Gaalodu Review: సుడిగాలి సుధీర్‌ `గాలోడు` రివ్యూ

First Published | Nov 18, 2022, 1:36 PM IST

బుల్లితెరపై స్టార్‌ ఇమేజ్‌ని తెచ్చుకుని తనదైన కామెడీతో రచ్చ చేస్తున్న సుడిగాలి సుధీర్‌గా హీరోగా `గాలోడు` చిత్రంతో పెద్ద తెరపై రచ్చ చేసేందుకు వచ్చాడు. ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. మరి `గాలోడు` ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

సుడిగాలి సుధీర్‌.. బుల్లితెరపై మారుమోగే పేరు. `జబర్దస్త్`తో పాపులర్‌ అయిన సుధీర్‌.. యాంకర్‌ రష్మితో చేసే రొమాన్స్ తో మరింత క్రేజీని సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో ఆయన హీరోగానూ టర్న్ తీసుకున్న విషయం తెలిసిందే. `సాఫ్ట్ వేర్‌ సుధీర్‌`తో హీరోగా ఆకట్టుకున్న సుధీర్‌.. ఆ తర్వాత `త్రీ మంకీస్‌`, `వాంటెడ్‌ పండుగాడ్‌` చిత్రాలతో అలరించారు. ఇప్పుడు లేటెస్ట్ `గాలోడు` అనే మాస్‌ యాక్షన్‌ మూవీతో అలరించేందుకు వచ్చాడు. `సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌` కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం శుక్రవారం(నవంబర్‌ 18న) విడుదలైంది. మరి బుల్లితెరపై తనదైన కామెడీతో మెప్పించిన సుధీర్‌, పెద్దతెరపై రచ్చ చేశాడా? అనేది `గాలోడు` రివ్యూ(Gaalodu Review)లో తెలుసుకుందాం. 

కథః 
సుడిగాలి సుధీర్‌ జైల్లోకి రావడంతో సినిమా స్టార్ట్ అవుతుంది. జైలుకి ఎందుకొచ్చావ్‌ అనే ప్రశ్నతో ఫ్లాష్‌ బ్యాక్‌ స్టార్ట్ అవుతుంది. పనీపాట లేకుండా ఊర్లో అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు రాజు(సుడిగాలి సుధీర్‌). ఆటిట్యూడ్‌, యారోగెంట్‌ ఉన్న రాజుని నిద్ర లేపితే నచ్చడు. అలా లేపితే తండ్రినైనా తంతాడు. అలాంటి మొరటోడు పేకాటలో జరిగిన గొడవలో ఊరి సర్పంచ్‌ కొడుకుని కొట్టడంతో అతను చనిపోతాడు. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో హైదరాబాద్‌కి వస్తాడు. ఇక్కడ ఏం చేయాలో తెలియదు. ఆకలి చంపేస్తుంది. బిక్షం అడుక్కునే సప్తగిరి వద్ద డబ్బులు కొట్టేసి కాలేజ్‌ స్టూడెంట్‌ శుక్లా (గెహానా సిప్పి) కంట్లో పడతాడు. తరచూ గొడవలు పడుతూ కనిపించడంతో శుక్లా అతన్ని ఆఫీస్‌ బాయ్‌గా పనిలో పెడుతుంది. అక్కడ చెత్త చేసి జాబ్‌ పోగొట్టుకుంటాడు. మళ్లీ అల్లరిగా తిరిగే క్రమంలో ఓ ఆపద నుంచి శుక్లాని కాపాడతాడు. దీంతో అతన్ని తన ఇంట్లోనే కార్‌ డ్రైవర్‌గా జాబ్‌ పెట్టిస్తుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం, స్నేహం మరింతగా పెరిగి ప్రేమగా మారుతుంది. ఆ ప్రేమ నెక్ట్స్ లెవల్‌లోకి వెళ్లే క్రమంలో ఊర్లో సర్పంచ్‌ కొడుకు హత్య కేసులో జైలుకి వెళ్తాడు. మరి తన ప్రేమ పరిస్థితేంటి? జైలు నుంచి రాజు బయటకు వచ్చాడా? తన ప్రేమ, హత్య కేసులు ఎలాంటి మలుపులు తిరిగాయనేది మిగిలిన కథ. Gaalodu Review


