ్ అధికారి`, `తాండ్ర పాపారాయుడు`, `బిల్లా` చిత్రాలను నిర్మించారు.
సూర్యనారాయణ రాజుకి ఇద్దరు సంతానం. వీరిలో ప్రభాస్ పెద్ద కాగా, మరో హీరో సిద్ధార్థ్ రాజ్ కుమార్ చిన్నవాడు. ఆయన `కెరటం` చిత్రంలో హీరోగా నటించిన విషయం తెలిసిందే. నిర్మాత ప్రమోద్ వారి బంధువుల అబ్బాయి. ప్రమోద్ `యూవీ క్రియేషన్స్ స్థాపించి నిర్మాతగా రాణిస్తున్నారు. భారీ చిత్రాలను నిర్మిస్తున్నారు. దీని వెనకాల ప్రభాస్ ఉన్నారనే విషయం తెలిసిందే. ఇక ప్రభాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్‌గా, పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన విషయం తెలిసిందే.
ప్రభాస్ తమ్ముడు సిద్ధార్థ్ రాజ్ కుమార్. 2011లో `కెరటం` చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక. కానీ ఆయన హీరోగా రాణించలేకపోయాడు. దీంతో సినిమాలకు దూరమయ్యారు. ప్రస్తుతం ప్రభాస్, కృష్ణంరాజు ఫ్యామిలీనే సినిమాలో యాక్టివ్‌గా ఉంది.