శృతి మించిన ఫ్యాన్స్ పైత్యం.. స్టార్ హీరో కటౌట్ ముందు దున్నపోతు బలి

First Published Sep 4, 2021, 11:51 AM IST

సౌత్ ఇండియాలో స్టార్ హీరోలని అభిమానులు ఆరాధ్య దైవాలుగా భావిస్తారు. స్టార్ హీరోల సినిమా వేడుకలు, బర్త్ డే వేడుకలకు అభిమానుల హంగామా ఎలా ఉంటుందో ప్రత్యేకమా చెప్పనవసరం లేదు.

సౌత్ ఇండియాలో స్టార్ హీరోలని అభిమానులు ఆరాధ్య దైవాలుగా భావిస్తారు. స్టార్ హీరోల సినిమా వేడుకలు, బర్త్ డే వేడుకలకు అభిమానుల హంగామా ఎలా ఉంటుందో ప్రత్యేకమా చెప్పనవసరం లేదు. తమ ప్రాణాలని పణంగా పెడుతూ అభిమాన హీరోకి కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారు. 

పాలాభిషేకాలు చేస్తారు. ఇక రక్తదానం, అన్నదానం, సేవా కార్యక్రమాలు లాంటి మంచి పనులు కూడా చేస్తారు. ఇంతవరకు బాగానే ఉంది. అభిమానం శృతి మించకూడదు అనేది ప్రతి ఒక్కరూ చెప్పే విషయమే. 

తెలుగువారికి సుపరిచితుడు, కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ బర్త్ డే సెలబ్రేషన్స్ కర్ణాటక వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తన పుట్టిన రోజుని ఎవరూ సెలెబ్రేట్ చేయవద్దు.. మీ ఆశీస్సులు చాలు అని సుదీప్ అభిమానులని కోరాడు. 

కానీ ఫ్యాన్స్ వినరు కదా.. కర్ణాటక లోని అన్ని జిల్లాల్లో సుదీప్ బర్త్ డే వేడుకలు నిర్వహించిన ఫ్యాన్స్ హంగామా సృష్టించారు. కానీ బళ్లారి జిల్లా సందూర్ గ్రామంలో సుదీప్ అభిమానుల పైత్యం శృతి మించింది. ఆ ఊళ్ళో సుదీప్ ఫ్యాన్స్ నిర్వహించిన బర్త్ డే సెలబ్రేషన్స్ వివాదంగా మారాయి. సెప్టెంబర్ 2న సుదీప్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. 

ఇంతకీ అభిమానులు చేసిన ఘనకార్యం ఏంటంటే.. సుదీప్ కటౌట్ ముందు ఏకంగా మూగ జీవి దున్నపోతును బలి ఇచ్చారు. ఈలలు, కేకలు వేస్తూ నానా హంగామా సృష్టించారు. తమ హీరో సినిమాలు సూపర్ హిట్స్ కావాలని కోరుతూ ఇందంతా చేశారు అభిమానులు. 

దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆఖరికి సుదీప్ అభిమానులు కూడా సందూర్ లో జరిగిన సంఘటనని వ్యతిరేకిస్తున్నారు. మేము కూడా సుదీప్ అభిమానులమే.. కానీ ఇలాంటివి సహించం అని కామెంట్స్ పెడుతున్నారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొందరు ఈ వీడియోను కర్ణాటక సీఎంఓ కి ట్యాగ్ చేస్తున్నారు. దీనిపై జంతు సంరక్షణ సంఘాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. 

కిచ్చా సుదీప్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచయం. ఈగ, బాహుబలి, రక్త చరిత్ర, సైరా లాంటి చిత్రాల్లో సుదీప్ నటించాడు. ఈగలో విలన్ గా సుదీప్ నటన అద్భుతంగా ఉంటుంది. 

click me!