ఎ.ఆర్.మురుగదాస్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన అజయ్ జ్ఞానముత్తు, 2015 లో అరుళ్న్ నిధి నటించిన డీమాంటే కాలనీ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. కొత్త తరహా హారర్ సినిమాగా దీన్ని తీసి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఆ తర్వాత ఇమైక్కా నొడిగళ్, కోబ్రా వంటి సినిమాలు తీసిన అజయ్, గత సంవత్సరం డీమాంటే కాలనీ 2వ భాగాన్ని తీశారు. ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ నేపథ్యంలో, డీమాంటే కాలనీ సినిమా విడుదలై 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేశారు.
ఆ ప్రకటనలో, “ప్రియమైన స్నేహితులకు, సినీ ప్రేక్షకులకు, నా ఆనందాన్ని పంచుకోవడానికి, కృతజ్ఞతలు చెప్పడానికి ఇదే సరైన సమయం. పదేళ్ల క్రితం తమిళ సినీ పరిశ్రమలో చాలా మంది యువ సాంకేతిక నిపుణులతో నా దర్శకత్వ ప్రయాణం మొదలుపెట్టా. ఇప్పుడు నా మొదటి సినిమా 'డీమాంటే కాలనీ' పదేళ్లు పూర్తి చేసుకోవడం ఎంతో భావోద్వేగకరమైన క్షణం. మనం ఇష్టపడి చేసే పనికి మద్దతు, ప్రేమ ఎల్లప్పుడూ లభిస్తుందని నేను భావిస్తున్నాను.
నా మొదటి సినిమా 'డీమాంటే కాలనీ' నేను దర్శకుడిగా ఇంకా ఎక్కువగా పనిచేయడానికి స్పూర్తి ఇచ్చింది. ఎందుకంటే హారర్ సినిమాలు థియేటర్లో ఒక ప్రేక్షకుడిగా నాకు ఎంతో ఉత్సాహాన్నిచ్చేవి. 'ది ఎక్సార్సిస్ట్', 'ది ఓమెన్', 'ది కంజూరింగ్' వంటి క్లాసిక్ హారర్ సినిమాలు అందరికీ మరపురాని అనుభూతినిస్తాయి. ఇలాంటి సినిమాల ప్రభావమే అడ్డంకులను దాటి కొత్త ప్రపంచాన్ని సృష్టించడానికి నన్ను ప్రేరేపించింది. అందుకే 'డీమాంటే కాలనీ' అనే ా హారర్ సినిమాని తీశా.
మోహనా మూవీస్ ఎం.కె.తమిళరసు గారు, అరుళ్నిధి గారు, శ్రీ తేనాండాళ్ ఫిలిమ్స్ మురళి రామస్వామి గారు వంటి వారి మద్దతు లేకుంటే 'డీమాంటే కాలనీ' సినిమా రూపొందేది కాదు. వాళ్ళు నా మీద ఉంచిన నమ్మకానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటా. డీమాంటే కాలనీ సినిమా ఒక జ్ఞాపకంగా కాకుండా కొత్త ప్రపంచంగా మారడాన్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది.
అరుళ్ నిధి గారు 'డీమాంటే కాలనీ' సీక్వెల్స్ కు తన మద్దతు ఇస్తూనే ఉన్నారు. అది నాకు చాలా ధైర్యాన్నిస్తోంది. పరిశ్రమలోని స్నేహితులు, మీడియా , సినీ ప్రేక్షకులు నాకు ఇస్తున్న ప్రేమ ప్రతి దశలోనూ నాణ్యమైన సినిమా అందించాల్సిన బాధ్యతను పెంచుతోంది. ఈ DC సిరీస్ లో రెండు సినిమాలకు వచ్చిన మంచి ఆదరణ వల్ల.. మూడో భాగాన్ని నా బృందంతో కలిసి అన్ని విధాలా నాణ్యంగా, అద్భుతంగా తీస్తున్నాం. ఇది ఖచ్చితంగా సినీ ప్రేక్షకులకు కొత్త తరహా హారర్ అనుభూతినిస్తుందని నమ్ముతున్నా. త్వరలోనే మిమ్మల్ని తదుపరి అప్డేట్ తో కలుస్తా” అని అన్నారు.