
జూ ఎన్టీఆర్ ప్రస్తుతం `డ్రాగన్` మూవీలో నటిస్తున్నాడు. షూటింగ్‌లో భాగంగా ఆయన భుజానికి గాయం కావడంతో రెస్ట్ లో ఉన్నారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన ఫహద్ ఫాజిల్ హీరోగా నటించిన `డోంట్ ట్రబుల్ ది ట్రబుల్` చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి గెస్ట్ గా హాజరయ్యారు. దీనికి రాజమౌళి కొడుకు కార్తికేయ నిర్మాత. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఈవెంట్‌లో తారక్ సందడి చేశారు. గాయం తర్వాత తొలిసారి బయటకు రావడంతో అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఎన్టీఆర్ ని చూసేందుకు, ఆయన స్పీచ్ వినేందుకు తహతహలాడారు.
అభిమానులను కూడా ఎన్టీఆర్ అంతే బాగా ఆకట్టుకున్నారు. వారి గొప్పతనం చెప్పారు. వాళ్లు తనకు ఎంత ముఖ్యమో వెల్లడించారు. అభిమానులు లేకపోతే తాను లేననే విషయాన్ని స్పష్టం చేశారు. అదే సమయంలో వాళ్లే తన కుటుంబంగా వర్ణించారు ఎన్టీఆర్. కాకపోతే ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. తన మొదటి సినిమా ఓపెనింగ్ సమయంలో తన వెంట ఫ్యామిలీ ఎవరూ లేరని చెప్పాడు. తన మొదటి సినిమా `నిన్ను చూడాలని` మూవీకి రామోజీరావు నిర్మాత అని, ఆర్‌ఎఫ్‌సీలో ఓపెనింగ్ జరిగితే తన అమ్మ రాలేదు, నాన్న రాలేదు, నీ పాట్లు నువ్వే పడు అని చెప్పారని, ఆ సమయంలో తనతోడుగా ఎవరైనా ఉంటే బాగుండు అనిపించిందట. ధైర్యం చెప్పేవాళ్లు లేక బాధపడ్డానని తెలిపారు ఎన్టీఆర్.
తన బాధని దేవుడు విన్నాడేమో మీ అందరిని నాకు ఇచ్చాడు, మీ అందరిని నా ఫ్యామిలీని చేశాడని అభిమానులను ఉద్దేశించి చెప్పాడు తారక్. ఆ తర్వాత జక్కన్న ఫ్యామిలీని ఇచ్చాడని, కీరవాణి, వల్లి, రమా రాజమౌళి ఇలా పెద్ద కుటుంబాన్ని ఇచ్చాడని, అదే సమయంలో కార్తికేయ వంటి తమ్ముడిని ఇచ్చాడని చెప్పాడు ఎన్టీఆర్. ఈ క్రమంలో జక్కన్న ఫ్యామిలీపై ప్రశంసలు కురిపించారు. తనకు బాధ అయినా, సంతోషం అయినా వారితోనే అనేలా ఆయన వెల్లడించారు. అభిమానుల వల్లే తాను ఈస్థాయికి వచ్చానని, రాజమౌళి ఫ్యామిలీ తనకు బ్యాక్‌బోన్‌లా ఉన్నారని ఎన్టీఆర్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఎమోషనల్ అయ్యారు.
ఎన్టీఆర్ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఎన్టీఆర్ తన స్పీచ్‌లో నందమూరి ఫ్యామిలీ తన వెంట లేదనే విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పినట్టుగా ఉంది. తన స్వతహాగా ఎదిగాననే సందేశాన్ని ఇచ్చారు. అప్పుడు తాను ఒంటరే, ఇప్పుడు కూడా ఒంటరనే అనే విషయాన్ని ఎన్టీఆర్ చెప్పదలుచుకున్నాడా అనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. ఇటీవల కాలంలో నందమూరి ఫ్యామిలీకి, ఎన్టీఆర్‌కి మధ్య కొంత గ్యాప్ కనిపిస్తుంది. బాలయ్యకి, తారక్ మధ్య విభేదాలున్నట్టు వార్తలు వస్తున్నాయి. నందమూరి ఫ్యామిలీ తారక్‌ని దూరంపెడుతుందనే పుకార్లు ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా తారక్ చేసిన కామెంట్లు మరింత ఇంట్రెస్టింగ్‌గా మారాయి. అదే సమయంలో ఆయా పుకార్లకి బలం చేకూరేలా ఉన్నాయి.
అదే సమయంలో తారక్ కామెంట్స్ పై టీడీపీ అభిమానులు, ట్రోలర్స్ రెచ్చిపోతున్నారు. నందమూరి అభిమానులు కూడా కౌంటర్ ఇస్తున్నారు. నందమూరి ఫ్యామిలీ మెంబర్ కావడం వల్లే ఆ రోజు రామోజీరావు మీకు ఆఫర్ ఇచ్చారని, తొలి ఛాన్స్ రావడం వెనుక ఉన్నదే వాళ్లు అని అంటున్నారు. నందమూరి ట్యాగ్ వల్లే ఈ స్థాయికి వచ్చావని, లేకపోతే ఎవరూ పట్టించుకునేవాళ్లు కాదని, కానీ ఇప్పుడు ఇలా మాట్లాడటం సరికాదు అంటున్నారు. రకరకాల కామెంట్లతో ఎన్టీఆర్‌ని ఆడుకుంటున్నారు ట్రోలర్స్. మొత్తంగా ఎన్టీఆర్ కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో, నందమూరి ఫ్యామిలీలో ఆసక్తికరంగా, చర్చనీయాంశంగా మారాయని చెప్పొచ్చు.