
అటు సినిమా ఇటు రాజకీయం. పవన్ రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు. ఏక కాలంలో రెండు పనులంటే దేనికీ న్యాయం చేయలేము. పవన్ పరిస్థితి అలానే ఉంది. ఆయన్ని పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా ప్రజలు నమ్మడం లేదు. విజయం సాధిస్తే రాజకీయాలు లేదంటే సినిమాలు చేసుకుంటాడు, అనే వాదన జనంలో బలంగా ఉంది. జనసైనికులకు మాత్రమే ఆయన కాకలు తీరిన పొలిటీషియన్. సాధారణ జనాలు పవన్ ని ఒక పొలిటీషియన్ గా, రాజకీయ ప్రత్యామ్నాయంగా చూడటం లేదు.
పవన్ సినిమాలు వదిలేస్తున్నట్లు 2018లో ప్రకటించారు. జనాల కోసం కోట్ల సంపాదన తృణప్రాయంగా వదిలేశానని చెప్పి, అదో పెద్ద త్యాగం మాదిరి చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఆయన వాగ్దానం ఏడాదిలోనే పటాపంచలు అయిపోయింది. 2019 ఎన్నికల ఓటమితో బ్యాక్ టు సినిమాలు అన్నాడు. ఒకటికి నాలుగు సినిమాలు ప్రకటించారు. నాకు తెలిసింది సినిమా మాత్రమే పార్టీని నడపడానికి,కుటుంబ పోషణకు సినిమాలు చేస్తున్నాను. రాజకీయ నాయకులు వ్యాపారాలు చేయడం లేదా?నేను సినిమాలు చేస్తే తప్పేంటి? అని సమర్ధించుకున్నాడు.
అసలు పవన్ సినిమాలు వదిలేయాలని కానీ మళ్ళీ సినిమాల్లోకి రాకూడదని కానీ ఎవరూ అనలేదు. ఈ విషయంలో ప్రశ్న ఆయనదే, సమాధానం కూడా ఆయనదే. పవన్ నిలకడలేని మనస్తత్వానికి ఇలాంటి ఉదాహరణలు బొచ్చెడు. పవన్ కళ్యాణ్ కి 2024 ఎన్నికలు కీలకం. జనసేన పార్టీని నడిపేందుకు కోట్లు కావాలట. ఇతర పార్టీలు కోట్లు పంచుతున్నారు. అందుకే గెలుస్తున్నారని చెప్పుకునే పవన్ కళ్యాణ్ కి ఎన్నికలకు వందల కోట్లు దేనికో అర్థం కావడం లేదు.
చాలా కాలంగా జనసేన పార్టీ పేరున విరాళాలు సేకరిస్తున్నారు. ఆ పార్టీ సానుభూతి పరులైన ధనికులు లక్షల్లో పార్టీ ఫండ్ ఇస్తున్నారు. ఎన్నారైలు కోట్లు సమర్పిస్తున్నారు. ప్రతి నెలా వెయ్యి, రెండు వేలు చందాగా ఇచ్చే మధ్యతరగతి డైహార్డ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ప్రజాస్వామ్యానికి నిలువెత్తు నిదర్శనమని చెప్పుకునే జనసేన పార్టీ నిర్వహణకు కోట్ల రూపాయల అవసరం ఏమిటీ? సోషల్ మీడియాలో పని చేసేవారు కూడా స్వచ్ఛందంగా చేసేవారే ఎక్కువ. ఇక పవన్ మీటింగులకు, సభలకు అయ్యే ఖర్చు స్థానిక నేతలు చూసుకుంటారు.
కోట్ల సంపాదన కుటుంబం కోసం అనుకుంటే... తెల్ల బట్టలు, మట్టి పిడతలో పెరుగు అన్నం తినే పవన్ నెలసరి ఖర్చు ఎంత? సిబ్బంది వేతనాలు, భార్యాపిల్లల లగ్జరీ లైఫ్ అనుభవించినా నెలకు కోటి రూపాయల ఖర్చు కాదు. సినిమాకు రమారమి రూ. 50 కోట్లు తీసుకుంటున్న పవన్ డబ్బులు దేనికి కూడబెడుతున్నట్లు? ఆయన కూడా డబ్బులు పంచి ఎన్నికల్లో గెలవాలి అనుకుంటున్నారా? అలాంటప్పుడు జనసేన సిద్ధాంతం మాటేమిటీ? ఇలా అనేక సమాధానం లేని ప్రశ్నలు ఉన్నాయి.
జనసేన పార్టీ తరపున కౌలు రైతులకు ఒక్కొక్కరికీ లక్ష రూపాయల చేసిన సాయం లెక్కలోకి తీసుకున్నా పంచింది ఎంత? ఒక వేయి మంది కౌలు రైతులకు లక్ష ప్రకారం పంచినా పదికోట్లే. ఏపీ ఎన్నికలకు మరో 15 నెలల సమయం మాత్రమే ఉంది. మరో రెండు చిత్రాలు పూర్తి చేసి పవన్ కనీసం ఒక వంద కోట్లు కూడబెట్టాలనే టార్గెట్ పెట్టుకున్నాడు. దీని కోసం సినిమాల ఎంపిక విషయంలో పక్కా కమర్షియల్ గా మారారు.
సినిమాలో ఆయన పాత్ర పరిధి తక్కువ ఉండాలి. రీమేక్ అయితే బెటర్.స్ట్రెయిట్ మూవీ అయినా ఓకే కానీ, తక్కువ సమయంలో పూర్తి చేయాలి. జయాపజయాలతో ఆయనకు సంబంధం లేదు. తన యాభై కోట్ల రెమ్యూనరేషన్ ముందుగానే ఇచ్చేయాలి. వకీల్ సాబ్ తర్వాత ఒప్పుకున్న భవదీయుడు భగత్ సింగ్, సురేందర్ రెడ్డి చిత్రాలు పక్కన పెట్టి భీమ్లా నాయక్ చేసింది అందుకే. వినోదయ సిత్తం రీమేక్ కి సైన్ చేయడం వెనుక కారణం అదే. సుజీత్ మూవీలో కూడా పవన్ పాత్ర పరిధి తక్కువగానే ఉంటుందట. సినిమా మొదలైన 20-30 నిమిషాల తర్వాత ఆయన ఎంట్రీ ఇస్తారట. హరి హర వీరమల్లుకు అనవసరంగా కమిట్ అయ్యాననే బాధ ఆయన్ని వెంటాడుతుంది. ఆ సినిమాకు కేటాయించిన సమయంలో మరో రెండు చిత్రాలు పూర్తయ్యేవని బాధపడుతున్నాడు. మధ్యలో వదిలేసే ప్రయత్నం చేసి కుదరక కంప్లీట్ చేయాలని డిసైడ్ అయ్యాడు. రాజకీయంగా ఎదగాలని పునాది వేసిన సినిమాను పవన్ తొక్కేస్తున్నారు.