విశ్లేషణః 

సుడిగాలి సుధీర్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చిన `సాఫ్ట్ వేర్‌ సుధీర్‌` డైరెక్టర్‌ రాజశేఖర్‌ పులిచెర్ల ఈ సినిమాని రూపొందించారు. అయితే ఈ కథని లాక్‌ డౌన్‌ని ముందు ఎంపిక చేసినట్టు ఇంటర్వ్యూలో సుధీర్‌ చెప్పాడు. మాస్‌ హీరోగా ఎలివేట్‌ అయ్యేందుకు సుధీర్‌ చేసిన ప్రయత్నం. దర్శకుడు అదే స్టయిల్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఓ పెద్ద మాస్‌ హీరోని దృష్టిలో పెట్టుకుని తీసినట్టుగా సినిమా ఆద్యంతం సాగింది. సుధీర్‌కి బుల్లితెరపై స్టార్‌ ఇమేజ్‌, విపరీతమైన క్రేజ్‌ ఉంది. ఆ ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఈ సినిమా టేకింగ్‌ ఉండటం గమనార్హం. అయితే కథ పరంగా ఇదొక రెగ్యూలర్‌ మూవీనే. కొత్తదనం చెప్పడానికి ఏం లేదు. మాస్‌ యాక్షన్‌ కమర్షియల్‌ మూవీలు ఎలా ఉంటాయో అలానే సాగుతుంది. కాకపోతే సుధీర్‌ లాంటి అప్‌కమింగ్‌ హీరోకి శృతి మించిన ఎలివేషన్లే కాస్త ఇబ్బంది పెట్టే అంశాలు. ఓపెనింగ్‌ ఎలివేషన్లే మరీ ఓవర్‌గా అనిపిస్తుంటాయి. హీరో ఎలివేషన్లకంటే కథపై దృష్టి పెట్టి ఉంటే ఇంకా బాగుండేది. 

సుధీర్‌ జైల్లోకి రావడం అక్కడ ఇతర ఖైదీలు ఆయన్ని ఇబ్బంది పెట్టడం, ఆ తర్వాత పోలీస్‌(30ఇయర్‌ పృథ్వీ)ని సుధీర్‌ కొట్టడంతో ఆ ఖైదీలు అతన్ని చూస్తు బయపడుతూ ఓవర్‌గా రెస్పెక్ట్ ఇవ్వడం కామెడీగా అనిపిస్తుంది. ఆ తర్వాత ఫ్లాష్‌ బ్యాక్‌లో సుధీర్‌ ఊరమాస్‌ లుక్‌లో, పేకాట ఆడుతూ, ఆటిట్యూడ్‌తో కనిపించిన తీరు మాస్‌ హీరోని తలపిస్తుంటాయి. ఇక హత్యకేసులో ఇరుక్కుని వారి నుంచి తప్పుంచుకునే హైదరాబాద్‌ వచ్చి ఆయన చేసే ఆరోగెంట్‌ పనుల్లో సహజత్వం మిస్‌ అయ్యింది. ఇమేజ్‌ వైజ్‌గా ఒకప్పటి చిరంజీవి సినిమాలను తలపిస్తుంటాయి. మరోవైపు హీరోయిన్‌తో లవ్‌ సీన్లు కొత్త మేరకు రిలీఫ్‌నిస్తుంటాయి.హీరోయిన్‌తో రొమాంటిక్‌ సాంగ్‌ కుర్రాళ్లు పండగ చేసుకునే ఉన్నాయి. హీరోయిన్‌ ఇంట్లో షకలక్‌ శంకర్‌, సుధీర్‌ మధ్య వచ్చే సన్నివేశాలు కాసేపు నవ్వులు పూయిస్తుంటాయి. కథ రొటీన్‌గానే ఉండటంతో మున్ముందు ఏం జరుగుతుందో అర్థమవుతుంది. 
 

అయితే సుధీర్‌ తన మార్కు నటనతో ఆకట్టుకున్నారు. మరోవైపు హీరోయిన్‌ ఫ్రెండ్‌, సుధీర్‌ మధ్య వచ్చే సన్నివేశాలు `జబర్దస్త్`ని గుర్తు చేస్తాయి. సినిమాకి ఇది హైలైట్‌గా నిలిచింది. సుధీర్‌ అంటే ఆయన్నుంచి ఫ్యాన్స్ కామెడీ ఎక్స్ పెక్ట్ చేస్తారు. తన మార్క్ కామెడీ ఇందులో ఆశించిన స్థాయిలో ఉండదు. యాక్షన్‌ సినిమా చేసిన ప్రయత్నం కాబట్టి దర్శకుడు కూడా ఆ దిశగా పెద్దగా ఫోకస్ పెట్టలేదు. కానీ ఛాన్స్ ఉన్న చోట మాత్రం గట్టిగానే ట్రై చేశాడు. ఆ విషయంలో సక్సెస్‌ అయ్యారనే చెప్పాలి. ఓవరాల్‌గా ఇది రెగ్యూలర్‌ మాస్‌ కమర్షియల్‌ సినిమా అయినప్పటికీ సుధీర్‌ ఫ్యాన్స్ మాత్రం ఎంజాయ్‌ చేసేలా ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

