'కృష్ణ అండ్ హిజ్ లీల' రివ్యూ

First Published | Jun 25, 2020, 12:52 PM IST

“క్షణం” చిత్రంతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న రవికాంత్ రెండో చిత్రం అంటే ఖచ్చితంగా ఎక్సపెక్టేషన్స్ ఉంటాయి. అందులోనూ సరేష్ ప్రొడక్షన్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్ద నిర్మాణం పాలుపంచుకుందంటే మరీను. అయితే చాలా కాలం నుంచి ఈ సినిమా అదిగో రిలీజ్ ఇదిగో రిలీజ్ అంటూ నలుగుతోంది. చివరకు అటు చేసి, ఇటు చేసి లాక్ డౌన్ టైమ్ లో థియేటర్లో రిలీజ్ అవ్వలేనిపరస్దితిల్లో నెట్ ఫ్లిక్స్ లో ప్రత్యక్షమైంది. ఈ నేపధ్యంలో మోడ్రన్ లవ్ స్టోరీ గా చెప్పబడుతున్న ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..!!

కృష్ణ (సిద్ధూ జొన్నలగడ్డ) ఈ కాలం కుర్రాడు. చిన్నప్పుడే అమ్మా(ఝాన్సి), నాన్న (సంపత్ రాజ్ ) విడిపోవటంతో తల్లి దగ్గరే పెరుగుతాడు. కొంత అతి, మరికొంత కన్ఫూజన్ తో టీనేజ్ లో ప్రవేశించి కాలేజ్ టైమ్ లో సత్య(శ్రద్ధ శ్రీనాథ్)తో ఓ లవ్ స్టోరీ నడుపుతాడు. కాని కృష్ణ అతిగా ప్రతీదానికి రియాక్ట్ అవటం,ఆమెను అనుమానిస్తునట్లు మాట్లాడటంతో బ్రేకప్ చెప్పేసి జాబ్ అంటూ బెంగళూరు చెక్కేస్తుంది.
ఈ గ్యాప్ లో పరిచయమైన రాధ(శాలిని వడ్నికట్టి)ని చూసి మనస్సు పారేసుకుంటాడు కృష్ణ. ఆమెను లైన్ లో పెడుతూ కొత్త లవ్ స్టొరీ మొదలుపెడతాడు. అది ఓ కొలిక్కి వచ్చే సమయానికి బెంగళూరులో జాబ్ వస్తుంది. బెంగళూరు వెళ్లిన కృష్ణకు అక్కడ మళ్ళీ సత్య తగులుతుంది. మళ్లీ ఆమెపై మనస్సు లాగుతుంది. ఆమె కూడా బ్రేకప్ విషయం ప్రక్కన పెట్టి కృష్ణతో కౌగలింతలకు ఆహ్వానం పలుకుతుంది. అటు రాధ కూడా కృష్ణతో కమిటవుతుంది. ఇలా ఇద్దరూ ఒకరికి తెలియకుండా మరొకరితో కృష్ణ ప్రేమాయణం అంటూ రాసలీలలు పోగ్రాం కు తెరతీస్తారు.

