ఈరోజు (నవంబర్ 10) థియేటర్లలో రిలీజ్ అయిన చిత్రాల్లో ‘అలా నిన్ను చేరి‘ Ala Ninnu Cheri ఒకటి. ఈ మూవీలో దినేష్ తేజ్ హీరోగా, హేబా పటేల్, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్లుగా నటించారు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మారేష్ శివన్ దర్శకత్వం వహించారు. మరీ సినిమా కథేంటీ? ఎలా ఉందనే చూద్దాం.
కథ :
గణేష్ (దినేష్ తేజ్)కు సినిమాలంటే ప్రాణం. విశాఖపట్టణానికి దగ్గర్లోని పల్లెటూరికి చెందిన అతను డైరెక్టర్ కావాలనుకుంటాడు. ఇండస్ట్రీపై ఎంతో ఆశ పెంచుకుంటాడు. ఇదే సమయంలో దివ్య (పాయల్ రాధాకృష్ణ)తో లవ్ లో పడుతాడు. ఇద్దరిది ఓకే ఊరు కావడంతో దివ్య తల్లి కనకమ్మ (ఝాన్సీ)కు విషయం తెలుస్తుంది. వీరి పెళ్లికి అంగీకరించదు. దాంతో గణేశ్ ఊరి నుంచి హైదరాబాద్ కు వెళతాడు. కెరీర్ పై ఎన్నో ఆశలతో వచ్చిన అతనికి అను (హేబా పటేల్) పరిచయం అవుతుంది. బాగాదగ్గరవుతారు కూడా. ఇంతకీ దివ్య ఏమైంది? గణేశ్ డైరెక్టర్ అయ్యాడా? హేబా పటేల్ పరిచయంతో అతని జీవితం ఎలాంటి మలుపు తిరిగిందనేది.. మిగితా సినిమా.
విశ్లేషణ :
ఇండస్ట్రీకి వచ్చే యువతరానికి ఓ మెసేజ్ ఇచ్చే సినిమా ఇది. చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని పల్లెటూరి నుంచి తట్టాబుట్ట సర్దుకుని బయల్దేరిన ఓ యువకుడి కథను దర్శకుడు బాగా చూపించే ప్రయత్నం చేశారు. ప్రథమార్థంలో సినిమా పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది. విలేజ్ వాతావరణం, యూత్ ఫుల్ కంటెంట్, లవ్ సీన్లతో సరదాగా నడుస్తుంది. అక్కడక్కడ ఇబ్బంది పెట్లే సీన్లూ తప్పలేదు. పల్లెలూరిలోని సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. కెరీర్ కు సంబంధించి గణేశ్ పడే తపనను చక్కగా చూపించారు. ఓవైపు ప్రేమ, మరోవైపు లక్ష్యాన్ని బ్యాలెన్స్ చేస్తూ దర్శకుడు మారేష్ శివన్ కథను నడిపించిన తీరు బాగనిపిస్తుంది. ఇక ఇంటర్వెల్ తర్వాత కథ సిటీలోకి మారుతుంది. అప్పుడు ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎంతలా ఎదురుచూసేవారో? ఎలాంటి కష్టాలను దాటాల్సి ఉంటుందో చెప్పారు. అయితే హీరో లక్ష్య చేధనను మరింత వివరంగా, ఇంకాస్తా లోతుగా చూపిస్తే బాగుండేది. సినిమా మొత్తం మీద ఎమోషన్స్, లవ్ సీన్లపై ఇంకాస్తా వర్క్ చేస్తే బాగుండనే ఫీల్ కలుగుతుంది.
నటీనటులు :
హీరో దినేష్ తేజ్ డైరెక్టర్ కావాలనే ప్రయత్నించే యువకుడి పాత్రలో ఒదిగిపోయారు. తన నటన ప్రేక్షకులు మెచ్చుకునేలా ఉంటుంది. మంచి సబ్జెక్ట్ పడితే యంగ్ హీరోగా షైన్ అయ్యే అవకాశం లేకపోలేదు. ఇక హీరోయిన్లు హేబా పటేల్ తన గ్లామర్ తో మెస్మరైజ్ చేసింది. పాయల్ రాధకృష్ణ విలేజ్ అమ్మాయిగా మెప్పించింది. ఆయా పాత్రల్లో ఝాన్సీ, చమ్మక్ చంద్ర, మహేశ్ అచంట, తదితరులు అలరించారు.
టెక్నీషియన్లు :
డైరెక్టర్ ఎంచుకున్న కథ పరంగా బాగానే ఉంది. చెప్పాలనుకున్నది సూటిగా చెప్పడం ఆకట్టుకుంటుంది. కానీ తెరమీద ప్రజెంట్ చేసిన తీరు ఇంకాస్తా మెరుగవ్వాలనిపిస్తుంది. కొన్నిచోట్ల సాగదీతలను కత్తిరించాల్సిన అవసరం ఉంది. కెమెరా వర్క్, మ్యూజిక్ పర్లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు తగ్గట్టుగానే ఉన్నాయి.
బలం, బలహీనత :
దినేష్ తేజ్, హేబా పటేల్ పెర్ఫామెన్స్ అదరగొట్టడం. దర్శకుడు ఎంచుకున్న కథ బాగుండటం సినిమాకు బలం. ఇక బలహీనతల్లో స్క్రీన్ ప్లే సరిగా లేకపోవడం, సాగదీత సన్నివేశాలు ఉండటం.
రేటింగ్ : 2.5/5