Srikanth: టాలీవుడ్‌లో మహిళా ప్రేక్షకుల్లో ఆ కాలంలో విపరీతమైన స్టార్ ఇమేజ్ ఉన్న హీరో శ్రీకాంత్. ఆయన సినిమా రిలీజ్ అయితే పండగే.. అటు వంటి హీరో.. ఒకప్పుడు తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లే పరిస్థితి వచ్చిందట. అప్పుడు చిరంజీవి ఏం చేశారో తెలుసా?
తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు హీరో శ్రీకాంత్. కుటుంబ కథా చిత్రాలకు, మినిమమ్ గ్యారెంటీ సినిమాలకు ఆయన కేరాఫ్ అడ్రస్‌గా ఉండేవారు. ప్రతి నటుడి జీవితంలో లాగే శ్రీకాంత్ సినీ కెరీర్‌లో కూడా ఎన్నో గెలుపోటములు, హెచ్చుతగ్గులు ఉన్నాయి. ఒకానొక దశలో ఆయన తీవ్రమైన ఒత్తిడికి, డిప్రెషన్‌కు లోనైన పరిస్థితులను చూశారు. సినీ పరిశ్రమలో విజయం ఎంత వేగంగా వస్తుందో, ఫెయిల్యూర్ కూడా అంతే వేగంగా మానసిక ఒత్తిడికి గురిచేస్తుంది. అటువంటి కష్ట సమయంలో మెగాస్టార్ చిరంజీవి చెప్పిన మాటలు తనపై ఎలాంటి ప్రభావం చూపించాయనే విషయాన్ని శ్రీకాంత్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
25
మానసిక ఒత్తిడి - కుటుంబ సభ్యుల ఆందోళన
సినిమా పరిశ్రమలో వరుస ఫెయిల్యూర్స్ లేదా అనుకున్న ఫలితాలు రానప్పుడు నటులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. శ్రీకాంత్ కూడా అటువంటి డిప్రెషన్ అనుభవించిన సమయంలో ఆయన కుటుంబ సభ్యులు తీవ్రంగా భయపడిపోయారు. ముఖ్యంగా శ్రీకాంత్ తల్లిదండ్రులు చాలా ఆందోళన చెందారట.
"వీడు అనవసరంగా ఇండస్ట్రీకి వచ్చాడు, ఇంతలా డిప్రెషన్ ఫీల్ అవుతున్నాడేంటి?" అని నాన్నగారు, అమ్మగారు భయపడ్డారని శ్రీకాంత్ తెలిపారు. అంతేకాదు "నువ్వు మరీ ఇంతగా కుంగిపోతే ఎలా? అనవసరంగా వచ్చాం, పద ఊరికి వెళ్ళిపోదాం" అని కూడా ఆయనను ఒత్తిడి నుంచి కాపాడేందుకు కుటుంబ సభ్యులు సూచించిన సందర్భాలు ఉన్నాయట.
శ్రీకాంత్ వరుస ప్లాప్‌ల వల్ల తీవ్రమైన డిప్రెషన్‌లో ఉన్నారనే విషయం తెలిసిన చిరంజీవి వెంటనే స్పందించారు. ఆ సమయంలో అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగుతున్న తన సినిమా షూటింగ్ స్పాట్‌కు శ్రీకాంత్‌ను పిలిపించారు. శ్రీకాంత్‌ను పక్కన కూర్చోబెట్టుకుని, "ఏంట్రా చాలా డల్లుగా ఉంటున్నావు, ఏమైంది?" అని ప్రేమగా ప్రశ్నించారు. శ్రీకాంత్ తన మనసులోని బాధను, కంటిన్యూస్‌గా సినిమాలు ప్లాప్ అవ్వడం వల్ల ఎదుర్కొంటున్న మానసిక ఇబ్బందిని చిరంజీవితో పంచుకున్నారు.
శ్రీకాంత్ బాధను విన్న చిరంజీవి .. తన సొంత సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న అనుభవాలను ఉదాహరణగా చెప్తూ శ్రీకాంత్‌కు గొప్ప ధైర్యాన్ని ఇచ్చారు. "నువ్వు మొదట ఈ పరిశ్రమకు వద్దామని కూడా అనుకోలేదు, కానీ వచ్చావు.. హీరోగా నిలబడ్డావు. అది దేవుడు నీకిచ్చిన అతిపెద్ద వరం. విజయాలను ఎలాగైతే ఆస్వాదిస్తావో, వైఫల్యాలను కూడా అంతే సాధికారికంగా, స్పోర్టివ్‌గా తీసుకోవాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ డిప్రెషన్‌కి వెళ్ళకూడదు. డిప్రెషన్‌లోకి వెళ్లి, అనవసర అలవాట్లకు బానిసై నిన్ను నువ్వు పాడుచేసుకుంటే కుటుంబానికి, నిన్ను నమ్మిన వారికి తీవ్ర ఇబ్బంది కలుగుతుంది." అని చెప్పారు.
55
శ్రీకాంత్‌లో వచ్చిన మార్పు
ఫెయిల్యూర్స్‌ను జయించడానికే ముందుకు వెళ్లాలి తప్ప వెనకడుగు వేయకూడదని చిరంజీవి దిశానిర్దేశం చేశారు. మెగాస్టార్ చెప్పిన ఆ మాటలు శ్రీకాంత్‌పై తీవ్ర ప్రభావం చూపాయి. ఆ రోజు నుంచి ఆయన తన మానసిక స్థితిని పూర్తిగా మార్చుకోవడానికి ప్రయత్నించడం ప్రారంభించారు. ప్లాప్‌లు వచ్చినా కుంగిపోకుండా, మళ్లీ ధైర్యంగా ముందుకు సాగడం అలవాటు చేసుకున్నారు.