
ప్రస్తుతం టాలీవుడ్‌లో సినిమాల షూటింగ్‌లకు సంబంధించిన వివాదం రోజు రోజుకి పెరిగిపోతుంది. 24 క్రాఫ్ట్స్ కి చెందిన ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్(సినీ వర్కర్లు) వేతనాల పెంపు కోసం ఉద్యమం చేస్తున్నారు. నిర్మాతలు(ఫిల్మ్ ఛాంబర్)తో జరిగిన చర్చలు విఫలం కావడంతో ఆగస్ట్ 4 నుంచి కార్మికులు షూటింగ్‌ల బంద్‌కి పిలుపునిచ్చారు. 30శాతం వేతనాలు పెంచి ఇస్తేనే తాము షూటింగ్‌లకు హాజరవుతామని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు 30శాతం వేతనాలు పెంచడం సాధ్యం కాదని నిర్మాతలు తెగేసి చెబుతున్నారు. ఈ వివాదం ఇప్పుడు చిరంజీవి వద్దకు వెళ్లింది. ఆయన నిర్మాతలతో మంగళవారం చర్చలు జరిపారు. సినీ వర్కర్లతోనూ చర్చలు జరుపబోతున్నారు. మరో రెండు రోజుల్లో దీనిపై పరిష్కారం చూపించే ఆలోచనలో చిరంజీవి ఉన్నారు.
వేతనాలు ప్రతి మూడేళ్లకి ఒకసారి రివైజ్ చేయాల్సి ఉంటుంది. పెరిగిన ధరలకు అనుగుణంగా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతున్న నేపథ్యంలో వేతనాలు కూడా పెంచాలనేది లేబర్ యాక్ట్ లోనూ ఉంది. దానికి అనుగుణంగానే తమ వేతనాలు పెంచాలని సినీ వర్కర్లు 30శాతం వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఎక్కువ వేతనాలు ఉన్నాయని, ఇంకా పెంచితే తమకు భారమవుతుందని, ముఖ్యంగా చిన్న సినిమా నిర్మాతలకిది మోయలేని భారమని నిర్మాతలు, ఫిల్మ్ ఛాంబర్ అంటోంది. ఈ విషయంలో రెండు వర్గాలకు మధ్య వివాదం నెలకొంది. ఇది షూటింగ్‌లు బంద్‌కు దారితీసింది.
ఈ వివాదం నేపథ్యంలో అసలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అంటే ఏంటి? ఇందులోని 24 క్రాఫ్ట్ లు ఏంటి? వాళ్లు ఏం చేస్తారనేది ఓసారి తెలుసుకుందాం. సినిమా షూటింగ్‌లకు సంబంధించిన వివిధ విభాగాల్లో పనిచేసే వారిని సినిమా కార్మికులు అంటారు. సినిమాకి వాళ్లు చేసేపనిని బట్టి వారిని 24 క్రాఫ్ట్ లుగా విభజించారు. ఈ 24 విభాగాల వారు సినిమాకి ముఖ్యం. ఒక్క డిపార్ట్ మెంట్ లేకపోయినా షూటింగ్ సాఫీగా సాగదు. ఇందులో సగం ప్రొడక్షన్ విభాగాలు ఉంటే, సగం టెక్నీకల్ విభాగాలుంటాయి. ప్రొడక్షన్ విభాగాల వారిని శ్రమతో కూడిన పని, టెక్నీకల్ విభాగాల వారిది క్రియేటివ్ వర్క్.
