‘ఆస్తులు తీసుకున్నారు.. ఆరు బయట పడుకోమన్నారు’.. డైరెక్టర్ తేజ జీవితంలో ఇన్ని కష్టాలా?

First Published | May 27, 2023, 7:04 PM IST

డైరెక్టర్ తేజ జీవితం తెలుగు చిత్ర పరిశ్రమలో ముప్పై ఏళ్లకు పైగా గడిచిపోయింది. అయితే తాజా ఇంటర్వ్యూలో తన చిన్నతనంలో ఎదుర్కొన్న సమస్యలను వెల్లడించారు. ఎన్ని కష్టాలు అనుభవించారో చెప్పుకొచ్చారు.
 

తెలుగు చిత్ర పరిశ్రమలో డైరెక్టర్ తేజ (Director Teja) తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పర్చుకున్నారు. తన సినిమాలతో ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ముప్పై ఏళ్లు ఇండస్ట్రీలో వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూనే వస్తున్నారు.
 

ప్రస్తుతం తేజ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం Ahimsa. రానా దగ్గుబాటి తమ్ముడు అభిరామ్ హీరోగా నటించారు. ఈయనకు ఇది తొలిచిత్రం కావడం విశేషం. గీతికా తివారి హీరోయిన్ గా నటించింది. జూన్ 2 ఈ మూవీ థియేటర్లలో విడుదల కాబోతోంది.


ఈ సందర్భంగా తేజ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయా ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో తేజ తన బాల్య జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులు వెల్లడించడం అందరి హృదయాలను కదిలిస్తోంది.
 

ఆయన మాట్లాడుతూ.. ’ నా చిన్నప్పుడు మేం చెన్నైలో ఉండేవాళ్లం. నాకు అక్క, చెల్లి ఉంది. మాకు బాగానే ఆస్తులు ఉండేవి. నాకు ఊహ వచ్చేసరికి మా అమ్మ చనిపోయింది. ఆ కొద్దిరోజులకే నాన్న కూడా కన్నుమూశారు. దాంతో మా జీవితాలు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. 
 

దాంతో మమ్మల్ని మా బంధువులే పోషించారు. ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కరం ఉండాల్సి వచ్చింది. అక్క ఒకచోట, చెల్లి మరో చోట, నేను ఇంకో చోట ఉన్నాం. మమల్ని పెంచినందుకు మా ఆస్తులు కూడా కొన్ని తీసుకున్నారు. కానీ ఒక రోజు నన్ను ఆరుబయట పడుకోమన్నారు. దాంతో నేను అక్కడి నుంచి పారిపోయాను. ఫుట్ పాత్ లపై పడుకొని జీవితం గడిపాను. ఆర్థిక ఇబ్బందులు కూడా చూశాను. 
 

ఏదేమైనా నేనీరోజు ఈ స్థాయి రావడానికి కారణం సినిమానే. మహేశ్ బాబు హీరోగా నటించిన ‘నిజం’ చిత్రం సరిగా ఆడకపోవడంతో సినిమాలపై ఫోకస్ కోల్పోయాను. అదే సమయంలో మా అబ్బాయికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో నాలుగేండ్లు సినిమాకు దూరంగా ఉండాల్సి వచ్చింది. మళ్లీ రానా ‘నేనే మంత్రి నేను రాజు’తో హిట్ అందుకున్నాను.‘ అంటూ చెప్పుకొచ్చారు. ‘అహింస’ తర్వాత తేజ - రానా కాంబోలో మరో చిత్రం రాబోతోంది.
 

Latest Videos

click me!