అయితే ఇలాంటివి ఎంతో కాలం సాగవు. కృష్ణ చెల్లి పెళ్లి సమయంలో ఆ ఇద్దరికీ అసలు విషయం తెలిసిపోతుంది. అప్పుడు కృష్ణ ఏం నిర్ణయం తీసుకున్నాడు. కృష్ణ పెళ్లికి వచ్చిన అతని తండ్రి ఏం సలహా చెప్పాడు. బ్రేకప్ & ప్యాచప్ నడుమ ఉన్న కన్ఫ్యూజన్ ని కృష్ణ తొలిగించుకున్నాడా..ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏ ఒడ్డుకు చేరింది. మధ్యలో పరిచయం అయిన రుక్సర్(సీరత్ కపూర్) అనే మోడ్రన్ పిల్ల తో కృష్ణ రిలేషన్ ఏమిటి...వంటి విషయాలు తెలియాలంటే నెట్ ఫ్లిక్స్ లో సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.
ఎలా ఉంది:అప్పుడెప్పుడో హిందీలో వచ్చిన సోఛానథా (అభయ్ డియోల్ హీరో) సినిమాని గుర్తు చేసే...ఇలాంటి కథలు కొంచెం అటూ ఇటూలో మనం బోలెడు చూసి ఉంటాము. కథలో కాని స్క్రీన్ ప్లే లో కానీ కొత్తదనం లేదు. అయితే దర్శకుడు పాత్రలను డిజైన్ చేసిన తీరు, డైలాగులు మాత్రం చాలా నేచురల్ గా అనిపించి మనని బోర్ కొట్టకుండా కాపాడే ప్రయత్నం చేస్తాయి. ఈ కాలం కుర్రాళ్ల కన్ఫూజ్ మనస్తత్వాలు తెరపై ఆవిష్కరిస్తూ ఓ రొమాంటిక్ కామడీ మనకు ఇవ్వాలనే దర్శకుడు ప్రయత్నం ఆశించినంత గొప్పగా ఉండదు. రామ్ చరణ్ ఆరంజ్, నీహారిక సూర్యకాంతం,శ్రీవిష్ణు మెంటల్ మదిలో సినిమాలు కూడా ఇలాంటి కాన్సెప్టుతో వచ్చినవే.
ఇలాంటివి రాసుకునేటప్పుడు క్యారక్టరైజేషన్ పరంగా థ్రిల్లింగ్ గా అనిపిస్తాయి కానీ కథగా నప్పవు. డ్రామాకు పెద్ద గా అవకాసం ఉండదు. ఇద్దరు హీరోయిన్స్ కు తమను ఒకడే ప్రేమిస్తున్నాడు అనే విషయం తెలిసినప్పుడు ఏం జరుగుతుందనేదే అసలు కథ. అంటే ఇంటర్వెల్ కు అయినా ఆ పాయింట్ కు రీచ్ అవ్వాలి. ప్రీ క్లైమాక్స్ దాకా లాగారు. దాంతో కథలో కాంప్లిక్ట్ కు దారి లేకుండాపోయింది. కాంప్లిక్ట్ లేకపోవటంతో డ్రామా మిస్సైంది. డ్రామా లేకపోవటంతో సీన్స్ చాలా సాదా సీదాగా ఎప్పుడు పూర్తి అవుతాయా అన్నట్లు సాగుతూ వెళ్లాయి. ఫలితం మీరూహించిందే.
దర్శకత్వం, మిగతా విభాగాలుక్షణం సినిమాతో అందరిని థ్రిల్ కు గురి చేసిన రవికాంత్ డైరక్ట్ చేసిన సినిమాయేనా అని డౌట్ వస్తుంది. అందులోనూ నాలుగేళ్లు ఈ సినిమాపైనే వర్క్ చేసారంటే ఏదో అద్బుతం జరుగుతుందనుకుంటే ఏమీ లేదని సినిమా ప్రారంభమైన పదో నిముషంలోనే అర్దమైపోతుంది. అయితే డైరక్షన్ బాగుంది. ఓటీటికు హై క్వాలిటీలా ఉంది.
ఇక మ్యూజిక్ డైరక్టర్ శ్రీచరణ్ పాకాల మాత్రం మంచి అవుట్ పుట్ ఇచ్చాడు. అయితే చిన్న బిట్స్ సాంగ్స్ ఎక్కువైపోయాయి. రవికాంత్, సిద్దుల కలిసి రాసుకున్న డైలాగులు సహజంగా ఉన్నాయి. కొన్ని చోట్ల బూతులు దొర్లాయి. శానియాల్ డియో-సాయి ప్రకాష్ కెమెరా వర్క్ బాగుంది. గ్యారీ-రవికాంత్-సిద్దుల జాయింట్ ఎడిటింగ్ కొంత లాగ్ ని కట్ చేయచ్చు అనిపించింది. ఓటీటి సినిమా రెండు గంటలు అన్నా కూడా ఎక్కువే. నిర్మాణ విలువలు బాగున్నాయి. క్వాలిటీ వచ్చేలా సురేష్, వయకాం 18 సంస్థలు ఖర్చు పెట్టారు.
Kనటీనటుల్లో...కృష్ణ పాత్ర పోషించిన సిద్ధూకు యూత్ కనెక్ట్ అవకాసం ఉంది..చక్కటి ఈజ్ తో చాలా రియలిస్టిక్ గా క్యారక్టర్ ని క్యారీ చేసాడు. సత్య క్యారక్టర్ పోషించిన జెర్సీ ఫేమ్ శ్రద్ధా శ్రీనాధ్ కూడా పాత్రకు ప్రాణం పోసింది.ఇక రాథ పాత్ర పోషించిన షాలిని వాడికంటి సోసో. హీరో ప్రెండ్ గా చేసిన హర్ష ఎప్పటిలాగే బాగా చేసాడు.
ఫైనల్ ధాట్కన్ఫూజన్ అండ్ ఇట్స్ లీల..ఇదో ట్రయాంగిల్ గోల
ఎవరెవరునటీనటులు : ‘గుంటూరు టాకీస్’‌ ఫేం సిద్దూ జొన్నలగడ్డ, శ్రద్దాశ్రీనాథ్, సీరత్ కపూర్, షాలిని వాడికంటి తదితరలు.సంగీతం : శ్రీచరణ్ పాకాలరచన&దర్శకత్వం : రవికాంత్ పేరేపుసినిమాటోగ్రఫీ : షానిల్ డియో-సాయిప్రకాశ్ ఉమ్మడిసింగునిర్మాత : సురేశ్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 కామ్ మోషన్ పిక్చర్స్, సంజయ్ రెడ్డి--సూర్య ప్రకాష్ జోశ్యులRating:2.5

Latest Videos

click me!