టెక్నికల్ విభాగాల్లో 1. డైరెక్షన్ డిపార్ట్ మెంట్, 2.సినిమాటోగ్రఫీ, 3.స్టంట్ డైరెక్టర్స్(యాక్షన్ కొరియోగ్రఫీ), 4.కొరియోగ్రఫీ(డాన్సులు), 5.ఆర్ట్స్ డైరెక్షన్, 6.మ్యూజిక్, 7.ఎడిటింగ్. 8.స్క్రిప్ట్ రైటర్స్, 9.డబ్బింగ్, 10. ఆడియోగ్రఫీ, 11.స్టిల్ ఫొటోగ్రాఫర్స్, 12.పబ్లిసిటీ డిజైనర్స్(ప్రమోషన్స్) ఉన్నాయి. ప్రొడక్షన్ సపోర్టింగ్ డిపార్ట్ మెంట్ విషయానికి వస్తే 13.ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్, 14.మేకప్ ఆర్టిస్ట్ లు, 15.కాస్ట్యూమ్ డిజైనర్స్, 16. లైట్‌మెన్స్, 17. స్టూడియో వర్కర్స్, 18.ప్రొడక్షన్ అసిస్టెంట్లు, `9.సినిమా డ్రైవర్స్, 20.జూ ఆర్టిస్ట్ ఏజెంట్స్. 21.టెక్నీకల్ యూనిట్, 22.ప్రొడక్షన్ ఉమెన్స్, 23.జూనియర్ అర్టిస్ట్ లు, 24.కాస్టింగ్ డిపార్ట్ మెంట్ ఉన్నాయి. ఇందులో ఒక్కో డిపార్ట్ మెంట్ ఏం చేస్తుందనేది చూస్తే.
24 క్రాఫ్ట్స్ లో ఇదే మెయిన్ విభాగం. అన్నింటిని వీరే చూసుకోవాలి. దర్శకుడు వద్ద ఉండే అసిస్టెంట్ డైరెక్టర్లు మిగిలిన 23 క్రాఫ్ట్ లను కంట్రోల్ చేస్తారు. తమకు కావాల్సిన విధంగా వర్క్ జరిగేలా వీరు కోఆర్డినేట్ చేసుకుంటారు. వీరి పని విధానం బట్టే షూటింగ్ సాఫీగా సాగుతుంది. ఔట్‌పుట్ అంత బాగా వస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
డైరెక్షన్ తర్వాత మరో కీలకమైన విభాగం సినిమాటోగ్రఫీ. దీన్ని డైరెక్టర్ ఆ ఫోటోగ్రఫీ అని కూడా అంటారు. సినిమాటోగ్రాఫర్ సినిమా మొత్తాన్ని తన కెమెరాతో బంధించి ఎడిటింగ్ విభాగానికి అందజేస్తారు. ఇందులో మెయిన్‌గా ప్రిన్సిపల్ కెమెరామెన్ ఒకరు ఉంటారు. ఆయన కింద అసిస్టెంట్లు చాలా మందే ఉంటారు. సినిమాని బాగా షూట్ చేయడంలో, దర్శకుడి వ్యూకి తగ్గట్టుగా చిత్రీకరించడంలో వీరి పాత్ర కీలకంగా ఉంటుందని చెప్పొచ్చు.
వీళ్ళు సినిమాల్లో యాక్షన్ సీక్వెన్స్ లను డైరెక్ట్ చేస్తూ ఉంటారు. సినిమాకి దర్శకుడు అన్నీ అయినా సరే స్టంట్ డైరెక్టర్ మాత్రమే ఫైట్లను డిజైన్ చేస్తూ ఉంటారు. అలాగే స్టంట్ ఆర్టిస్టులు కూడా ఇదే క్రాఫ్ట్ కిందకు వస్తారు. ఇందులో ఫైట్లని ఒక్కో కొరియోగ్రాఫర్ డైరెక్ట్ చేస్తుంటారు. కొన్నిసార్లు సినిమాలోని అన్ని ఫైట్లని ఒకే స్టంట్ మాస్టర్ డైరెక్ట్ చేస్తారు. వీరికి అసిస్టెంట్లు ఉంటారు. ఫైట్లు బాగున్నాయని అనిపిస్తే ఆ క్రెడిట్ వీరికే చెందుతుంది.
వీరు సినిమాలో హీరోహీరోయిన్లు చేసే డాన్సులను డిజైన్ చేస్తారు. డాన్సులకు మంచి పేరు వచ్చిందంటే అది వీరి పనే. ఇది కూడా సినిమాకి కీలకమైన విభాగం.
ఆర్ట్ డైరెక్టర్ సినిమాకి సంబంధించి ప్రాపర్టీస్ చూసుకుంటారు. దర్శకుడు రిక్వైర్మెంట్ కి తగినట్లుగా బ్యాగ్రౌండ్ లో ఉండాల్సిన అన్ని విషయాలను ఫైనలైజ్ చేసేది ఈ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వారే. సెట్ డిజైన్, డెకరేషన్ అంతా ఈ విభాగం చూసుకుంటుంది. సినిమాల్లో బ్యాక్ గ్రౌండ్ అందంగా కనిపించే లొకేషన్ అంతా వీరి క్రియేటివిటీనే.
