
శ్రీవిష్ణు(Sri Vishnu) అంటేనే మినిమమ్ గ్యారంటీ హీరో అనే పేరు టాలీవుడ్‌లో పడిపోయింది. జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్న కథా చిత్రాలతో అలరిస్తున్నారు. చివరగా `అర్జున ఫల్గునా` చిత్రంతో నిరాశ పరిచిన ఆయన ఇప్పుడు `భళా తందనాన` చిత్రంతో వస్తున్నారు. కేథరిన్ థ్రెస్సా కథానాయికగా నటించగా, `బాణం` చిత్ర దర్శకుడు చైతన్య దంతులూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం శుక్రవారం(మే 6న) విడుదలైంది. గత చిత్రంతో నిరాశ పరిచిన శ్రీవిష్ణు `భళా తందనాన`(Bhala Thandhanana Movie Review)తో మెప్పించాడా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
డబ్బుకోసం కిడ్నాప్‌ల చుట్టూ తిరిగే కథ ఇది. నిజాయితీ గల జర్నలిస్ట్ గా ఆంధ్రప్రభ వార్త పత్రికలో పనిచేస్తుంది శశిరేఖ(కేథరిన్). డబ్బుకి, అధికారానికి లొంగకుండా నిజాన్ని వెలికితీయడమే లక్ష్యంగా ఆమె పనిచేస్తుంటుంది. ఓ రోజు ఓ చారిటబుల్ ట్రస్ట్ పై రైడ్ జరుగుతున్న ఆమెకి సమాచారం అందుతుంది. న్యూస్ కవర్ చేయడానికి వెళ్లిన ఆమెకి ఆ చారిటబుల్ ట్రస్ట్ లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న చందు(శ్రీవిష్ణు) పరిచయం అవుతాడు. ఆమె ఈ రైడ్ న్యూస్ రాయడం వల్ల ఛారిటీకి రావాల్సిన నిధులు ఆగిపోతాయి, దీంతో అనాథ పిల్లలు రోడ్డున పడతారని, ఆ వార్త పేపర్‌లో రాకుండా ఆమెని కన్విన్స్ చేస్తాడు. ఈ క్రమంలో వారి మధ్య ఏర్పడిన పరిచయం స్నేహంగా మారి ప్రేమకి దారితీస్తుంది. మరోవైపు హవాలా కింగ్ గా ఎదిగిన ఆనంద్ బాలి(గరుడ రామ్)కి చెందిన ముగ్గురు మనుషులు ఓ కిడ్నాప్ లో ఇన్వాల్వ్ అయ్యాక వరుసగా హత్యలకు గురవుతారు. అసలు వాళ్ళు కిడ్నాప్ చేసింది ఎవరిని? వారి హత్యలకు కారణమేంటి? రెండు వేల కోట్లు కొట్టేసింది ఎవరు? ఈ కిడ్నాప్ కేసుకి, డబ్బు దొంగతనానికి చందు, శశిరేఖలకు సంబంధం ఏంటి? అనేది మిగతా కథ.
ఓటీటీ పుణ్యామా అని ప్రస్తుతం అనేక రకాల కథలు సినిమాలు రూపొందుతున్నాయి. ఫ్యామిలీ ఆడియెన్స్ ని అలరిస్తున్నాయి. అందులో క్రైమ్ థ్రిల్లర్స్, ఇలాంటి డబ్బు కోసం కిడ్నాప్ నేపథ్యంలో కథలు చాలా వస్తున్నాయి. అయితే ఇలాంటి కథలతో సినిమా తీయాలంటే అందులో దమ్ముండాలి. చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎంగేజింగ్‌గా, ఎంటర్‌టైనింగ్‌గా చెప్పాలి. కొత్తగా అనిపించాలి. కానీ `భళా తందనాన` సినిమాలో ఆ కొత్తదనం కనిపించడం కష్టమే. `బాణం`, `బసంతి` చిత్రాలతో విమర్శకుల ప్రశంసలందుకున్న దర్శకుడు చైతన్య చాలా గ్యాప్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు. అయితే ఈ సారి కమర్షియల్ అంశాలను జోడించారు. Bhala Thandhanana Review.
