ఏళ్ల తరబడి వాయిదాలు, సెన్సార్ కష్టాలు దాటుకుని దిల్జిత్ దోసాంజ్ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. 'సట్లజ్' అనే కొత్త పేరుతో విడుదలైన ఈ చిత్రం, మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా కథను తెరపైకి తెచ్చింది.
చాలా కాలం నిరీక్షణ, సెన్సార్ ఇబ్బందుల తర్వాత దిల్జిత్ దోసాంజ్ వివాదాస్పద చిత్రం 'పంజాబ్ 95' ఎట్టకేలకు ఓటీటీలో విడుదలైంది. అయితే, ఈ సినిమా ఇప్పుడు 'సట్లజ్' పేరుతో జీ5 (Zee5)లో స్ట్రీమ్ అవుతోంది. ఎలాంటి హడావుడి లేకుండా, సాయంత్రం 6 గంటలకు ఈ సినిమాను ప్లాట్‌ఫామ్‌పై రిలీజ్ చేశారు. హనీ ట్రెహాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని RSVP, మక్‌గఫిన్ పిక్చర్స్ నిర్మించాయి. ఇందులో దిల్జిత్ దోసాంజ్‌తో పాటు అర్జున్ రాంపాల్, కన్వల్జిత్ సింగ్, సువిందర్ విక్కీ, గీతికా విద్యా ఓహ్లాన్ నటించారు. సెన్సార్ సమస్యల వల్ల ఈ ప్రాజెక్ట్ ఏళ్ల తరబడి ఆగిపోయింది.
23
25,000కు పైగా మిస్సింగ్ కేసులు
ఈ 'సట్లజ్' సినిమా జస్వంత్ సింగ్ ఖల్రా జీవితం ఆధారంగా తెరకెక్కింది. ఆయనొక మానవ హక్కుల కార్యకర్త. 1990లలో పంజాబ్‌లో వేలాది మంది సిక్కు యువకుల అదృశ్యం, ఎన్‌కౌంటర్ల వెనుక ఉన్న నిజాలను ఆయన బయటపెట్టారు. ఆయన పోరాటం వల్ల దాదాపు 25,000కు పైగా మిస్సింగ్ కేసులు వెలుగులోకి వచ్చాయని చెబుతారు. ఈ క్రమంలోనే, 1995లో కొందరు ఆయన్ని కిడ్నాప్ చేసి చంపేశారు. తర్వాత ఈ కేసులో ఆరుగురు పంజాబ్ పోలీసు అధికారులకు శిక్ష పడింది. ఆయన ధైర్యం, త్యాగం, న్యాయం కోసం చేసిన పోరాటాన్ని ఈ సినిమా చూపిస్తుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ సినిమాకు దాదాపు 120 కట్స్ సూచించడంతో ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు.
33
జస్వంత్ సింగ్ ఖల్రా చేసిన సేవ నచ్చి ఈ ప్రాజెక్ట్ ఎంచుకున్నా
ఈ సినిమా గురించి దిల్జిత్ దోసాంజ్ మాట్లాడుతూ.. 'మానవత్వం కోసం జస్వంత్ సింగ్ ఖల్రా చేసిన సేవ నచ్చి ఈ ప్రాజెక్ట్ ఎంచుకున్నా' అన్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా, ఆ కష్టకాలంలో బతికిన వారి అనుభవాలతో ఈ కథ రాశారని, అందుకే స్క్రిప్ట్ తనను కదిలించిందని చెప్పారు. ఖల్రా పాత్ర చేయడం తన కెరీర్‌లోనే చాలా ముఖ్యమైన అనుభవమని దిల్జిత్ అన్నారు. నిజాయితీ, గౌరవంతో ఈ పాత్రను పోషించానని, ఈ సినిమా ధైర్యం, మానవత్వపు విలువలను ప్రతిబింబిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. దర్శకుడు హనీ ట్రెహాన్ కూడా ఏళ్ల నిరీక్షణ తర్వాత సినిమా ప్రేక్షకులకు చేరడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ కథను నిజాయితీగా చెప్పాలనుకున్నామని, 'సట్లజ్' జస్వంత్ సింగ్ ఖల్రా వారసత్వానికి, మానవ స్ఫూర్తికి నివాళి అని ఆయన అన్నారు.