సినిమాకి మరో ముఖ్యమైన విభాగం మ్యూజిక్. సినిమా విజయంలో పాటలు కీలక పాత్ర పోషిస్తాయి. మ్యూజిక్ డైరెక్టర్స్ ఈ పాటలను క్రియేట్ చేస్తుంటారు. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ టీమ్ పనిచేస్తుంటుంది. పాటల రైటింగ్ డిపార్ట్ మెంట్ కూడా ఈ విభాగంలోకే వస్తారు. సింగర్స్ కూడా ఈ విభాగానికి చెందిన వారే.
ఎడిటింగ్ సినిమాకి మరో కీలకమైన విభాగం. దర్శకుడు చాలా సీన్లని షూట్ చేస్తాడు. చాలా యాంగిల్స్ లో చిత్రీకరిస్తారు. వాటన్నింటిని ఒకదగ్గరకు చేర్చి, కథ ఫ్లోకి తగ్గట్టుగా సీన్లని పేర్చి, ఏది బాగుందో ఫైనల్ చేసి, అంతిమంగా సినిమాని రెండున్నర, మూడు గంటలకు కుదించి ఇవ్వడమే వీరి పని. నాలుగైదు గంటల ఫూటేజీని కూడా రెండున్నర గంటలకు కుదించడం వీరి ప్రత్యేకత.
దర్శకుడు అనుకున్న పాయింట్‌ని సినిమా కథగా మల్చడంలో, స్క్రీన్‌ప్లేని రాయడంలో, డైలాగ్‌లు రాయడంలో వీరి పాత్ర ఉంటుంది. సినిమా కథ బాగుంది, మాటలు బాగున్నాయంటే ఈ డిపార్ట్మెంట్ పనే. దర్శకుడికి బ్యాక్ బోన్, సినిమాకి ప్రాణంగా చెప్పాలి.
షూటింగ్లో ఆర్టిస్ట్ లతో చిత్రీకరిస్తారు. వారు చెప్పే డైలాగ్‌లు అప్పుడు క్యాప్చర్ కావు. దీంతో మళ్లీ ప్రత్యేకంగా ఆర్టిస్ట్ లతోగానీ, లేదంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ లతోగానీ వాయిస్ చెప్పించడం వీరి పని. యాక్టర్స్ లిప్‌సింక్ అయ్యేలా డబ్బింగ్ చేయించడం వీరి పని. అయితే కొన్నిసార్లు సింక్ సౌండ్ వాడుతుంటారు. అంటే షూటింగ్ సమయంలోనే డైలాగ్స్ ని క్యాప్చర్ చేస్తారు. అది కూడా ఈ టీమే చూసుకుంటుంది. డబ్బింగ్ ఆర్టిస్ట్ లు కూడా ఇందులో భాగమే.
డబ్బింగ్, రికార్డింగ్, సౌండ్ ఎఫెక్ట్స్ లాంటివన్నీ కూడా ఆడియోగ్రాఫర్లు చూసుకుంటారు. అది లవ్ స్టోరీ అయినా, హారర్, థ్రిల్లర్ అయినా సరే సౌండ్ ఎఫెక్ట్స్ తోటి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో వీరి పాత్ర ఎంతో ఉంటుంది. సౌండ్ మిక్సింగ్, డీఐ లాంటివి వీరు చేస్తుంటారు.
వీరు సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో హీరోహీరోయిన్ల ఫోటోలను కెమెరాల్లో బంధిస్తారు. ప్రమోషన్స్ పర్పస్‌లో విడుదల చేసే పోస్టర్లు వీరు తీసిన ఫోటోలే. ప్రమోషన్స్ పరంగా వీరి పాత్ర కీలకంగా ఉంటుందని చెప్పొచ్చు.
వీరే పోస్టర్ డిజైనర్లు. వీరు సినిమాలోని పవర్‌ఫుల్ ఫోటోలను అందంగా పోస్టర్ లాగా డిజైన్ చేస్తారు. ఆడియెన్స్ ని ఆకట్టుకునేలా ఆ పోస్టర్స్ ని డిజైన్ చేస్తుంటారు.
ప్రొడక్షన్‌కి సంబంధించిన యూనిట్‌ని సెట్‌కి, ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లడానికి డ్రైవర్లకి సంబంధించిన విభాగం కూడా ఉంది. సినిమా షూటింగ్ మొదలు ఫైనల్ అవుట్ ఫుట్ విడుదలయ్యే వరకు దర్శకుడు సహా సినిమా యూనిట్ మొత్తం అనేక ప్రాంతాలకు ప్రయాణించాల్సి ఉంటుంది. వారిని గమ్యస్థానాలకు చేర్చడమే వీరి పని.
ఈ డిపార్ట్మెంట్లో మొత్తం స్త్రీలు మాత్రమే ఉంటారు. వీరు ప్రొడక్షన్ అసిస్టెంట్ల సూచనల మేరకు సినిమా సెట్ మొత్తాన్ని క్లీన్ గా ఉంచుతారు. అలాగే సినిమా యూనిట్ తిన్న భోజన పాత్రలను, వంట పాత్రలను క్లీన్ చేస్తూ ఉంటారు. సినిమా షూటింగ్ ఎడారిలో జరిగినా సముద్రం ఒడ్డున జరిగినా సరే వీరు కచ్చితంగా అక్కడ ఉండి తీరాల్సిందే.
మరో ముఖ్య విభాగం ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్. ఈ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ లు షూట్ మొదలైంది మొదలు, పూర్తయ్యే వరకు అన్నివీరే చూసుకుంటారు. సినిమాల షూటింగ్‌లలో వీరిదే కీలక పాత్ర. ప్రొడ్యూసర్ ఆదేశాల మేరకు వీరు పని చేస్తూ ఉంటారు. ఈరోజు షూటింగ్ కు ఎంతమంది వస్తున్నారు? ఎవరెవరికి కార్లు పంపించాలి? అలాగే వారికి భోజన వసతి, షూటింగ్ అయిన తర్వాత డ్రాప్ చేసే వరకు అన్ని బాధ్యతలు వీరే దగ్గరుండి చూసుకుంటారు. షూటింగ్‌కి కావాల్సిన అన్నీ వీరే అందిస్తుంటారు. వీరు సరిగా పనిచేయలేదంటే అన్నీ ఆగిపోయినట్టే.
ఈ లైటింగ్ విభాగానికి ప్రత్యేకత ఉంది. ఒక రాత్రిని పగలులా మార్చాలి అన్న, పగలు రాత్రిగా మార్చాలన్న తమ లైటింగ్ టెక్నిక్స్ తో వీరు మ్యాజిక్ చేస్తూ ఉంటారు. అవసరానికి అనుగుణంగా వీరు లైటింగ్ ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. క్రేన్స్, జిమ్మీలు ఇలా ఏది వాడినా, వాటిని సెట్ చేసి, లైటింగ్ అమర్చాల్సి ఉంటుంది. వీరి ఫిజికల్ కష్టం చాలా ఎక్కువ.
స్టూడియో వర్కర్స్ వివిధ వర్గాలకు చెందిన కార్పెంటర్లు, పెయింటర్లు సెట్ తయారీదారులు అందరూ కూడా ఈ స్టూడియో వర్కర్ల విభాగానికి వస్తారు. ఆర్ట్ డిపార్ట్మెంట్ కి కావాల్సిన విధంగా వారు కోరిన విధంగా ప్రాపర్టీలు సిద్ధం చేయటమే వీరి పని. ఔట్ డోర్‌లో అయినా, ఇండోర్‌లో అయినా వీరు ఉండాల్సిందే.
వీరినిసెట్ అసిస్టెంట్లని కూడా పిలుస్తూ ఉంటారు. వీళ్ళు సెట్ లో ఉన్న అందరికీ ఆహార పదార్థాలు అందజేస్తూ ఉంటారు. వాటర్, ఫుడ్, డ్రింగ్స్ ఎప్పటికప్పుడు అందిస్తుంటారు. షూటింగ్‌కి ఇబ్బంది జరగకుండా వీరు చూసుకుంటారు.