సినిమా రెగ్యూలర్‌గానే ఉంటుంది. ఫస్టాఫ్ మొత్తం సాదాసీదాగా సాగిపోతుంది. కిడ్నాప్, వరుస హత్యలు, శ్రీవిష్ణు-కేథరిన్ ల ఫ్రెండ్ షిప్ తో ఫస్టాఫ్ నడుస్తుంది. శ్రీవిష్ణు ఫ్రెండ్ గా నటించిన సత్య కామెడీ ఉన్నంతలో నవ్విస్తుంది. మధ్య మధ్యలో ఆడియెన్స్ కి కాస్త రిలీఫ్‌నిస్తుంది. స్టోరీ ఇంటర్వెల్ ముందు వరకు రెగ్యూలర్‌గానే సాగుతుంది. కానీ ఇంటర్వెల్‌లో వచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. ద్వితీయార్థంపై ఆశలు రేకెత్తిస్తుంది. నిజానికి అసలు కథ మొత్తంగా సెకండాఫ్‌లోనే ఉంటుంది. దీంతో వేగం పుంజుకుంది. రెండు వేల కోట్లు కొట్టేయడానికి వేసే ప్లాన్, పోసాని-సత్య మధ్య వచ్చే కామెడీ ట్రాక్ అలరిస్తాయి. క్లైమాక్స్ ని మాత్రం చాలా కొత్తగా ముగించారు. దీంతో అంతిమంగా ఆడియెన్స్ ని సస్పెన్స్ లో పెట్టారు. అసలు విషయం చెప్పకుండా వదిలేశారు. పార్ట్ 2 కోసమో ఏమో, హీరో పాత్రకి కన్‌క్లూజన్ ఇవ్వలేదు.
సినిమాకి అసలు హీరో ఎవరు? అతను విలన్ ని ఎందుకు టార్గెట్ చేశాడు? అనేవి చూపించలేదు. ఇవి సినిమాలో పెద్ద మైనస్. సినిమా చివరిలో `భళా తందనాన` సీక్వెల్ ఉన్నట్లుగా హింట్ ఇచ్చాడు డైరెక్టర్. బహుశా పార్ట్-2 లో చూపించాలన్న ఉద్దేశంతో ఇప్పుడు రివీల్ చేయలేదేమో. కానీ ఈ కథలో ఇంకో పార్ట్ తీయాల్సిన కంటెంట్ ఏముందనేది పెద్ద ప్రశ్న. ఒక్క సినిమాకే ఎక్కువ. కానీ రెండు పార్టులు చేయడంతో అంతిమంగా ఇంటర్వెల్ వరకు చూసి బయటకు వచ్చినటయ్యింది. ఆడియెన్స్ కి కంప్లీట్ సినిమా చూసిన ఫీలింగ్ మిస్ అవుతుంది.
నటీనటులు, టెక్నీషియన్ల పనితీరు:
శ్రీవిష్ణు `రాజ రాజ చోర` చిత్రంతో ఆకట్టుకున్నారు. కానీ `అర్జున ఫల్గునా`తో నిరాశ పరిచాడు. దీంతో `భళా తందనాన`పై అంచనాలున్నాయి. ఆయన ఈ సారి డిజప్పాయింట్ చేయడనే హోప్స్ తో ఉన్నారు అభిమానులు. కానీ రెండు పార్ట్ లుగా చేసి నిరాశ పరిచారని చెప్పాలి. ఒకే పార్ట్ లో టైట్ స్క్రీన్‌ప్లేతో సినిమాని నడిపించి ఉంటే అదిరిపోయేదనే అభిప్రాయం ఆడియెన్స్ నుంచి వస్తోంది. నటన పరంగా శ్రీవిష్ణు రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించాడు. ఒక వైపు సాఫ్ట్ యువకుడిగా, మరోవైపు మాస్ యువకుడిగా వేరియేషన్ చూపించాడు. కేథరిన్ బలమైన పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. కాకపోతే ఆమె నుంచి గ్లామర్ మిస్ అయ్యింది. విలన్ గా గరుడ రామ్ రాణించాడు. దయామయం పాత్రలో పోసాని కృష్ణమురళి అలరించాడు. సత్య, శ్రీనివాస్ రెడ్డి, అయ్యప్ప పి. శర్మ, చైతన్య కృష్ణ, రవివర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. సాంకేతికంగా సురేష్ రగుతు సినిమాటోగ్రఫీ బాగుంది. మణిశర్మ సంగీతం ఉన్నంతలో ఓకే. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో బాగుంది. నిర్మాణ విలువలకు కొదవలేదు.
ఫైనల్‌గాః `బాహుబలి`, `కేజీఎఫ్`, `పుష్ప` చిత్రాలు రెండు పార్ట్ లుగా వచ్చాయి. అదరగొట్టాయి. ఆ మాయలో పడి `భళా తందనాన`ని రెండు పార్ట్ లుగా ప్లాన్ చేశారేమో కానీ చివరికి అసలుకే మోసం వచ్చింది. `భళా తందనాన` అనిపించుకోలేకపోయింది.
రేటింగ్-2.25
తారాగణం: శ్రీవిష్ణు, కేథరిన్ థ్రెసా, గరుడ రామ్, పోసాని కృష్ణ మురళి, శ్రీనివాస రెడ్డి, సత్య, అయ్యప్ప పి. శర్మ, చైతన్య కృష్ణ, రవివర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదర్శ్ బాలకృష్ణ, భూపాల్ రాజు
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: సురేష్ రగుతు
ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్
నిర్మాత: రజని కొర్రపాటి
దర్శకత్వం: చైతన్య దంతులూరి
బ్యానర్: వారాహి చలన చిత్రం