
హీరో సుమన్ ఒకప్పుడు టాలీవుడ్‌లో మంచి అండగాడుగా నిలిచారు. ఇప్పుడున్న సీనియర్లలో ఆయన్ని మించిన అందం ఎవరికీ లేదు. అదే సమయంలో ఒకప్పుడు మంచి స్టార్ హీరోగానూ రాణించారు. యాక్షన్ హీరోగా పేరుతెచ్చుకున్నారు. మెగాస్టార్‌లాగా యాక్షన్ సినిమాలు చేసి మెప్పించారు. సుమన్ నటించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద అదిరిపోయే వసూళ్లని రాబట్టాయి. మాస్ ఆడియెన్స్ నే కాదు, ఫ్యామిలీ ఆడియెన్స్ కి కూడా దగ్గరయ్యారు సుమన్. లుక్ పరంగా చిరంజీవికి పోటీ ఇచ్చారు.
కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడే సుమన్ జీవితాన్ని దెబ్బకొట్టింది ఒక కేసు. నీలిచిత్రాల కేసు ఆయన కెరీర్‌ని తలక్రిందులు చేసింది. తమిళనాడు సీఎం, ఒక రౌడీ షీటర్, అప్పటి డీజీపీ చేసిన కుట్రకి సుమన్ బలయ్యాడు. డీజీపీ కూతురు సుమన్‌పై ఇంట్రెస్ట్ చూపించడంతో దాన్ని బ్రేక్ చేసేందుకు పై ముగ్గురు కలిసి కుట్ర చేసి సుమన్‌ని ఈ కేసులో ఇరికించారు. జైలుకి పంపించారు. దీంతో ఆయన సినిమా కెరీర్ చాలా ప్రభావితమైంది. ఆ తర్వాత హీరోగా సినిమాలు చేసినా కొన్ని ఆడాయి, మరికొన్ని ఆడలేదు. హీరోగా సినిమాలు చేస్తున్నారు కానీ, మళ్లీ ఆయనేంటో చూపించే సక్సెస్ రాలేదు. దీంతో కెరీర్ డౌన్ అవుతూ వచ్చింది.
అలాంటి పరిస్థితుల్లో శోభన్‌బాబు.. ఆయనకు మరో లైఫ్ ఇచ్చాడు. ఆయన కెరీర్ మరో మలుపు తిప్పడానికి పరోక్షంగా కారకుడయ్యాడు. అది ఎలా అనేది చూస్తే.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు.. నాగార్జున హీరోగా `అన్నమయ్య` సినిమాని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇందులో వెంకటేశ్వరస్వామి పాత్రకి మొదట శోభన్‌బాబుని అడిగారు. అప్పటికే ఆయన రిటైర్‌మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఆ పాత్ర చేయడానికి ఒప్పుకోలేదు. ఈ ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించారు.
అనంతరం సుమన్ వద్దకు ఈ పాత్ర వెళ్లింది. సుమన్ చేయడంతో సినిమా పెద్ద హిట్ అయ్యింది. వెంకటేశ్వరస్వామి పాత్రలో సుమన్ ఒదిగిపోయాడు. ఇంకా చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి ఇలానే ఉంటాడా అనేంతగా పాత్రకి ప్రాణం పోశాడు సుమన్. కృష్ణుడు అంటే ఎన్టీఆర్ ఎలా గుర్తుకు వస్తారో, వెంకటేశ్వర స్వామి అంటే సుమన్ గుర్తొచ్చేలా ఆయన ఆ పాత్రలో జీవించి రక్తికట్టించారు. `అన్నమయ్య` సినిమా విజయంలో ఆయన పాత్ర కీలక భూమిక పోషించిందని చెప్పొచ్చు. దీంతో ఈ సినిమాతో సుమన్ కెరీరే మారిపోయింది. దేవుడి పాత్రలకు ఆయన కేరాఫ్ అడ్రస్‌గా మారారు. వరుసగా అనేక సినిమాల్లో వెంకటేశ్వరుడి పాత్రలు చేశారు. అదే సమయంలో సుమన్‌కిది సినిమాల్లో సెకండ్ లైఫ్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ టర్న్ తీసుకుని దూసుకుపోయారు.
ఆ తర్వాత సేమ్ కాంబినేషన్‌లో `శ్రీరామదాసు` చిత్రం వచ్చింది. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలోనూ నాగార్జున హీరో. ఇందులో రాముడి పాత్రని పోషించారు సుమన్. ఆ పాత్ర కూడా క్లైమాక్స్ లో హైలైట్‌గా నిలిచింది. సినిమాని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్ళింది. ఇప్పటికీ అడపాదడపా అలాంటి దేవుడి పాత్రలు పోషిస్తూ, వెండితెర దేవుడిగా మారిపోయారు సుమన్. అదే శోభన్‌బాబు ఆరోజు `అన్నమయ్య` సినిమా చేసి ఉంటే సుమన్ కెరీర్ స్ట్రగుల్స్ లో ఉండేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు.