మెగాస్టార్ చిరంజీవి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందుకున్నారు. `ఖైదీ`, `ఠాగూర్` వంటి బ్లాక్ బస్టర్స్ అందుకున్నా, ఆయన కెరీర్‌లో ప్రత్యేకమైన మూవీ `ఇంద్ర`. పర్‌ఫెక్ట్ కమర్షియల్ మూవీ. మాస్, యాక్షన్, ఎంటర్టైన్‌మెంట్, మ్యూజిక్, ఫన్, రొమాన్స్ ఇలా అన్ని మేళవించిన చిత్రం. అందుకే ఆడియెన్స్ కిది మంచి ట్రీట్‌లా నిలిచింది. అప్పట్లో బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచింది. చిరంజీవి ఇమేజ్‌ని నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్లింది. మెగాస్టార్ బ్రాండ్‌ని సుస్థిరం చేసింది. తిరుగులేని మెగాస్టార్ ని చేసిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
`ఇంద్ర` సినిమాకి బి.గోపాల్ దర్శకత్వం వహించగా, వైజయంతి మూవీస్ పై అశ్వనీదత్ నిర్మించారు. సోనాలీ బింద్రే, ఆర్తి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ విడుదలై 22ఏళ్లు అవుతుంది. ఇప్పుడు మరోసారి ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. చిరంజీవిపుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 22న దీన్ని రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి ఈ సినిమా గురించి మాట్లాడారు. ఆయన ఓ వీడియోని పంచుకున్నారు. ఇందులో ఎమోషనల్ వర్డ్స్ వెల్లడించడం విశేషం.
చిరంజీవి మాట్లాడుతూ, స్టార్టింగ్లోనే `ఇంద్ర.. ఇంద్రసేనా రెడ్డి` అంటూ అదే పవర్, అదే పౌరుషంతో డైలాగ్‌ని చెప్పి కాసేపు అప్పటి రోజులకు తీసుకెళ్లారు. `ఇంద్ర, ఇంద్రసేనా రెడ్డి.. అంటుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయి. అది పవర్ ఆఫ్ ఇంద్ర. అలాంటి పవర్‌ఫుల్ సినిమా, పెద్ద సక్సెస్ సాధించిన చిత్రం ఇంద్ర. అంతటి ప్రజాదరణ పొందడానికి ప్రధాన కారణం ఆ చిత్ర కథ. ఆ సినిమాకి ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడి, శ్రద్ధాసక్తులతో పనిచేశారు. మనసు పెట్టి ప్రాణం పోశారు. ఇప్పటికీ ఆ చిత్రం గురించి, సినిమా కథ గురించి, ప్రతి ఫ్రేముల గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు.
ఏ సీన్ నుంచి చూడటం స్టార్ట్ చేసిన, చివరి వరకు చూడనిదే మనకు వదలబుద్ది కాదు, అలా అంటుంది కథలోని పట్టు, బిగువు. నా చిత్రాల్లో అత్యున్నత సాంకేతిక విలువలున్న ఉత్తమ కమర్షియల్ మూవీ ఇంద్ర. కథ, స్క్రీన్‌ప్లే, డైలాగులు, ఆర్టిస్ట్ ల నటన, ఎమోషన్స్ సీన్లు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సాంగ్స్, ఫైట్స్ ఇలా అన్నీ పీక్స్ లో ఉంటాయి. ఒక్క మాటల్లో చెప్పాలంటే కమర్షియల్ చిత్రానికి పర్‌ఫెక్ట్ నిదర్శనం ఇంద్ర. నిర్మాణ విలువలకు పేరు వచ్చిందంటే ప్రధాన కారణం వైజయంతి మూవీస్. అందరిని మించిన మా మంచి బాలుడు గోపాలుడు అయినటువంటి బి. గోపాల్ అత్యద్భుతంగా సినిమాని చెక్కి ఇంతటి పెద్ద విజయానికి కారణమయ్యాడు. కథ అందించిన చిన్నికృష్ణ, డైలాగ్‌లు రాసిన పరుచూరి బ్రదర్స్, మ్యూజిక్ ఇచ్చిన మణిశర్మ, కెమెరామెన్, డాన్స్ మాస్టర్, ఎడిటర్, ఇలా అందరికి పేరు పేరున ధన్యవాదాలు.
22ఏళ్ల తర్వాత ఈ సినిమా మళ్లీ రీ రిలీజ్ అవ్వడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. జులై 24, 2002న ఎలాంటి భావోద్వేగానికి లోనయ్యానో, ఇప్పుడు కూడా అలానే ఎమోషనల్‌గా ఉంది. ఇప్పటి జనరేషన్‌కి ఈ సినిమాని పెద్ద తెరపై చూపించాలనే ఆలోచన వచ్చి, నా పుట్టిన రోజున గిఫ్ట్ గా అందిస్తున్న నిర్మాత స్వప్న దత్‌కి, సోదరి ప్రియాంక దత్‌కి ప్రత్యేకంగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. చూసే ఆడియెన్స్ కి కూడా పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ అని చెబుతూ, ధన్యవాదాలు` అని వెల్లడించారు చిరు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. ఇక ప్రస్తుతం చిరంజీవి `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. ఇది వచ్చే సంక్రాంతికి విడుదల కాబోతుంది.