
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీబాషాను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసు బృందం గోవాలోని లాడ్జిలో అతడిని అదుపులోకి తీసుకుంది. అక్కడి కోర్టులో హాజరు పరిచి నగరానికి తీసుకొస్తున్నారు. నేరుగా ఉప్పరపల్లి కోర్టులో జానీ మాస్టర్‌ను హాజరుపరిచే అవకాశముంది.
ఈ నేపధ్యంలో జానీ మాస్టర్ కేసుపై పలువురు టాలీవుడ్ ప్రముఖులు స్పందిస్తున్నారు. బాధితురాలికి న్యాయం జరగాలని కోరుతున్నారు. అదే సమయంలో ఆరోపణలు ప్రూవ్ చేయకుండా ఒక వ్యక్తిని నిందించడం సరికాదంటూ మరి కొందరు జానీ మాస్టర్ కు మద్దతు పలుకుతున్నారు. తాజాగా ప్రముఖ నటుడు, జనసేన నేత, మెగా బ్రదర్ నాగబాబు జానీ మాస్టర్ కేసుపై స్పందించారు.
జానీ మాస్టర్ పేరు డైరెక్టుగా చెప్పకపోయినప్పటికీ ఈ వ్యవహారంపై వరుసగా ట్వీట్స్ చేశారు మెగా బ్రదర్. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్స్ వైరల్ గా మారాయి. మొదటి పోస్ట్ లో "మీరు విన్న ప్రతి విషయాన్ని నమ్మకండి. ప్రతి కథకి మూడు కోణాలు ఉంటాయి. ఒకటి మన కోణం, రెండోది ఇతరుల కోణం, మూడోది నిజం." అని అమెరికా జర్నలిస్ట్ రాబర్ట్ ఎవాన్స్ రాసిన కొటేషన్‌ను నాగ బాబు షేర్ చేశారు.
అంతకు ముందు ‘న్యాయస్థానంలో నేరం రుజువయ్యే వరకు ఏ వ్యక్తిని నేరానికి పాల్పడినట్లుగా పరిగణించలేరు’ అని బ్రిటిష్ లాయర్ సర్ విలియం గారో చెప్పిన కొటేషన్‌ను కూడా నాగ బాబు షేర్ చేశాడు. అయితే ఈ రెండు ట్వీట్స్ లో ఎక్కడా జానీ మాస్టర్ పేరు ప్రస్తావించలేదు నాగ బాబు. అయితే వీటి అర్థాలు, సందర్భాన్ని బట్టి చూస్తే జానీ మాస్టర్ కోసమే ఈ ట్వీట్స్ చేసినట్లు ఉంది.
ఇక తనపై పలుమార్లు అత్యాచారం చేశాడంటూ ఓ మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ (21) ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఆదివారం కేసు నమోదైంది. బాధితురాలు రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి నార్సింగికి బదిలీ చేశారు. అతడిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి జానీ మాస్టర్‌ను అరెస్ట్ చేశారు.
బాధితురాలి ఫిర్యాదులో ఏముందంటే..
‘‘2017లో జానీ మాస్టర్ పరిచయమయ్యాడు. 2019లో అతని టీమ్ లో సహాయ నృత్య దర్శకురాలిగా చేరాను. ముంబయిలో ఓ సినిమా షూటింగ్ నిమిత్తం జానీ మాస్టర్‌తో పాటు నేను, మరో ఇద్దరు సహాయకులం వెళ్లాం. అక్కడ హోటల్‌లో నాపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే పని నుంచి తొలగిస్తానని, సినిమా పరిశ్రమలో ఎప్పటికీ పనిచేయలేవని బెదిరించాడు. దీన్ని అవకాశంగా తీసుకుని.. హైదరాబాద్ నుంచి ఇతర నగరాలకు సినిమా షూటింగ్ కు తీసుకెళ్లిన సందర్భాల్లో అనేకమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. షూటింగ్ సమయంలోనూ వ్యానిటీ వ్యాన్‌లో అసభ్యంగా ప్రవర్తించేవాడు.
లైంగిక వాంఛ తీర్చనందుకు ఒకసారి జుట్టు పట్టుకుని తలను అద్దానికి కొట్టాడు. మతం మారి.. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసేవాడు. వేధింపులు భరించలేక జానీ మాస్టర్ టీమ్ నుంచి బయటకొచ్చేశాను. అయినా సొంతంగా పనిచేసుకోనివ్వకుండా, ఇతర ప్రాజెక్టులు రాకుండా ఇబ్బందిపెట్టాడు. ఆగస్టు 28న మా ఇంటి గుమ్మానికి గుర్తుతెలియని వ్యక్తులు ఓ పార్సిల్ వేలాడదీశారు. ‘మగబిడ్డకు అభినందనలు. కానీ జాగ్రత్తగా ఉండు’ అని అందులో రాసి ఉంది’’ అని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది.