టాలీవుడ్ హైదరాబాద్ కి రావడానికి కృషి చేసిన వారిలో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. తనతో మూవీ చేయాలనుకుంటున్న దర్శక నిర్మాతలకు హైదరాబాద్ లో చిత్రీకరణ జరపాలని కండిషన్ పెట్టేవారట. ఈ క్రమంలో అవకాశాలు చేజారినా ఆయన పట్టువీడలేదట. తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్ లో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఏఎన్నార్ అన్నపూర్ణ స్టూడియో నిర్మించారు.
భార్య పేరిట నిర్మించిన అన్నపూర్ణ స్టూడియో అంటే ఏఎన్నార్ కి చాలా ఇష్టం. తరచుగా ఆయన సందర్శిస్తూ ఉండేవారట. అన్నపూర్ణ స్టూడియోతో ఆయనకు అనుబంధం పెనవేసుకుంది. 2014లో ఏఎన్నార్ కన్నుమూశారు. కుటుంబ సభ్యులు అక్కడే ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఇటీవల విగ్రహం ఏర్పాటు చేశారు. ఏఎన్నార్ విగ్రహ ఆవిష్కరణకు టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. ఏఎన్నార్ తో తమకున్న అనుభవాలు, అనుబంధాన్ని పంచుకున్నారు.
దశాబ్దాలుగా అన్నపూర్ణ స్టూడియో చిత్ర నిర్మాణానికి అవసరమైన సేవలు అందిస్తుంది. అన్నపూర్ణ స్టూడియో నాగార్జున సారథ్యంలో సక్సెస్ఫుల్ గా సాగుతుంది. డిసెంబర్ 4న హీరో నాగ చైతన్య-శోభితల వివాహం ఇక్కడే జరిగింది. కాగా ఈ స్టూడియో ఆవరణలో తండ్రి ఏఎన్నార్ కి తెలియకుండా చేసిన చిన్న చిన్న సరదాల గురించి ఒకసారి నాగార్జున ఓపెన్ అయ్యారు.
అడవి శేష్ హీరోగా నటించిన గూఢచారి చిత్ర షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలోనే జరిగిందట. గూఢచారి ప్రమోషనల్ ఈవెంట్ కి నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. గూఢచారి చిత్ర యూనిట్ 17 రోజులు అన్నపూర్ణ స్టూడియో ఆవరణలో షూటింగ్ జరిపారని తెలిసి నేను ఆశ్చర్యపోయాను. అది కూడా ఫ్లోర్ లో కాకుండా బయట. అన్నపూర్ణ స్టూడియోలో నాకు తెలియని లొకేషన్స్ ఏమున్నాయి? అన్ని రోజులు షూటింగ్ ఎలా చేశారు? అంటూ.. నాగార్జున ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ.. అన్నపూర్ణ స్టూడియోని మీలా ఇంకెవరు వాడి ఉండరు. ఇప్పుడు నాన్న ఉంటే చాలా సంతోషించేవారు. నేను చిన్నప్పుడు నాన్నకు తెలియకుండా లోపల ఫారెస్ట్ లోకి వెళ్లి బీర్ తాగేవాడిని, మీరు ఆ ఫారెస్ట్ లో షూటింగ్ చేసారు, అన్నారు. సెట్స్ లో కాకుండా అన్నపూర్ణ స్టూడియో ఆవరణలో ఉన్న చెట్ల మధ్య అన్ని రోజులు షూటింగ్ ఎలా చేశారనేది... నాగార్జున భావన.
ఆయన ఫ్లోలో... స్టూడియోలో ఉన్న చెట్ల చాటుకు వెళ్లి ఏఎన్నార్ కి తెలియకుండా బీర్ తాగిన విషయం లీక్ చేశాడు. అదన్నమాట సంగతి. మరోవైపు నాగార్జున నా సామిరంగ మూవీతో ఓ మోస్తరు విజయం ఆదుకున్నారు. ప్రస్తుతం కూలీ, కుబేర చిత్రాల్లో నటిస్తున్నారు. రజినీకాంత్-లోకేష్ కనకరాజ్ కాంబోలో వస్తున్న కూలీ చిత్రంలో నాగార్జున రోల్ అద్భుతంగా ఉంటుందని సమాచారం. అలాగే ధనుష్ తో చేస్తున్న కుబేరలో పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ రోల్ చేస్తున్నారట. శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న కుబేర టీజర్ మెప్పించింది.