
మెగా హీరోలు బాలీవుడ్‌లో సక్సెస్ కాలేకపోయారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్‌చరణ్ నార్త్ లో పాగా వేసేందుకు ప్రయత్నించి బ్యాక్ అయ్యారు. హిందీలో సక్సెస్ కాలేకపోయారు. అయితే ఇప్పుడు కాలం మారింది, పరిస్థితులు మారాయి. దీంతో మళ్లీ దండయాత్ర చేస్తున్నారు. బాలీవుడ్‌లో సక్సెస్ కోసం ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సారైనా హిట్ కొడతారా?..
చిరంజీవి ఇప్పటికే బాలీవుడ్‌లో సినిమాలు చేశారు. కానీ ఒక్కటి మాత్రం సక్సెస్ అయ్యింది. మిగిలిన సినిమాలు పెద్దగా ఆడలేదు. దీంతో మళ్లీ ఆ వైపు ప్రయత్నాలు చేయలేదు మెగాస్టార్. `ప్రతిబంధ్`తో ఆయన బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఈ మూవీ హిట్ అయ్యింది. ఆ తర్వాత `గ్యాంగ్ లీడర్`ని రీమేక్ చేశారు. ఇది యావరేజ్‌గా ఆడింది. `ది జెంటిల్ మ్యాన్` మూవీ రీమేక్ చేశారు. ఇది కూడా పెద్దగా ఆదరణ పొందలేదు.
దీంతో మళ్లీ ఆ వైపు చూడలేదు చిరు. కానీ `సైరా నరసింహారెడ్డి`ని హిందీలోనూ కూడా విడుదల చేశారు. పాన్ ఇండియా మూవీగా దీన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. `సైరా` నార్త్ లో చాలా డల్ కలెక్షన్లని నమోదు చేసుకుంది. ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి బాలీవుడ్ దండయాత్రకి సిద్ధమయ్యాడు చిరు.
ప్రస్తుతం ఆయన `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీని సోషియో ఫాంటసీగా తెరకెక్కిస్తున్నారు. భారీ వీఎఫ్‌ఎక్స్ ఉన్న మూవీ. త్రిష హీరోయిన్. కాస్టింగ్ గట్టిగానే ఉంది. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సారి బాలీవుడ్ మార్కెట్‌ని గట్టిగా ట్రై చేస్తున్నారు. ఇటీవల తెలుగు సినిమాలు నార్త్ లో ఆదరణ పొందుతున్నాయి. దీంతో `విశ్వంభర`తో హిట్ కొట్టి తామేంటో నిరూపించుకోవాలనుకుంటున్నారు చిరు. ఏం జరుగుతుందో చూడాలి. ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది.
అన్నదారిలోనే తమ్ముడు పవన్ కూడా వెళ్తున్నారు. పవన్ `సర్దార్ గబ్బర్ సింగ్` మూవీని హిందీలో కూడా రిలీజ్ చేశారు. కానీ పెద్దగా ఆదరణ పొందలేదు. ఇది తెలుగులోనూ డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. దీంతో పవన్ హిందీ ప్రయత్నం బెడిసికొట్టింది.
ఇప్పుడు ఆయన నార్త్ మార్కెట్‌ని టార్గెట్ చేశారు. `ఓజీ` సినిమాతో ఆయన బాలీవుడ్‌లో పాగా వేయాలనుకుంటున్నారు. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ మూవీ కొంత పార్ట్ షూటింగ్ పెండింగ్‌లో ఉంది. పవన్ 15రోజుల డేట్స్ ఇస్తే షూటింగ్ కంప్లీట్ అవుతుంది. దీన్ని సెప్టెంబర్‌లో ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. దీన్ని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయబోతున్నారు. దీంతో నార్త్ లో పాగా వేయాలని, హిట్ కొట్టాలని చూస్తున్నారు పవన్. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నారు. అర్జున్ దాస్, శ్రియా రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు.
అలాగే రామ్‌చరణ్ కూడా నార్త్ లో సక్సెస్ కావాలని చూస్తున్నారు. ఆయన `జంజీర్`తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. తెలుగులోనూ పెద్ద ఫ్లాప్ అయ్యింది. మళ్లీ ఆ ప్రయత్నం చేయలేదు చరణ్. అయితే `ఆర్‌ఆర్‌ఆర్`తో బాలీవుడ్‌లో సత్తా చాటినా, అది ఆయన సొంత క్రెడిట్‌లోకి వెళ్లదు. దీంతో ఇప్పుడు నార్త్ లో ఎలాగైనా సోలోగా హిట్ కొట్టాలని చూస్తున్నారు.
ప్రస్తుతం ఆయన `గేమ్ ఛేంజర్` చిత్రంలో నటిస్తున్నారు. శంకర్ దర్శకుడు. దీన్ని పాన్ ఇండియా మూవీగా విడుదల చేయబోతున్నారు. ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది. ఈ మూవీతో హిట్ కొట్టి సోలోగా నార్త్ ఆడియెన్స్ కి దగ్గర కావాలని, అక్కడ హిట్ అందుకుని తన మార్కెట్‌ని పెంచుకోవాలని చూస్తున్నారు చరణ్. మరి అది ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఎస్ జే సూర్య, శ్రీకాంత్, అంజలి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.