నటీనటులుః 
రాజు అలియాస్‌ రజనీకాంత్ పాత్రలో సుడిగాలి సుధీర్‌ అదరగొట్టారు. మొరటోడుగా, గాలోడు పాత్రకి యాప్ట్ అనిపించేలా పాత్ర తీరుతెన్నులను తీర్చిదిద్దడం విశేషం. తన పాత్రలో సుధీర్‌ జీవించారు. ఎలివేషన్లు ఎక్కువైనా తన భుజాలపై సినిమాని మోశారు. ఆయన చెప్పే డైలాగ్‌లు బాగున్నాయి. కొన్ని పవర్‌ఫుల్‌గా, కొన్ని సెంటిమెంటల్‌గా ఉండటంతో సుధీర్‌ పాత్రలోని నిజాయితీని ఆవిష్కరించాయి. తన లవర్‌గా శుక్లా పాత్రలో గెహనా సిప్పి ఫర్వాలేదనిపించింది. బిక్షగాడిగా, చివర్లో లాయర్‌గా సప్తగిరి అదరగొట్టారు. మరోవైపు హీరోయిన్‌ ఇంట్లో వంట వాడిగా షకలక శంకర్‌ సైతం రఫ్ఫాడించారు. ఇతర పాత్రలకు పెద్దగా ఆస్కారం లేకపోయినా ఉన్నంతలో ఓకే అనిపించారు. 
 

టెక్నీకల్‌గాః
దర్శకుడు రాజశేఖర్‌ మాస్‌ దర్శకుడిగా సక్సెస్‌ అయ్యాడు. కథ ఎంపికలోనే జాగ్రత్త వహించి ఉండాల్సింది. దీంతో నిజాయితీగా చేసిన ప్రయత్నం కూడా తేలిపోయింది. ట్విస్ట్ లు, టర్న్‌, కామెడీ అంశాలతో సినిమా సాగితే సినిమా నెక్ట్స్ లెవల్‌లోకి వెళ్లేది. ఉన్నంతలో సన్నివేశాలను రక్తికట్టించే ప్రయత్నం చేశాడని చెప్పాలి. డైలాగ్స్ బాగున్నాయి. పవర్‌ఫుల్‌గా, ఎమోషనల్‌గా, సెంటిమెంటల్‌గా ఎక్కడ ఎలా ఉండాలో అలా మోతాదు మించికుండా హైలైట్‌ అయ్యేలా ఉండటం సినిమాకి ప్లస్‌ అయ్యాయని చెప్పొచ్చు. రాంప్రసాద్‌ కెమెరా వర్క్ బాగుంది. రిచ్‌గా తీశారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం సినిమాకి ప్లస్‌ అయ్యాయింది. మాస్‌ సాంగ్‌, రొమాంటిక్‌ సాంగ్‌, బీజీఎం అదరగొట్టారు. ఎడిటింగ్‌ ఇంకాస్త శ్రద్ధ పెట్టాలి. అక్కడక్కడ లాగ్‌ కట్‌ చేస్తే ఇంకా క్రిస్పిగా ఉండేది. నిర్మాణ విలువలకు కొదవ లేదు. బాగా ఖర్చుచేశారు. పెద్ద సినిమా స్థాయిలో తెరకెక్కించారు.  
 

Gaalodu Review

ఫైనల్‌గాః `గాలోడు` సుడిగాలి సుధీర్‌ ఫ్యాన్స్ కోసం. 


రేటింగ్‌ః 2.5

నటీనటులుః సుడిగాలి సుధీర్, గెహ్నా సిప్పి, స‌ప్త‌గిరి, పృథ్విరాజ్, శ‌క‌ల‌క శంక‌ర్‌, స‌త్య క్రిష్ణ‌  త‌దిత‌రులు..
టెక్నీషియన్లుః 
సినిమాటోగ్ర‌ఫి: సి రాం ప్ర‌సాద్‌
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: బిక్ష‌ప‌తి తుమ్మ‌ల‌
స‌మ‌ర్ప‌ణ‌: ప్రకృతి
బేన‌ర్‌: సంస్కృతి ఫిలింస్‌,
ర‌చ‌న - ద‌ర్శ‌క‌త్వం: రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల‌.

Latest Videos

click me!