తారకరత్నను పరామర్శించిన జూ. ఎన్టీఆర్.. ఆయన కోసం రాష్ట్ర మంత్రిని పంపిన కర్ణాటక సీఎం..!

First Published Jan 29, 2023, 3:14 PM IST

బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న తారకరత్నను పరామర్శించేందుకు ఆయన సోదరులు, ప్రముఖ సినీ నటులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లు ఈ రోజు ఆస్పత్రికి వచ్చారు. బెంగళూరుకు విచ్చేసిన వారికి కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ స్వాగతం పలికారు. 

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న సమయంలో గుండెపోటుకు గురైన సినీ నటుడు తారకరత్న ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే తారకరత్నను పరామర్శించేందుకు ఆయన సోదరులు, ప్రముఖ సినీ నటులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లు ఈ రోజు బెంగళూరుకు వచ్చారు.  
 

తారకరత్నను పరామర్శించేందుకు జూనియర్ ఎన్టీఆర్ బెంగళూరు వస్తున్నారనే సమచారంతో కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై.. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్‌ను వారి వద్దకు పంపారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లకు స్వాగతం పలికిన సుధాకర్.. వారితో పాటే నారాయణ హృదయాలకు చేరుకున్నారు.
 

ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లు వైద్యులను అడిగి  తారకరత్న ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. తారకరత్న ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని డాక్టర్లు వారికి తెలిపారు. అవసరమైతే విదేశాల నుంచి ఎక్స్‌పర్ట్స్‌ను పిలిపించాలని వారు కోరినట్లు తెలుస్తుంది. తారకరత్న తండ్రి మోహన్‌కృష్ణతో కూడా వారు మాట్లాడారు. 

జూనియర్ ఎన్టీఆర్‌తో పాటే నారాయణ హృదయాలకు వెళ్లిన కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ కూడా వైద్యులతో మాట్లాడారు. తారకరత్న హెల్త్‌ కండీషన్‌‌ను ఆరా తీశారు. కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి ధైర్యం చెప్పారు. 

తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల నుంచి సమాచారం తెలుసుకున్నట్టుగా మంత్రి సుధాకర్ పేర్కొన్నారు. అవసరమైతే నిపుణులైన స్పెషలిస్ట్ వైద్యులతో కూడా చికిత్స అందించాలని సూచించారు. తమ ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తోందని తెలిపారు. తారకరత్న త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్టుగా చెప్పారు. 

తారకరత్నను పరామర్శిచిన అనంతరం జూనియర్ ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. తన అన్న తారకరత్నకు మెరుగైన వైద్యం అందిస్తున్నారని చెప్పారు. ఆయనకు అభిమానుల ఆశీర్వాదం, తాత ఆశీర్వాదం ఉందన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని దేవున్ని కోరుకుంటున్నట్టుగా చెప్పారు.

అందరూ ప్రార్థనలు కొనసాగించాలని, అభిమానుల ఆశీర్వాదం ఎంతో ముఖ్యమని చెప్పారు. తాను తారకరత్నను చూశానని.. ఆయన స్పందిస్తున్నారని.. మంచి వైద్యం అందుతుందని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. మరో ఇద్దరు వైద్యులను కూడా ఇక్కడికి రప్పించడం జరుగుతుందని అన్నారు. 
 

ప్రస్తుతం ఆయన నిలకడగా ఉన్నారు.. అలాగానీ క్రిటికల్ కండీషన్ నుంచి బయటకు వచ్చినట్టుగా కాదని ఎన్టీఆర్ అన్నారు. అయితే చికిత్సకు స్పందిస్తున్నారని.. ఇది మంచి పరిణామని తెలిపారు. ఎక్మో సాయంలో తారకరత్న లేరని అన్నారు. 

click me!