మేకప్ ఆర్టిస్ట్ లు సినిమా షూటింగ్లో ముఖ్యపాత్ర పోషిస్తారు. ఆర్టిస్ట్ లకు మేకప్ వేస్తుంటారు. ఒక యవ్వనంలో ఉన్న స్త్రీని ముసలిగా మార్చాలన్న, ముసలిగా ఉన్న ముఖాన్ని యవ్వనంగా మార్చాలి అన్న వీరు తమ పనితనాన్ని చూపిస్తారు. మెయిన్ కాస్టింగ్ అందరికీ వీరు మేకప్ చేయాల్సి ఉంటుంది. అయితే పెద్ద స్టార్స్ అందరు పర్సనల్ మేకప్‌మేన్‌లను పెట్టుకుంటారు.
కాస్ట్యూమ్ డిజైనర్లు ఆర్టిస్ట్ ల డ్రెస్‌ని డిసైడ్ చేస్తారు. ఫ్రేమ్లో కనిపించే అందరి బట్టలు ఎలా ఉండాలనేది వీరు డిజైన్ చేస్తుంటారు. దర్శకుడి అవసరానికి తగినట్లుగా వీరు నటీనటులకు దుస్తులు సిద్ధం చేస్తూ ఉంటారు.
సినిమాలో ఆర్టిస్టులు అందరూ తెలిసిన వారే ఉంటారు. కానీ జూనియర్ ఆర్టిస్టులు మాత్రం ఇలా వచ్చి అలా మాయం అవుతుంటాడు కానీ ఫ్రేమ్ నిండుగా ఉండాలంటే వీరు కచ్చితంగా ఉండాల్సిందే. ఫ్రేములో వెనకాల అటు ఇటూ తిరిగేవారంతా వీరే.
పబ్లిసిటీ ఆర్టిస్టులు మీరు వివిధ రకాల మీడియాల ద్వారా సినిమాని పబ్లిసిటీ చేస్తూ ఉంటారు. ఒకప్పుడు కేవలం పోస్టర్ల ద్వారానే పబ్లిసిటీ జరిగేది. కానీ ఇప్పుడు పాటలు ట్రైలర్లు, టీజర్లు ఇలా రకరకాల విధాలుగా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓ రకంగా వీరంతా పీఆర్ టీమ్‌గా చెప్పొచ్చు.
సినిమాకి కావలసిన జూనియర్ ఆర్టిస్టులను వీరు సప్లై చేస్తూ ఉంటారు. జూ ఆర్టిస్ట్ లను తీసుకురావడం, తీసుకుపోవడం వీరి పని.
సినిమా షూటింగ్ అవుట్ డోర్లో జరిగితే ఈ ఔట్ డోర్ యూనిట్ టెక్నీషియన్స్ కచ్చితంగా ఉంటారు. కెమెరా డిపార్ట్మెంట్, లైటింగ్ డిపార్ట్మెంట్ సహా మిగతా అన్ని డిపార్ట్మెంట్ లకు వీరు సహకారం అందిస్తారు.
వీరితోపాటు కాస్టింగ్ ఏజెంట్స్ ఉంటారు. కాకపోతే వీరు ఈ 24 క్రాఫ్ట్ లోకి రారు. వాళ్లు ఆర్టిస్ట్ లను ఎంపిక చేస్తారు. ఏ ఏ పాత్రలకు ఎవరు సూట్ అవుతారనేద నిర్ణయిస్తారు. ఇదంతా దర్శకుడు, డైరెక్షన్ ట్రీమ్ సమక్షంలో జరుగుతుంది. మెయిన్ ఆర్టిస్ట్ లు కూడా ఈ 24 క్రాఫ్ట్స్ లోకి రారు. కానీ వీరంతా కలిసి పనిచేస్తేనే ఒక సినిమా తయారవుతుంది. ఒక్క సినిమాకి మినిమమ్ ఐదు వందల మంద పనిచేయాల్సి వస్తోంది. వీరిలో ఏ విభాగం వారు లేకపోయినా షూటింగ్‌కి ఇబ్బందిగానే ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ అన్ని క్రాఫ్ట్ లకు ఫిల్మ్ ఫెడరేషన్ నాయకత్వం వహిస్తుంది. అందుకే ఫెడరేషన్ అంతటి బలంగా ఉంటుంది.